కంటతడిపెట్టిన కోటంరెడ్డి... తెరపైకి భార్యా పిల్లలకు వీడియోలు!!
నాడు ఎన్నికల సమయంలో తన కుటుంబం అంతలా ఇబ్బంది పడటానికి కారణం వైసీపీ నేత ఆదాల ప్రభాకర్ రెడ్డి అని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపించారు.
By: Tupaki Desk | 20 Jun 2024 1:06 PM GMTనెల్లూరు రూరల్ ఎమ్మెల్యే, టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తాజాగా మీడియా ముందు కంటతడి పెట్టుకున్నారు. ఈ సందర్భంగా ఎన్నికల సమయంలో వైసీపీ అభ్యర్థి నుంచి తనకు, తన కుటుంబానికి ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయని తెలిపారు. నాడు వారు చేసిన పనులకు రాత్రిళ్లు తన కుటుంబం మొత్తం ఏడ్చిన రోజులు ఉన్నాయని అన్నారు.
అవును... నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తాజాగా మీడియా ముందు కంటతడి పెట్టుకున్నారు. ఎన్నికల సమయంలో రెచ్చిపోయిన వైసీపీ నేతలు... అసభ్యకరమైన వీడియోలు పంపుతూ తన భార్య, పిల్లలను వేధించారని అన్నారు. ప్రతీ అరగంటకూ తన భార్య, కుమార్తెల వాట్సప్ లకు వీడియోలు పంపి టార్చర్ పెట్టేవారని వాపోయారు. ఈ సమయంలోనే ఆయన కనీటిపర్యంతం అయ్యారు.
నాడు ఎన్నికల సమయంలో తన కుటుంబం అంతలా ఇబ్బంది పడటానికి కారణం వైసీపీ నేత ఆదాల ప్రభాకర్ రెడ్డి అని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. నాడు చేసిన ఆ దారుణాలకు ఆదాల ప్రభాకర్ రెడ్డి సమాధానం చెప్పితీరాలని ఆయన డిమాండ్ చేశారు. అసలు ఆదాల ప్రభాకర్ రెడ్డికి నా భార్య, నా కుమార్తెలు ఏమి ద్రోహం చేశారని ప్రశ్నించారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. వీరి దారుణాలు భరించలేక వాట్సాప్ లు బ్లాక్ చేసుకున్నారని అన్నారు.
ఇక పోలింగ్ రోజున జరిగిన విషయాలకొస్తే... ఆ రోజున ప్రతీ 5 నిమిషాలకు, 10 నిమిషాలకూ వీడియోలు పంపారని.. ప్రచారం అయిపోయిందిలే అని తిరిగి వాట్సప్ ఆన్ చేస్తే.. మళ్లీ వెంటనే వీడియోలు పెట్టారని.. అంత దారుణాలు చేసి మానసిక క్షోభ పెట్టింది ఆదాల ప్రభాకర్ రెడ్డి కాదా? అని అన్నారు. వీటన్నింటికీ సమాధానం చెప్పాల్సిందే అని డిమాండ్ చేశారు.
ఇదే క్రమంలో చివరికి పోలింగ్ రోజున పసుపు రంగు ఫ్యాంట్ వేసుకునివెళ్తే దాన్ని చించేశారని చెప్పారు కోటంరెడ్డి. ఈ సందర్భంగా... పోలింగ్ బూత్ కి ఎల్లో ఫ్యాంట్ తీసుకెళ్లకూడదని రూల్ ఏమైనా ఉందా? అని ప్రశ్నించారు. పోలింగ్ బూత్ లో ఫ్యాన్ ఉండోచ్చా.. సైకిల్ రోడ్లపై తిరగొచ్చా.. టీషాపు దగ్గర గాజు గ్లాసు ఉండొచ్చా అని ప్రశ్నించారు.
ఆ మాత్రం నియమాలు కూడా తెలియకుండా విజయ సాయిరెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి వీధి రౌడీల్లా, చిల్లర రౌడీల్లా వ్యవహరించారని కోటంరెడ్డి మండిపడ్డారు. వాస్తవానికి ఇదంతా తనను రెచ్చగొట్టడానికి వారు పన్నిన వ్యూహమని.. ఆ సమయంలో తాను రెచ్చిపోతే.. గూండా, రౌడీ అని ప్రచారం చేసేందుకు ప్లాన్ చేసుకున్నారని కోటంరెడ్డి తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.