సెల్ఫీ తీసుకుంటూ వెనక్కి నడుస్తూ 5గురు చనిపోయారు
జలాశయంలోకి దిగిన తర్వాత.. లోహిత్.. ధనుశ్.. దినేశ్వర్.. జతిన్ లు ఫోనో లో సెల్ఫీలు తీసుకుంటూ నీటిలోకి వెనక్కి నడుస్తూ లోతులోకి జారారు.
By: Tupaki Desk | 12 Jan 2025 8:30 AM GMTపండుగకు కాస్త ముందుగా చోటు చేసుకున్న విషాదం.. పలు కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. హైదరాబాద్ మహానగరానికి చెందిన కుర్రాళ్లు శనివారం సెలవు కావటంతో.. సరదాగా కొండపోచమ్మ సాగర్ డ్యాంలోకి దిగి.. సెల్ఫీల కోసం వెనక్కి నడుస్తూ మునిగిపోయిన దారుణం చోటు చేసుకుంది. సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకున్న ఈ విషాద ఉదంతంలో ఏడుగురు స్నేహితుల్లో ఐదుగురు మృత్యువాత పడ్డారు. మిగిలిన ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. ముషీరాబాద్ ప్రాంతానికి చెందిన జతిన్.. మిర్గానిక్.. ధనుష్.. లోహిత్..దినేష్.. తాయిలు.. మహమ్మద్ ఇబ్రహీం ఏడుగురు మంచి స్నేహితులు.
శనివారం వీకెండ్ కావటంతో ఉదయం 8 గంటల వేళలో టూవీలర్ వాహనాల మీద ఈ ఏడుగురు స్నేహితులు ముషీరాబాద్ నుంచి బయలుదేరారు. టూవీలర్ల మీద కొండపోచమ్మ జలాశయం సందర్శనకు వెళ్లిన వారు.. ఒక్కొక్కరుగా నీటిలోకి దిగి స్నానాలు చేస్తున్నారు. ఫోటోలు.. వీడియోలు తీసుకుంటూ సరదాగా గడుపుతున్నారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కాలుజారి ఒక్కొక్కరుగా గల్లంతయ్యారు.
మహమ్మద్ ఇబ్రహీం.. మిర్గానిక్ లు ఇద్దరు ప్రాణాలతో బయటపడగా.. మిగిలిన వారు గల్లంతయయారు. జరిగిన ఉదంతంపై పోలీసులకు సమాచారం ఇవ్వటంతో.. ఘటనాస్థలానికి వారు చేరుకున్నారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టగా.. ఐదు మృతదేహాలను వెలికి తీశారు. కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.
మరణించిన ఐదుగురిలో ధనుష్.. లోహిత్ ఇద్దరు అన్నదమ్ములు కావటం గమనార్హం. వీరిద్దరు భోలక్ పూర్ డివిజన్ లోని ఇందిరానగర్ లో నివసిస్తూ ఉంటారు. వీరి తండ్రికి ఫోటో స్టూడియో ఉంది. ఆయనకు ఒక కుమార్తె.. ఇద్దరు కుమారులు. చేతికి వచ్చిన కొడుకులు ఇద్దరూ..ఈ రకంగా మృత్యువాత పడటం మింగుడుపడనిదిగా మారింది. బన్సీలాల్ పేటకు చెందిన చీకట్ల దినేశ్వర్ ఇంజనీరింగ్ చదువుతుండగా.. అత్తాపూర్ లోని ఎస్పీ నగర్ కు చెందిన సాహిల్.. ఖైరతాబాద్ కు చెందిన జతిన్ డిప్లొమా చదువుతున్నాడు.
జలాశయంలోకి దిగిన తర్వాత.. లోహిత్.. ధనుశ్.. దినేశ్వర్.. జతిన్ లు ఫోనో లో సెల్ఫీలు తీసుకుంటూ నీటిలోకి వెనక్కి నడుస్తూ లోతులోకి జారారు. రక్షించాలని ఆర్తనాదాలుచేశారు. వీరి పరిస్థితిని గుర్తించిన సాహిల్ వారిని కాపాడేందుకు వెళ్లడంతో వారు గట్టిగా పట్టుకున్నారు. తమను సేవ్ చేయాలని 20 నిమిషాల పాటు సాహిల్ అరిచినా ఎవరూ రాలేదు. ఇదిలా ఉండగా.. మిగిలిన ఇద్దరు భయంతో ఏడుస్తూ పరుగుతీసి..అక్కడ చేపలు పడుతున్న వారికి సమాచారాన్ని ఇచ్చి.. వారిని తీసుకొచ్చే లోపే.. ఐదుగురునీట మునిగారు.
ఈ దుర్ఘటన గురించి సమాచారం అందినంతనే పోలీసులు రాగా.. కాసేపటికే సిద్దిపేట సీపీ అనూరాధ జలాయశయంవద్దకు వచ్చారు. గల్లంతైన వారి కోసం 20 మంది గజ ఈతగాళ్లను.. బోటను తెప్పించి గాలింపు చేపట్టారు. ఈ ప్రక్రియ మొత్తం మధ్యాహ్నం 1.30 గంటలకు మొదలుకాగా.. రాత్రి 7.30 వరకు సాగాయి. ఆ తర్వాత వారిని గుర్తించారు. ఈ విషాద ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ తరహా ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు తగిన చర్యలు చేపట్టాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఉదంతం షాక్ కు గురి చేస్తోంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీఆరఎస్ సీనియర్ నేత కేటీఆర్, హరీశ్ మొదలుకొని.. పలువురు ప్రముఖులు తన విచారాన్ని వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రమాదాలు రిపీట్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.