Begin typing your search above and press return to search.

కోటంరెడ్డి ఫుల్ ఖుషీ.. అంతా సెట్ అయినట్లే..!!

నెల్లూరు టీడీపీలో చిర్రుబుర్రులకు ఫుల్ స్టాప్ పడింది. రెండు రోజుల క్రితమే హైకమాండ్ కల్పించుకుని సర్దిచెప్పడం మంచి ఫలితాన్ని ఇచ్చింది

By:  Tupaki Desk   |   4 Feb 2025 7:30 PM GMT
కోటంరెడ్డి ఫుల్ ఖుషీ.. అంతా సెట్ అయినట్లే..!!
X

నెల్లూరు టీడీపీలో చిర్రుబుర్రులకు ఫుల్ స్టాప్ పడింది. రెండు రోజుల క్రితమే హైకమాండ్ కల్పించుకుని సర్దిచెప్పడం మంచి ఫలితాన్ని ఇచ్చింది. డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో రియాక్షన్ స్పష్టంగా కనిపించింది. కార్పొరేషన్ పరిధిలో సిటీ, రూరల్ ఎమ్మెల్యేల మధ్య పొరపొచ్చాలు ఉన్నాయనే ప్రచారం ఇటీవల జోరందుకోగా, ఒక్కటి తగ్గిందంటూ రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి చేసిన కామెంట్స్ నేతల మధ్య విభేదాలు ఉన్నాయనే ప్రచారానికి బలం చేకూర్చింది. అయితే అధిష్ఠానం సర్దిచెప్పడంతో ఇద్దరు నేతలూ కలిసిమెలిసి పనిచేయడంతో నెల్లూరులో డిప్యూటీ మేయరును సునాయాశంగా గెలిపించుకున్నారు.

పేరుకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అయినా మాస్ లీడరుగా ఎమ్మెల్యే కోటంరెడ్డికి నగరమంతా మంచి ఫాలోయింగ్ ఉందని చెబుతారు. బడుగు బలహీన వర్గాల ప్రతినిధిగా ఆయన జోరు చూపిస్తుంటారు. గతంలో వైసీపీ ఎమ్మెల్యేగా ఉండగా, నిధులు లేక రోడ్లు, కాలువలు పాడయ్యాయని ఆ గుంతల్లో కూర్చొని నిరసన తెలిపారు. ఇక టీడీపీలో చేరిన తర్వాత కూడా కోటంరెడ్డి అదే పంథాను కొనసాగిస్తున్నారు. మరోవైపు తన సోదరుడు గిరిధర్ రెడ్డికి మంచి రాజకీయ భవిష్యత్ ఇవ్వాలని భావిస్తున్నారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల తర్వాత గిరిధర్ ను మేయర్ గా చూడాలని అనుకుంటున్నారు. అయితే నెల్లూరు కార్పొరేషన్ లో మంత్రి నారాయణ ప్రాధాన్యం ఎక్కువగా ఉండటంతో కోటంరెడ్డి అలర్ట్ అయ్యారు. ఇప్పుడే తన మాట చెల్లుబాటు కాకపోతే.. భవిష్యత్ లో తన ఆలోచన సాకారం కాదనే ఉద్దేశంతో గళం విప్పారని అంటున్నారు.

కోటంరెడ్డి గురి కుదరడంతో అధిష్టానం జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ సారికి నారాయణ కోరినట్లు చేయు.. వచ్చే ఎన్నికల తర్వాత నీవు కోరుకున్నది చేద్దామనేసరికి తన లక్ష్యానికి మార్గం సుగమైందని కోటంరెడ్డి హ్యాపీ అయ్యారంటున్నారు. దీంతో కార్పొరేషన్ లో టీడీపీకి ఎలాంటి బలం లేకపోయినా డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా మంత్రి నారాయణ ప్రతిపాదించిన అభ్యర్థిని గెలిపించారు. 54 డివిజన్లు ఉన్న నెల్లూరు కార్పొరేషన్ లో గతంలో టీడీపీకి ఒక్క కార్పొరేటర్ కూడా ఉండేవారు కాదు. కోటంరెడ్డి టీడీపీలోకి వచ్చిన తర్వాత పరిస్థితిలో మార్పువచ్చింది. తనతోపాటు మెజార్టీ సంఖ్యలో కార్పొరేటర్లను పార్టీలోకి తెచ్చి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో వైసీపీకి షాక్ ఇచ్చారు. ఈ విజయంతో తనను అవమానించిన వైసీపీపై ప్రతీకారం తీర్చుకోవడంతోపాటు తన సోదరుడి భవిష్యత్ కు రూట్ క్లియర్ చేశాననే ఆనందంతో కోటంరెడ్డి ఫుల్ ఖుషీగా ఉన్నారని చెబుతున్నారు.