Begin typing your search above and press return to search.

రైతు ప్రాణం నిలబెట్టిన మంత్రి కొండపల్లి... ప్రభుత్వానికి పాదాభివందనం!

రైతే రాజు అని అంటారు.. రైతు లేకపోతే దేశ భవిష్యత్తే లేదని చెబుతారు.. కానీ ఎన్నో ఇబ్బందులు పాలయ్యే రైతుకు ఆ రాచరికం అక్కరకు రాని సందర్భాలు ఎన్నో ఉన్నాయని అంటారు.

By:  Tupaki Desk   |   13 Feb 2025 11:01 AM GMT
రైతు ప్రాణం నిలబెట్టిన మంత్రి కొండపల్లి... ప్రభుత్వానికి పాదాభివందనం!
X

రైతే రాజు అని అంటారు.. రైతు లేకపోతే దేశ భవిష్యత్తే లేదని చెబుతారు.. కానీ ఎన్నో ఇబ్బందులు పాలయ్యే రైతుకు ఆ రాచరికం అక్కరకు రాని సందర్భాలు ఎన్నో ఉన్నాయని అంటారు. పైగా.. ఎన్ని ప్రభుత్వాలు మారినా రైతు సమస్యలు వారికి లాస్ట్ ఆప్షన్ అనే మాటలూ వినిపిస్తుంటాయి.

అయితే మిగిలిన ప్రభుత్వాల సంగతేమో కానీ.. తమ ప్రభుత్వం లెక్కే వేరని.. రైతు కష్టం వచ్చిందంటే గంటల్లో సమస్యను పరిష్కరిస్తామని.. తమది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అని చేసి చూపించారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్. దీంతో... ఆ రైతు అటు ఇంట్లోనూ, ఇటు పొలంలోనూ మంత్రుల ఫోటోలు పెట్టుకుంటున్నారు.

అవును... అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం, నార్పల మండలం వెంకటాపల్లి గ్రామానికి చెందిన రైతు కొరకుటి శ్రీనివాసులు పంట ఎండిపోతోంది. నీళ్లు పడే బొరు ఉన్నప్పటికీ కరెంట్ లేక, అందుకోసం అధికారుల చుట్టూ, ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం దక్కలేదు. నెలలు తరబడి పోరాటం చేస్తున్నా పరిస్థితి మారడం లేదు.

ఈ సందర్భంగా స్పందించిన రైతు.. తన పైన కక్ష కట్టి కొంతమంది ఓర్వలేక కరెంటు లైన్ రానివ్వకుండా అధికారులపై ఒత్తిడి పెట్టి తొమ్మిది నెలలుగా వేధించారని చెబుతున్నారు. పొలం ఎండిపోతోంది.. పుష్కలంగా నీళ్లు పడ్డాయి.. అయినా ఏమి చేయలేని నిస్సహాయతతో తాను, తన కుటుంబం ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

ఆ సమయంలో ఆ నోట ఈ నోట చేరి తన పరిస్థితి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల వద్దకు చేరిందని.. ఈ సమయంలో కొంతమంది తన సమస్యపై స్పందించారని తెలిపారు. ఈ సందర్భంగా... ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదని.. ధైర్యంగా ఉండండని.. కచ్చితంగా మంచి జరుగుతుందని ధైర్యం చెప్పారని వెల్లడించారు.

ఈ సందర్భంగా... టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగే ప్రజావేదిక వద్దకు వెళ్లి ఈ సమస్యను తెలియజేస్తే.. విషయం నారా లోకేష్ దృష్టికి వెళ్తుందని.. దీంతో అధికారులతో వెంటనే మాట్లాడతారని.. ఫలితంగా సమస్య తీరిపోతుందని తనకు ధైర్యం చెప్పారని అన్నారు. దీంతో వెంటనే తాను విజయవాడ కేంద్ర కార్యాలయానికి బయలుదేరినట్లు రైతు తెలిపారు.

ఈ నేపథ్యంలోనే తన సమస్య గురించి వినగానే మంత్రి కొండపల్లి శ్రీనివాస్, గండి బాబ్జి ధైర్యం చెప్పారని.. అనంతరం అనంతపురం జిల్లా కలెక్టర్, పలువురు అధికారులను ఆదేశించారని.. ఈ సమయంలో తనకు కొంత ధైర్యం వచ్చిందని అన్నారు. ఆ మరుసటి రోజు నేరుగా జిల్లా కలెక్టర్ దగ్గరకు వెళ్లి కలిసినట్లు వెల్లడించారు.

తర్వాత సరిగ్గా నాలుగు రోజులకు పోలీసు అధికారులతో రెవెన్యూ అధికారులు ఎలక్ట్రికల్ అధికారులు అంతా వచ్చారని.. వెంటనే మోటార్ బోర్ కనెక్షన్ కి విద్యుత్ లైన్ లాగడం మొదలుపెట్టారని.. అప్పుడు తనకు కొండంత ధైర్యం వచ్చిందని.. బ్రతుకు మీద ఆశ కలిగిందని రైతు తెలిపారు.

ఈ సందర్భంగా.. తనను, తన కుటుంబాన్ని, తన పంటను కాపాడిన టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్ తో పాటు అచ్చెన్నాయుడు, ప్రధానంగా కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే బాబ్జి, కలెక్టర్, ఎమ్మెల్యే, అధికారులు అందరికీ పాదాభివందనం చేసుకుంటూ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్లు రైతు తెలిపారు.

ఇదే సమయంలో... ఒక రైతు సమస్య తెలియగానే ఇంత వేగంగా స్పందించి రైతు కన్నీళ్లు తుడిచిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే.. తన 60 ఏళ్ల వయసులో ఒక్క టీడీపీ మాత్రమే అని రైతులు వెల్లడించారు. ఈ సందర్భంగా... ఆజన్మాంతం పార్టీకి, కార్యకర్తలకు తాను, తన కుటంబం రుణపడి ఉంటామని రైతు వెల్లడించారు.