బీజేపీలోకి ఆదిమూలం.. టీడీపీ ఏం చేస్తుంది.. ?
ఈ నేపథ్యంలో ఇక, పార్టీలో ఉండడం వల్ల ప్రయోజనం లేదని భావించిన ఆదిమూలం.. తనకు తెలిసిన మిత్రుడి ద్వారా.. బీజేపీ లోకి జంప్ చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
By: Tupaki Desk | 12 Sep 2024 11:30 AMటీడీపీ మహిళానాయకురాలిని లైంగికంగా వేధించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం రాజకీయంగా రూటు మారుస్తున్నట్టు తెలుస్తోంది. ఎన్నికలకు ముందు ఆయన వైసీపీ నుంచి టీడీపీ తీర్థం పుచ్చుకుని విజయం దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే.. ఎన్నికలు పూర్తయి మూడు మాసాలు కూడా కాకముందే.. సొంత పార్టీ నాయకురాలి నుంచే లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్నారు. దీంతో ఆయనపై పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది.
తనను పదే పదే వేధించడంతోపాటు.. పలుమార్లు హోటల్‌కు పిలిచి లైంగికంగా అత్యాచారం చేశారని టీడీపీ మహిళా నాయకురాలు మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అది కూడా హైదరాబాద్ లో కావడం గమనార్హం. దీంతో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు ఆవెంటనే.. ఆదిమూలంపై వేటు వేశారు. అయితే.. ఇదే ఆయనను హర్ట్ చేసినట్టు ఆదిమూలం అనుచరులు చెబుతున్నారు. కనీసం వివరణ కూడా తీసుకోకుండానే కోనేటిపై వేటు వేశారని అప్పట్లోనే ఆదిమూలం అనుచరులు, కుటుంబ సభ్యులు కూడా ఆరోపించారు.
ఈ నేపథ్యంలో ఇక, పార్టీలో ఉండడం వల్ల ప్రయోజనం లేదని భావించిన ఆదిమూలం.. తనకు తెలిసిన మిత్రుడి ద్వారా.. బీజేపీ లోకి జంప్ చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రస్తుతం చెన్నైలోనే ఉన్న ఆదిమూలం.. అక్కడి రాష్ట్ర బీజేపీ చీఫ్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న తన స్నేహితుడి ద్వారా.. ఈ విషయంపై ఇప్పటికే రాయబారాలు నెరుపుతున్నట్టు తెలిసింది. తన తప్పు లేదని.. తన వయసును పరిగణనలోకి తీసుకున్నా.. ఆ విషయం తెలుస్తుందన్నది కోనేటి వాదన.
దీనికి అక్కడి బీజేపీ నాయకులు ఆలోచన చేస్తున్నారని.. వారి ద్వారా రాష్ట్ర నాయకుల దృష్టికి తీసుకువచ్చి.. పార్టీ లో చేర్చుకునే దిశగా వ్యూహాలు రెడీ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. అయితే.. ఈ పరిణామాలు టీడీపీ దృష్టికి కూడా వచ్చినట్టు పార్టీలో చర్చ సాగుతోంది. తమ పార్టీ సస్పెండ్ చేసిన తర్వాత.. ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అభ్యంతరం లేదని సీనియర్ మంత్రి ఒకరు ఆఫ్ దిరికార్డుగా మీడియా ముందు చెప్పారు. అంటే.. ఆదిమూలం విషయంలో చూసీ చూడనట్టే టీడీపీ వదిలేయనుంది. అయితే.. పార్టీలో మాత్రం ఆయనపై సస్పెన్షన్ వేటు కొనసాగనుంది. దీంతోతమకు పెద్ద తలనొప్పి కూడా తగ్గుతుందని.. నాయకులు చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో ఒకటి రెండు వారాల్లో స్పష్టం కానుంది.