కొండా సురేఖ రాజకీయ ప్రస్థానం ఇదీ..
తన రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. రాజకీయంగా అణగదొక్కాలని చూసినా మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగుతోంది.
By: Tupaki Desk | 13 Dec 2023 12:30 AM GMTతెలంగాణలో కొండా సురేఖ పేరు తెలియని వారుండరు. ఫైర్ బ్రాండ్ గా ఆమె ప్రస్థానం గురించి తెలుసుకుంటే ఆశ్చర్యం కలగక మాను. పాతికేళ్ల క్రితం ఎంపీగా ప్రస్థానం ప్రారంభించిన ఆమె ప్రస్తుతం మంత్రిగా బాధ్యతలు స్వీకరించింది. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసింది. తన రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. రాజకీయంగా అణగదొక్కాలని చూసినా మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగుతోంది. వరంగల్ రాజకీయాల్లో తనదైన పాత్ర పోషించింది.
వరంగల్ జిల్లా తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాష్ట్ర మంత్రివర్గంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది. 1965 ఆగస్టు 19న జన్మించిన సురేఖ ఎల్బీ కళాశాలలో చదువుకున్నారు. కళాశాలలో చదువుతున్న సమయంలోనే మురళీధర్ రావును ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి ఒక్కగానొక్క కూతురు సుస్మిత పటేల్ సైతం రాజకీయాల్లోకి రావాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
1995లో రాజకీయాల్లోకి వచ్చిన సురేఖ మొదట ఎంపీపీగా ఎన్నికయ్యారు. తరువాత ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యురాలిగా నియమితురాలయ్యారు. 1999లో శాయంపేట నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి మొదటి సారిగా విజయం సాధించారు. 2004, 2009 సంవత్సరాల్లో కూడా కాంగ్రెస్ టికెట్ మీదే పోటీ చేసి గెలుపొందారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. 2014లో బీఆర్ఎస్ నుంచి వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2018లో పరకాల నుంచి పోటీ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం వరంగల్ తూర్పు నుంచి విజయం సాధించిన సురేఖ మంత్రి స్థానం దక్కించుకోవడం విశేషం.
ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో కొండా సురేఖ మంత్రి పదవి దక్కించుకోవడంతో ఆమె మరోసారి తన పట్టు నిలుపుకున్నారు. సాధారణ కార్యకర్తగా రాజకీయ జీవితం ప్రారంభించిన సురేఖ ఎన్నో మైలురాళ్లు దాటింది. మళ్లీ మంత్రిగా ఎన్నిక కావడం పట్ల ఆమె అనుచరులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సురేఖ ఇంకా ఎంతో ఎత్తుకు ఎదగాలని ఆకాంక్షిస్తున్నారు.