వైసీపీ డబ్బులు అవసరం లేదు.. కొండేటి అనుచరుల సంచలన వీడియో!
ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ అధికార పార్టీ ఇన్ ఛార్జ్ ల మార్పుకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 20 Dec 2023 2:30 PM GMTఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ అధికార పార్టీ ఇన్ ఛార్జ్ ల మార్పుకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా పలువురు సిట్టింగులకు స్థాన చలనాలు కలిగిస్తుండగా.. మరికొంతమందికి టిక్కెట్ కట్ చేస్తున్నారు సీఎం! అయితే ఇది జగన్ తీసుకున్న బ్లైండ్ డెసిషన్ కాదని... ఎవరికైనా టిక్కెట్ దక్కకపోతే అది పూర్తిగా వారి స్వయంకృతాపరాదమే తప్ప జగన్ తప్పేమీ లేదని మంత్రులు చెబుతున్న సమయంలో... తాజాగా ఒక ఎమ్మెల్యే అనుచరులు జగన్ నిర్ణయంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
అవును... ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సర్వేల ఫలితాలు, మెజారిటీ కార్యకర్తల అభిప్రాయాలు, ప్రజల మనోభావాలకు విలువ నిస్తూ ఇన్ ఛార్జ్ ల మార్పుకు పూనుకున్నారని అంటున్నారు. ఈ విషయంలో మంత్రులు, కీలక నేతలు సైతం జగన్ నిర్ణయానికి శిరస్సా వహిస్తూ.. అల్టిమేట్ గా పార్టీ ముఖ్యమని చెబుతున్న సమయంలో పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబుకు మద్దతుగా స్థానిక నేతలు, కార్యకర్తలు ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఇవి స్థానికంగా వైరల్ గా మారుతున్నాయి.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబుకు ఈ దఫా టిక్కెట్ ఇవ్వకపోవచ్చని కథనాలొస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో జగన్ ఆల్ మోస్ట్ ఫైనల్ డెసిషన్ తీసేసుకున్నారని అంటున్నారు. దీంతో... పి.గన్నవరం వ్యవసాయ సహకార సంఘ అధ్యక్షుడు యన్నాబత్తుల ఆనంద్.. పలువురు కార్యకర్తల సమక్షంలో తాజాగా మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా అధిష్టాణంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇందులో భాగంగా... "మీ అధిష్టాణం నుంచి రూపాయి కూడా అక్కరలేదు.. మేమంతా చేయీ చేయీ కలిపి డబ్బు ఖర్చు పెట్టుకుని కొండేటి చిట్టిబాబుని గెలిపించుకుని ముందుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని చెబుతున్నాను" అని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో పార్టీకి పనిచేసిన వారికి కాకుండా... పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేసినవారికే టిక్కెట్లు కన్ ఫాం చేస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ సమయంలో... జగన్ మోహన్ రెడ్డి చెప్పిన కార్యక్రమాలన్నీ క్రమం తప్పకుండా చేయడమే తప్పేమో అని తాము భావిస్తున్నామని చెబుతున్న కొండేటి చిట్టిబాబు ఫాలోవర్లు... ఎవరో ముక్కూ మొఖం తెలియని వారికి సీటు ఇస్తున్నారని తెలిసిందని అన్నారు. కొండేటి చిట్టిబాబు కూడా ఇంటింటికీ తిరగడం మానేసి, ఆయన రాజకీయం ఆయన చేసి, ఎవరైతే పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారో వారి ఇంటిదగ్గరకు వెళ్లి వారికి జాగీరు చేసి ఉంటే... సీటు వచ్చునేమో అనిపిస్తుందని అన్నారు.
ఇదే క్రమంలో... జగన్ మోహన్ రెడ్డి తమకేమీ పదవులు ఇవ్వలేదని, గుర్తించలేదని, తమను ఏవిధంగానూ ఆదుకోలేదని... తమను ఆదుకున్నదల్లా కొండేటి చిట్టిబాబు మాత్రమే అని యన్నాబత్తుల ఆనంద్ నొక్కి చెప్పారు! కొండేటి చిట్టిబాబు స్థానికంగా నాయకులను గుర్తించారని తెలిపారు. ఈ సందర్భంగా మిథున్ రెడ్డి కానీ, జగన్ మోహన్ రెడ్డి కానీ ఈ విషయంలో పునరాలోచన చేయాలని వారు సూచించారు.
మరి కొండేటి చిట్టిబాబు అనుచరులు చేస్తున్న సూచనలను జగన్ పాటిస్తారా.. మిథున్ రెడ్డి పునరాలోచన చేస్తారా.. అన్నది వేచి చూడాలి. కాగా... తమకు జగన్ ఆదేశాలే శిరోధార్యమని.. జగన్ టిక్కెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా పార్టీ కార్యకర్తలుగా పనిచేస్తామని పలువురు సీనియర్లు, మాజీ మంత్రులు, మంత్రులూ చెబుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో కొండేటి అనుచరుల నుంచి ఈ తరహా స్టేట్ మెంట్ రావడం చర్చనీయాంశం అయ్యింది!
పైరవీలు చేయడం చేతకాదు!:
ఈ సందర్భంగా స్పందించిన కొండేటి చిట్టిబాబు... రిపోర్ట్ తనకు వ్యతిరేకంగా ఉన్నాయని జగన్ చె ప్పారని అన్నారు. అయితే ఆ రిపోర్ట్స్ ఎలా వస్తాయో తనకు తెలియదని.. తనకు పార్టీ కార్యక్రమాలకు కష్టపడటమే తెలుసని, పైరవీలు తెలియడం తనకు తెలియదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో తనకు బ్యాక్ బోన్ అంటూ ఎవరూ లేరని, తాను జగన్ ని మాత్రమే నమ్ముకున్నానని తెలిపారు. ఈ సందర్భంగా ఎవరికి టిక్కెట్ ఇచ్చినా తాను తన కేడర్ ని కలుపుని వెళ్లి సహకరిస్తానని.. అందుకు కేడర్ కలిసిరావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.