Begin typing your search above and press return to search.

ఒక్కటి తగ్గింది! అధిష్టానం సరిపెట్టింది! నెల్లూరు కథ సుఖాంతం

ఒక్కటి తగ్గింది..! ఒక్కటి తగ్గింది..! ఒక్కటి తగ్గింది పుష్పా..! అల్లు అర్జున్ సినిమాలో బాగా పాపులర్ అయిన ఈ డైలాగ్ ఇప్పుడు నెల్లూరు పొలిటికల్ స్క్రీన్ పైనా వినిపిస్తోంది.

By:  Tupaki Desk   |   2 Feb 2025 9:30 AM GMT
ఒక్కటి తగ్గింది! అధిష్టానం సరిపెట్టింది! నెల్లూరు కథ సుఖాంతం
X

ఒక్కటి తగ్గింది..! ఒక్కటి తగ్గింది..! ఒక్కటి తగ్గింది పుష్పా..! అల్లు అర్జున్ సినిమాలో బాగా పాపులర్ అయిన ఈ డైలాగ్ ఇప్పుడు నెల్లూరు పొలిటికల్ స్క్రీన్ పైనా వినిపిస్తోంది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో ఒక్కటి తగ్గింది..! ఒక్కటి తగ్గింది..! అంటూ పదేపదే ప్రస్తావిస్తూ ముగించారు. కోటంరెడ్డి నోటి వెంట వచ్చిన ఈ డైలాగ్ టీడీపీ అధిష్ఠానాన్ని అప్రమత్తం చేసిందట.. తమ పార్టీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి కోరుకుంటున్న ఆ ఒక్కటి ఏంటన్నది ఆరా తీసి.. అంతా సెట్ చేసిందట.. ఇంతకీ కోటంరెడ్డి కోరుకున్న ఆ ఒక్కటి ఏంటి? అధిష్ఠానం సరిపెట్టినది ఏంటో చదివేయండి...

పుష్ప సినిమాలో హీరో నుంచి కోట్ల రూపాయల డబ్బు తీసుకున్నా.. మర్యాద లేదన్న బాధతో ఎస్పీ షెకావత్ ఎలా అయితే ఒక్కటి తగ్గింది.. ఒక్కటి తగ్గిందంటూ తనేం కోరుకుంటున్నాడో చెప్పారో.. నెల్లూరు పొలిటికల్ స్క్రీన్ పైనా ఎమ్మెల్యే కోటంరెడ్డి మర్యాద దక్కడం లేదన్న తన ఆవేదనను మీడియా ముఖంగా తెలియజేశారని వినిపిస్తోంది. తనకు అవమానం జరుగుతుందని ఎక్కడా చెప్పకపోయినా, పుష్పా డైలాగ్ ఒక్కటి తగ్గిందని చెబుతూ అధిష్టానానికి పరోక్షంగా హింట్ ఇచ్చినట్లు చెబుతున్నారు. దీంతో నెల్లూరు జిల్లాలో బంపర్ విక్టరీ తెచ్చిపెట్టిన కోటంరెడ్డి బాధ ఏంటో తెలుసుకోవాలని అధిష్టానం వెనువెంటనే పార్టీ బాధ్యులను అప్రమత్తం చేసినట్లు చెబుతున్నారు.

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇటీవల జిల్లాకు చెందిన ఓ మంత్రిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా గత ప్రభుత్వంలో తీవ్ర అవమానం ఎదుర్కొన్న తాను.. ఎన్నికలకు ఏడాదిన్నర ముందే టీడీపీలోకి వచ్చి జిల్లాలో పార్టీ పటిష్టతకు పనిచేసినా తగిన గౌరవం లభించడం లేదని ఆవేదన ఆయనలో కనిపిస్తోంది. ప్రధానంగా నెల్లూరు నగరంలో తన మాటకు విలువ లేకుండా చేస్తున్నారని ఎమ్మెల్యే కోటంరెడ్డి మదనపడుతున్నట్లు చెబుతున్నారు. నెల్లూరు నగరంలో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, సిటీ నుంచి మంత్రి నారాయణ, రూరల్ నుంచి కోటంరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వాస్తవానికి మూడు సార్లు గెలిచిన కోటంరెడ్డి మంత్రి పదవి ఆశించినా, నారాయణకు అధిష్ఠానంతో ఉన్న సాన్నిహిత్యం వల్ల వెనక్కి తగ్గారని చెబుతున్నారు. అయితే ఎన్నికల వరకు తనతో కలిసిమెలిసి పనిచేసిన నారాయణ మంత్రి అయ్యాక తనను పట్టించుకోవడం లేదని కోటంరెడ్డి మనస్తాపం చెందుతున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

మంత్రిగా సిటీతోపాటు రూరల్ నియోజకవర్గంలోనూ నారాయణ పెత్తనం చేయడాన్ని కోటంరెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారని చెబుతున్నారు. అంతేకాకుండా కోటంరెడ్డి అనుచరులు, సన్నిహితులను లక్ష్యంగా చేసుకుని మంత్రి పనిచేస్తున్నారని, వైసీపీకి చెందిన కొందరు నేతలు, కార్యకర్తలు మంత్రి నారాయణను మంచి చేసుకుని పనిచేసుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అగ్నికి ఆజ్యం పోసినట్లు ఇప్పటికే అసంతృప్తితో రగిలిపోతున్న కోటంరెడ్డికి ఈ ఆరోపణలు మరింత ఆగ్రహాన్ని తెచ్చిపెట్టినట్లు చెబుతున్నారు. ఇక అదే సమయంలో కార్పొరేషన్ లో పన్నుల వసూళ్లపై దృష్టి పెట్టిన నారాయణ రూరల్ నియోజకవర్గంలోని పేదలపైనా కనికరం లేకుండా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే కోటంరెడ్డికి ఫిర్యాదులు అందాయి. దీంతో ఇటీవల కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్లిన ఎమ్మెల్యే.. తన నియోజకవర్గంలో పన్ను వసూళ్లపై జోక్యం చేసుకోవద్దని అధికారులకు చెప్పారు. ఇదే సమయంలో మంత్రి నారాయణ జోక్యం పెరిగిపోవడాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ.. ఒక్కటి తగ్గింది డైలాగ్ వినిపించారు.

కోటంరెడ్డి మాస్ రియాక్షన్ తో అప్రమత్తమైన టీడీపీ అధిష్టానం మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డితో మాట్లాడినట్లు తెలుస్తోంది. ఇద్దరూ కలిసిమెలిసి పనిచేయాలని సూచించారట. అదేవిధంగా ఇకపై రూరల్ నియోజకవర్గంలో జోక్యం చేసుకోవద్దని, నెల్లూరులో క్రౌడ్ పుల్లర్ గా కోటంరెడ్డిని గుర్తించాలని మంత్రికి సూచించినట్లు సమాచారం. అధిష్టానం జోక్యంతో ఖుషీ అయిన కోటంరెడ్డి కూడా నెల్లూరు రాజకీయాలపై అప్రమత్తంగా ఉండాలని, ఏ మాత్రం సందు దొరికినా ప్రతిపక్షానికి అవకాశమిచ్చినట్లు అవుతామని పార్టీకి తెలిపినట్లు చెబుతున్నారు. కోటంరెడ్డి అభిప్రాయంతో పార్టీ ఏకీభవించడమే కాకుండా.. ఆయనకు తగిన భరోసా ఇచ్చారంటున్నారు. దీంతో నెల్లూరు పొలిటికల్ వార్ ప్రస్తుతానికి సమసిపోయినట్లు చెబుతున్నారు.