బొత్స తరతరాల శత్రువు పాదాభివందనంపై మంత్రి రియాక్షన్
ఈ ప్రచారం జరగడానికి అసలు కారణమేంటి? అన్నదానిపై మంత్రి కొండపల్లి ఫుల్ క్లారిటీ ఇచ్చారు.
By: Tupaki Desk | 28 Dec 2024 5:33 PM GMTవైసీపీ సీనియర్ నేత, మండలిలో ఆ పార్టీ నేత బొత్స సత్యనారాయణకు రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాదాభివందనం చేసినట్లు జరుగుతున్న ప్రచారంపై మంత్రి కొండపల్లి ఎట్టకేలకు స్పందించారు. తన ఎదుగుదలను సహించలేక ప్రతిపక్షం ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. ఈ ప్రచారం జరగడానికి అసలు కారణమేంటి? అన్నదానిపై మంత్రి కొండపల్లి ఫుల్ క్లారిటీ ఇచ్చారు.
విజయనగరం జిల్లాకు చెందిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్, మండలిలో ప్రతిపక్ష నేత బొత్స కాళ్లకు నమస్కరించారని గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. మంత్రి అధికార పక్షంలో ఉన్నా, ఆయన బొత్సను డామినేట్ చేయలేకపోతున్నారని, ఇప్పటికీ జిల్లాలో బొత్స హవాయే కొనసాగుతోందని ప్రచారం ఉంది. ఇలాంటి సమయంలో విశాఖ ఎయిర్ పోర్టులో మంత్రి కొండపల్లి, మాజీ మంత్రి బొత్స ఎదురుపడ్డారని, గత సంబంధాల నేపథ్యంలో మంత్రి కొండపల్లి పాదాభివందనం చేశారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.
గత రెండు రోజులుగా ఈ ప్రచారం టీడీపీలో పెద్ద చర్చకు దారితీసింది. వాస్తవానికి మంత్రి కొండపల్లి కుటుంబం తొలి నుంచి టీడీపీలోనే కొనసాగుతోంది. ఆయన తాత కొండపల్లి పైడితల్లినాయుడు ఎంపీగా రెండు సార్లు ప్రస్తుత వైసీపీ నేత బొత్సపైనే గెలిచారు. 1996 నుంచి జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బొత్స వర్సెస్ కొండపల్లి పైడితల్లినాయుడు మధ్య జరిగిన పోటీల్లో కొండపల్లి పైడితల్లి నాయుడు జయకేతనం ఎగురవేసేశారు. 2004లో కూడా ఆయన ఎంపీగా గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారం చేయకుండానే మరణించారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో బొత్స సతీమణి ఝాన్సీలక్ష్మీ బొబ్బిలి ఎంపీగా గెలిచారు. ఇక ఆ తర్వాత 2009 నియోజకవర్గాల పునర్విభజన తర్వాత గజపతినగరం నియోజకవర్గం నుంచి బొత్స సోదరుడు అప్పలనరసయ్య, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ బాబాయ్ అప్పలనాయుడు మధ్య పోటీ జరిగేది. ఈ రెండు కుటుంబాల మధ్య జరిగిన పోటీలో రెండు సార్లు బొత్స సత్యానారాయణ సోదరుడు అప్పలనరసయ్య, మిగిలిన రెండు ఎన్నికల్లో ఒకసారి మంత్రి కొండపల్లి బాబాయ్ కేఏ నాయుడు, మంత్రి శ్రీనివాస్ చెరోసారి గెలిచారు. అయితే 2019 ఎన్నికలకు ముందు అప్పటి ఎమ్మెల్యే కేఏ నాయుడుతో విభేదించి ఆయన సోదరుడు, నేటి మంత్రి శ్రీనివాస్ తండ్రి కొండలరావు వైసీపీలో చేరారు. దీంతో అప్పటి వరకు రెండు కుటుంబాల మధ్య ఉన్న శత్రుత్వం సర్దుమణిగి స్నేహబంధంగా మారింది.
ఈ పరిస్థితుల్లో గత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన టీడీపీ.. విజయనగరం జిల్లా నుంచి మంత్రిగా గజపతినగరం నుంచి గెలిచిన కొండపల్లి శ్రీనివాస్ కు అవకాశం ఇచ్చింది. అయితే రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాలకు ఉత్తరాంధ్ర రాజకీయాలకు చాలా తేడా ఉంటుంది. ఇప్పటికీ ఈ ప్రాంతంలో అధికార, ప్రతిపక్షాలు ఎన్నికల అనంతరం కలిసిమెలిసి ఉండటం ఓ సంప్రదాయంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే గత నవంబరులో మంత్రి శ్రీనివాస్ తోపాటు టీడీపీ ఎమ్మెల్యేలు విశాఖ ఎయిర్ పోర్టులో విమానం కోసం వేచి చూస్తుండగా, వీఐపీ లాంజులోకి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వచ్చారట. ఆయన సీనియర్టీకి గౌరవ సూచకంగా మంత్రితోపాటు టీడీపీ ఎమ్మెల్యేలు అంతా లేచి నిలబడ్డారని చెబుతున్నారు. ఇదే విషయాన్ని మంత్రి కొండపల్లి కూడా అంగీకరించారు.
అయితే మంత్రి, మిగతా టీడీపీ ఎమ్మెల్యేలు బొత్సకు గౌరవ సూచరంగా లేచి నిలబడిన విషయం సోషల్ మీడియాలో మరో విధంగా ప్రచారం జరిగింది. ఈ విషయంపై ఆలస్యంగా ఫోకస్ చేసిన సోషల్ మీడియా ప్రతిపక్ష నేత బొత్సకు మంత్రి పాదాభివందనం చేశారంటూ విస్తృతంగా ప్రచారం జరిగింది. దీనిపై మంత్రిని పార్టీ కూడా ప్రశ్నించడంతో శనివారం విలేకర్ల సమావేశం పెట్టి మరీ మంత్రి వివరణ ఇచ్చుకోవాల్సివచ్చింది. తొలి నుంచి బొత్సను వ్యతిరేకిస్తున్న తమ కుటుంబం ఆయనతో రాజీ పడాల్సిన అవసరం కానీ, తలొగ్గి పనిచేయాల్సిన అవసరం కానీ లేదని, తన ఎదుగులను చూసి ఓర్వలేని వారే ఇలాంటి ప్రచారం చేస్తున్నారని ఖండించారు మంత్రి కొండపల్లి. దీనివెనుక వైసీపీ నేతలు ఉన్నారని చెప్పిన మంత్రి కొండపల్లి.. బొత్స నాయకత్వంలో విజయనగరం జిల్లా ఎలాంటి ప్రగతి సాధించలేదని విమర్శలు చేశారు. సో.. మంత్రి కొండపల్లి స్పందనతో పాదాభివందనం వార్తలపై ఫుల్ క్లారిటీ వచ్చిందని అంటున్నారు. ఏదైనా సరే పదవుల్లో ఉన్నవారు ప్రతిపక్ష నేతలు ఎదురుపడితే చాలా జాగ్రత్తగా ఎంతో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఈ సంఘటనతో మరోసారి రుజువైందని అంటున్నారు.