Begin typing your search above and press return to search.

జిగ్రీ దోస్తుపై రేవంత్ కుట్రలు చేస్తున్నాడా ?!

కానీ కొండా బీజేపీ నుండే పోటీ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో కొండా ఓటమికి రేవంత్ కుట్రలు చేస్తున్నాడని స్వయంగా ఆయనే చెప్పడం చర్చకు తెరలేపింది.

By:  Tupaki Desk   |   4 May 2024 4:30 AM GMT
జిగ్రీ దోస్తుపై రేవంత్ కుట్రలు చేస్తున్నాడా ?!
X

''ఈ ఎన్నికలలో చేవెళ్ల లోక్ సభ స్థానంలో కాంగ్రెస్ ఓటమి ఖాయమని తెలిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలలో నా పేరుతో ఉన్నకొంత మందితో నామినేషన్లు వేయించి తద్వారా ప్రజలలో గందరగోళం రేపుతున్నాడని'' చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆరోపించారు. రేవంత్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డిల మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కాంగ్రెస్ లోకి రావాలని కొండాను రేవంత్ పలుమార్లు ఆహ్వానించాడు. కానీ కొండా బీజేపీ నుండే పోటీ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో కొండా ఓటమికి రేవంత్ కుట్రలు చేస్తున్నాడని స్వయంగా ఆయనే చెప్పడం చర్చకు తెరలేపింది.

ప్రధానమంత్రి మోడీ మీద రేవంత్, తన మీద కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డిలు వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని, దమ్ముంటే భార్య, తల్లి మీద విమర్శలు మాని ప్రజా సమస్యలపై స్పందించాలని కొండా విశ్వేశ్వర్ రెడ్డి సవాల్ విసిరాడు. మోడీ హామీలు గాడిద గుడ్లు అని ప్రచారం చేస్తున్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీల మీద ఏం చెబుతాడని ? అవి ఏ గుడ్లని ప్రశ్నించాడు.

''అప్పు అడిగితే గోడ మీద 'రేపు' అని రాస్తారు.. ఆ రేపు ఎప్పటికీ రాదు. ఆగస్ట్ 15న రైతుల రుణమాఫీ అని చెబుతున్న రేవంత్ రెడ్డి వ్యవహారం కూడా అంతే. మూసీనది సుందరీకరణకు రూ.50 వేల కోట్లు ఖర్చు చేయడం కూడా సరికాదు.' కొండా అభిప్రాయపడ్డాడు. రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న భాష మూలంగా దేశవ్యాప్తంగా తెలంగాణ పరువు, కాంగ్రెస్ పరువు పోతున్నదని, మోడీనీ బడేభాయ్ అన్న రేవంత్ లోక్ సభ ఎన్నికలు రాగానే అవకాశవాద, అనుచిత భాష మాట్లాడుతున్నాడని కొండా విమర్శించాడు.