తెలంగాణ తెచ్చారు.. తప్పుడు దారిలో వెళ్లారు.. బీఆర్ఎస్ పై కొండా మాటల దాడి
ప్రస్తుతం పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో అత్యంత ధనికుడిగా రికార్డులకెక్కిన ఆయన తన రాజకీయ ప్రస్థానం.. ఎందుకు ప్రజా జీవితంలోకి రావాల్సి వచ్చింది? వంటి వివరాలను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
By: Tupaki Desk | 26 April 2024 4:30 PM GMTటీఆర్ఎస్ గా తెలంగాణ తెచ్చిన పార్టీ.. అధికారంలోకి వచ్చాక కుటుంబ పార్టీగా మారి.. అవినీతిలో చిక్కుకుందని.. బీఆర్ఎస్ గా ఓటమి మూటగట్టుకుందని చేవెళ్ల నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో అత్యంత ధనికుడిగా రికార్డులకెక్కిన ఆయన తన రాజకీయ ప్రస్థానం.. ఎందుకు ప్రజా జీవితంలోకి రావాల్సి వచ్చింది? వంటి వివరాలను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. జీవితంలో అన్ని విధాల స్థిరపడ్డాకే రాజకీయాల్లోకి రావాలని సూచించారు.
ఇది అందరికీ తాను చెప్పే మంచి మాటగా ఆయన పేర్కొన్నారు. తాను బీఆర్ఎస్ లో చేరినప్పుడు రంగారెడ్డి జిల్లాలో ఆ పార్టీ ఉనికే లేదని.. తెలంగాణ కోసం పోరాడుతున్నందుకే 2013లో బీఆర్ఎస్ లో చేరానని వెల్లడించారు. బీఆర్ఎస్ ను రంగారెడ్డి జిల్లాలో బలోపేతం చేశానని చెప్పుకొచ్చారు. కానీ, తెలంగాణ సాకారమయ్యాక బీఆర్ఎస్ మారిపోయిందన్నారు. అధికారం చేపట్టాక కుటుంబ పార్టీగా మారిందని ఆరోపించారు.
నాడు ఎంపీగా.. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి చేవెళ్ల ఎంపీగా నెగ్గిన కొండా.. 2018లో కాంగ్రెస్ లోకి వెళ్లారు. ఆ పార్టీ తరఫున 2019లో పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత బీజేపీలో చేరారు. ఇప్పుడు బీజేపీ అభ్యర్థిగా చేవెళ్ల నుంచి బరిలో నిలిచారు.
కాగా, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక అనేక కుంభకోణాలకు పాల్పడిందని.. తెలంగాణ ఉద్యమకారులను విస్మరించిందని.. ఎవరిని పడితే వారిని పార్టీలో చేర్చుకుని విలువ లేకుండా చేసిందని వ్యాఖ్యానించారు. తెలంగాణ రక్షకులుగా భావించిన వారే తెలంగాణ భక్షకులుగా మారారని కొండా తీవ్రంగా విమర్శించారు.