జగన్ అసెంబ్లీకి రావాలంటే అలా చేయాలంట !
దానికి ఆయన చెబుతున్న రీజన్ ఏంటి అంటే ఏపీ అసెంబ్లీలో ఏకైక ప్రతిపక్షంగా ఉన్న వైసీపీకి ప్రతిపక్ష హోదాను ఇవ్వాలని.
By: Tupaki Desk | 18 Nov 2024 1:30 PM GMTవైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ ఏపీ అసెంబ్లీకి రావడం మానుకున్నారు. దానికి ఆయన చెబుతున్న రీజన్ ఏంటి అంటే ఏపీ అసెంబ్లీలో ఏకైక ప్రతిపక్షంగా ఉన్న వైసీపీకి ప్రతిపక్ష హోదాను ఇవ్వాలని. దాని మీద వైసీపీ కోర్టుకు కూడా వెళ్లింది. అక్కడ ప్రాసెస్ సాగుతోంది.
ఇదిలా ఉంటే టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారి బడ్జెట్ ని ప్రవేశపెట్టింది.అంతే కాదు అసెంబ్లీ సమావేశాలు కూడా ఎక్కువ రోజులు ఈసారే జరుగుతున్నాయి. అయితే ఎంతో కీలకమైన బడ్జెట్ సమావేశాలకు వైసీపీ గైర్ హాజర్ అయింది. దీని మీద కూటమి నుంచి ఎవరో ఒకరు సెటైర్లు వేస్తూనే ఉన్నారు.
ఇక ఇపుడు టీడీపీ నెల్లూరు రూరల్ జిల్లా ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి వంతు అన్నట్లుగా ఉంది. ఆయన తాజాగా అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్ చాట్ చేస్తూ జగన్ అసెంబ్లీకి రావాలీ అంటే ఏమి చేయాలో ఒక చిట్కాను చెప్పారు. జగన్ ఒక్కరికే మైకుని ఒక గంట పాటు ప్రతీ రోజూ ఇవ్వాలని ఆ సమయంలో ఆయన ప్రసంగానికి ఎవరూ అడ్డు తగలరాదని కోటం రెడ్డి అంటున్నారు.
జగన్ ఏది మాట్లాడినా ఎవరైనా అడ్డు వస్తే ఆయనకు ఇష్టం ఉండదని ఆయనకు ఒకనాటి సన్నిహిత సహచరుడిగా కోటం రెడ్డి ఈ కొత్త పాయింట్ ని చెప్పారు. ఇక జగన్ ఒక్కరే వైసీపీలో మాట్లాడాలని వేరే ఎవరికీ చాన్స్ ఇవ్వరని కూడా ఆయన అంటూ అదే జగన్ కోరుకుంటారని సెటైర్లు వేశారు ఇక 2017 సమయంలో జగన్ పాదయాత్ర చేస్తున్న వేళ ఆయన అసెంబ్లీకి దూరం అయ్యారని అదే సమయంలో పార్టీలోని సీనియర్లను సభకు పంపించలేదని గుర్తు చేశారు. ఎందుకంటే జగన్ కి తాను తప్ప వేరే ఎవరూ అసెంబ్లీలో మాట్లాడకూడదని అది కూడా ఆయనకు ఇష్టం ఉండదని కోటం రెడ్డి అంటున్నారు.
అంతే కాదు జగన్ ప్రతిపక్షంలో ఉన్నపుడు ఏనాడూ ప్రజా సమస్యల కోసం పోరాడిందే లేదు అని ఘాటైన విమర్శలు చేశారు. అసెంబ్లీలో మైక్ కోసమే పోరాడాలి అని జగన్ తమకు చెప్పేవారు తప్ప సమస్యల కోసం కాదని ఆ పార్టీతో సుదీర్ఘ కాలం కలసి నడచిన కోటం రెడ్డి చెప్పడం విశేషం.
ఇవన్నీ పక్కన పెడితే జగన్ అసెంబ్లీకి రావడం లేదని ఆయనను చూసి చాలా రోజులు అయింది అని కూడా కోటం రెడ్డి చమత్కరించడం గమనార్హం. మొత్తం మీద జగన్ కి వీర భక్తుడిని అని చెప్పుకునే కోటం రెడ్డి రెండేళ్ల క్రితం పార్టీ మారారు. ఆయన టీడీపీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచి తన ఆలోచన కరెక్ట్ అని నిరూపించుకున్నారు.
కూటమి ప్రభుత్వంలో ఆయన కంఫర్ట్ గా ఉన్నారు. అయితే జగన్ విషయంలో కోటం రెడ్డి వేసిన పంచులు ఇపుడు వైరల్ అవుతున్నాయి. వైసీపీలో ఎవరూ ఎదగడం జగన్ కి ఇష్టం ఉండదని ఆయన ఒక్కరే సోలోగా కనిపించాలనుకుంటారని కోటం రెడ్డి చెబుతూ జగన్ తీరుని విమర్శించడం పట్ల చర్చ సాగుతోంది. మరి మండలిలో ప్రతిపక్ష నాయకుడిగా బొత్స సత్యనారాయణ ఉన్నారు. ఆయనను కూడా జగన్ అక్కడికి పంపించకుండా రాబోయే రోజులలో అడ్డుకుంటారా అంటే ఏమో కోటం రెడ్డి మాటలువింటే ఆలోచించాల్సిందే అని అంటున్నారు.