చూడాలని ఉంది...జగన్ గురించేనా ?
వైసీపీ చీఫ్ మాజీ సీఎం జగన్ అసెంబ్లీకి రావడం లేదు. ఆయన బడ్జెట్ సెషన్ మీద ఒక మీడియా సమావేశం పెట్టి రెండు గంటల సేపు మాట్లాడారు
By: Tupaki Desk | 19 Nov 2024 2:30 AM GMTవైసీపీ చీఫ్ మాజీ సీఎం జగన్ అసెంబ్లీకి రావడం లేదు. ఆయన బడ్జెట్ సెషన్ మీద ఒక మీడియా సమావేశం పెట్టి రెండు గంటల సేపు మాట్లాడారు. అంతటితో సరి. ఇక బడ్జెట్ సెషన్ కంటిన్యూ అవుతోంది. అయితే అసెంబ్లీలో కూటమి ఎమ్మెల్యేలు కీలక నేతలు సందర్భం వచ్చిన ప్రతీసారీ జగన్ మీద నేరుగా పరోక్షంగా విమర్శలు చేస్తున్నారు.
గత ప్రభుత్వం నిర్వాకం అంటూ ఫైర్ అవుతున్నారు. జగన్ అసెంబ్లీకి రావడం లేదు అందుకే అని అంటున్నారు. ఇదిలా ఉంటే జగన్ అసెంబ్లీకి రావాలని కోరుకుంటున్న వారు ఎంతోమంది ఉన్నారు. తాజా అసెంబ్లీ సెషన్ లోనే బీజేపీ పక్ష నాయకుడు విష్ణు కుమార్ రాజు జగన్ మీద తీవ్ర విమర్శలు చేస్తూ జగన్ పాలనలో ఆయన నిర్ణయాల వల్ల కాంట్రాక్టర్లు అనేక ఇబ్బందులు పడ్డారని విమర్శించారు.అందులో చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారని కూడా హాట్ కామెంట్స్ చేశారు.
ఇవన్నీ అంటూనే ఆయన మరో మాట అన్నారు. జగన్ ఎపుడు అసెంబ్లీకి వస్తారా అని తాను ఎదురుచూస్తున్నాను అని. జగన్ అసెంబ్లీకి వస్తే ఆయన ముందే ఇవన్నీ మాట్లాడాలని రాజు గారి ఆరాటంగా ఉంది అని అంటున్నారు. ఇక జగన్ పార్టీలోనే ఉంటూ రెండేళ్ల క్రితం టీడీపీలో చేరిన నెల్ల్లొరు రూరల్ జిల్లా ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి తాజాగా అసెంబ్లీ లాబీల్లో మీడియాతో చిట్ చాట్ చేస్తూ జగన్ ని చూసి చాలా కాలం అయింది అని అన్నారు. జగన్ అసెంబ్లీకి వస్తే చూడాలని ఉంది అన్నట్లుగా ఆయన అంటున్నారు.
వీటన్నిటి కంటే ముందు రఘురామ క్రిష్ణం రాజు జగన్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేయడానికి సభకు వచ్చినపుడు అసెంబ్లీకి రమ్మని కోరారు. ఇక జగన్ అసెంబ్లీకి ముఖం చూపించలేకనే రావడం లేదని కూటమి పెద్దల నుంచి మంత్రులు అంటున్నారు నిజానికి చూస్తే ఉప్పు లేని పప్పులా ఉంటుంది ప్రతిపక్షం లేని చోట. ప్రతిపక్షం సభకు రావాలి. అధికార పక్షాన్ని నిలదీయాలి. అలాగే అధికార పక్షం కూడా ప్రతిపక్షం గతంలో చేసిన తప్పులను ఎత్తి చూపాలని అనుకుంటుంది.
ఏపీలో చూస్తే 23 మంది ఎమ్మెల్యేలతో టీడీపీ అధినేత చంద్రబాబు సభకు వస్తే వైసీపీ అధికారంలో ఉంటూ టీడీపీని గట్టిగా టార్గెట్ చేసింది. ఇపుడు టీడీపీ పవర్ లో ఉంది. దాంతో వైసీపీకి కేవలం 11 మంది మాత్రమే ఎమ్మెల్యేలు ఉన్నారు దాంతో వారు సభకు వస్తే వారి నిర్వాకం కూడా సభ సాక్షిగా బయటేయాలని చూస్తున్నా ఆ చాన్స్ అయితే జగన్ ఇవ్వడంలేదు.
అందుకే జగన్ సభకు రావాలని కోరుతున్నారా అన్న చర్చ నడుస్తోంది. అయితే సభలో ఇలాంటి రాజకీయ రభస సాగుతుందని జగన్ కి తెలియదేమీ కాదు. అందుకే ఆయన తనకు ప్రతిపక్ష హోదా ఇస్తే సభకు వస్తాను అని అంటున్నారు. ఆ విధంగా హోదా ఇస్తే అధికార కూటమి నుంచి ఎన్ని విమర్శలు వచ్చినా తన వైపు నుంచి కూడా చెప్పుకునేందుకు మైక్ రూల్స్ ప్రకారం కచ్చితంగా దక్కుతుదని ఆయన భావిస్తున్నారు అని అంటునారు. లేకపోతే ఏకపక్షంగా సభ సాగుతుందని అంటున్నారు. ఏది ఏమైనా అతి తక్కువ మందితో జగన్ సభకు వస్తే రాజకీయంగా ఆయనను కార్నర్ చేయాలనుకునే వారికి నిరాశే మిగులుతోంది అని అంటున్నారు.