కూన అదరహో.. సిక్కోలులోనే ఫస్ట్ లీడర్ ..!
స్థానికంగా కొన్ని దశాబ్దాలుగా ఉన్న డిమాండ్‌ను నెరవేర్చేందుకు ఆయన చిత్తశుద్ధితో ప్రయత్నించారు.
By: Tupaki Desk | 1 Feb 2025 9:30 AM GMTరాజకీయాల్లో మాటల దూకుడే కాదు.. చేతల్లోనూ దూకుడు చూపించాలి. అప్పుడు ఆ నేత తీరే వేరుగా ఉంటుంది. తరచుగా మీడియా ముందుకు వచ్చి.. వైసీపీపై విమర్శలు గుప్పించే సిక్కోలు నాయకుడు, ఆముదాలవలస శాసన సభ్యుడు కూన రవికుమార్.. నోటికే కాదు.. చేతులకు కూడా పని చెప్పారు. స్థానికంగా కొన్ని దశాబ్దాలుగా ఉన్న డిమాండ్‌ను నెరవేర్చేందుకు ఆయన చిత్తశుద్ధితో ప్రయత్నించారు. అది ఇప్పుడు సాకారం దాలుస్తోంది.
ఆముదాలవలస నియోజకవర్గంలో త్వరలోనే భారీ విద్యుత్ ప్లాంటును ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇది సుమారు 1600 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయనుంది. ఈ ప్లాంటు ద్వారా ప్రత్యక్షం గా 4 వేల మందికి ఉద్యోగాలు లభిస్తుండగా.. మరో 10 వేల మందికిపైగా పరోక్ష ఉపాధిని సొంతం చేసుకుంటారు. దీంతో ఆముదాల వలస నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లి పనులు చేసుకునే అవకాశం లేకుండా పోతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
సవాళ్లు ఎదుర్కొని..!
మూడు దశాబ్దాల కిందటే.. ఈ ప్లాంటు ఏర్పాటు చేయాలని భావించారు. కానీ, సరైన ప్రతిపాదనలు, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేవారు పెద్దగా పట్టించుకోలేదు. దీంతో ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వచ్చింది. ఈ దఫా విజయం దక్కించుకున్న కూన రవికుమార్.. ఇక్కడ విద్యుత్ ప్లాంటను ఏర్పాటు చేసి తీరాల్సిం దేనని పట్టుబట్టారు. ఈ ప్రాజెక్టు ప్రాధాన్యాన్ని వివరిస్తూ. .చంద్రబాబు కు సుదీర్ఘ లేఖ రాశారు. తర్వాత నేరుగా అమరావతికి వచ్చి కలిశారు.
కూన ప్రయత్నానికి హర్షం వ్యక్తం చేసిన చంద్రబాబు కొన్నాళ్ల కిందటే ఈ విద్యుత్ ప్లాంటుకు పచ్చజెండా ఊపారు. ఇక, తాజాగా భూమికి సంబంధించిన సర్వే కూడా అయిపోయింది. మొత్తం 30 వేల కోట్లతో రెండు విడతులుగా నిర్మించే ఈ ప్లాంటు 1600 మెగావాట్ల హరిత ఇంధనాన్ని ఉత్పత్తి చేయనుంది. రాష్ట్రాన్ని హరిత ఇంధన హబ్‌గా తీర్చిదిద్దుతున్న సీఎం చంద్రబాబు.. కూన ప్రతిపాదనలకు ఓకే చెప్పడంతో సిక్కోలులో ఏర్పడుతున్న భారీ ప్రాజెక్టు ఇదేనని అంటున్నారు పరిశీలకులు.
గతంలో ఎంతోమంది తీసుకువచ్చేందుకు ప్రయత్నించినా.. సక్సెస్ కాలేక పోయారని.. ఇది కూనవల్లే సాధ్యం అయిందని అంటున్నారు. సిక్కోలులో ఇంత భారీ ప్రాజెక్టును సాధించిన ఏకైక ఎమ్మెల్యేగా ఆయన రికార్డు సృష్టించినట్టేనని చెబుతున్నారు.