రేవంత్ రెడ్డిపై ఆరోపణలు.. కాంగ్రెస్ పార్టీ నేతపై వేటు!
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ముహూర్తం దగ్గరపడుతోంది. అక్టోబర్ మొదటి వారంలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది
By: Tupaki Desk | 28 Sep 2023 6:24 AM GMTతెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ముహూర్తం దగ్గరపడుతోంది. అక్టోబర్ మొదటి వారంలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. నవంబర్ లో ఎన్నికల షెడ్యూల్, డిసెంబర్ మొదటి వారంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు సర్వం సిద్ధమైపోయింది.
ఈ నేపథ్యంలో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ అస్త్రశస్త్రాలతో దూసుకుపోతోంది. వివిధ పార్టీల నుంచి కీలక నేతల చేరికలు ఓవైపు, పార్టీలో ముఖ్య నేతలంతా కలిసికట్టుగా సాగుతుండటం మరోవైపు కలిసి ఆ పార్టీలో ఉత్సాహం తొణికిసలాడుతోంది.
మరోవైపు ఒకరిద్దరు చోటా మోటా నేతలు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి లక్ష్యంగా విమర్శలు చేస్తుండటం కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమైంది. టికెట్లు దక్కే అవకాశం లేని ఒక చోటా నేత అసత్య ఆరోపణలకు దిగడంతో అతడిని పార్టీ నుంచి బహిష్కరించింది.
వివరాల్లోకి వెళ్తే.. రేవంత్ రెడ్డిపై కొత్త మనోహర్ రెడ్డి అనే నేత ఆరోపణలు చేశారు. మహేశ్వరం అసెంబ్లీ టికెట్ కోసం బడంగ్ పేట మేయర్ చిగురింత పారిజాతారెడ్డి నుంచి రేవంత్ రూ.10 కోట్లు తీసుకున్నారని బహిరంగంగా ఆరోపణలు చేశారు. అంతేకాకుండా మరో 5 ఎకరాలను కూడా రేవంత్ తన పేరు మీద రాయించుకున్నారని విమర్శించారు. ఈ నేపథ్యంలో రేవంత్ పై అసత్య ఆరోపణలు చేసిన మనోహర్ రెడ్డిని పార్టీ నుంచి బహిష్కరిస్తూ కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. ఏవైనా ఇబ్బందులు ఉంటే పార్టీ పెద్దల దృష్టికి తీసుకురావాలని.. అలా కాకుండా ఇలా ఎవరైనా రోడ్డు ఎక్కితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆ పార్టీ హెచ్చరికలు జారీ చేసింది.
మరోవైపు తన ఆరోపణలకు ఆధారాలు ఉన్నాయని.. సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు సాక్ష్యాలతో సహా బయటపెడతానని మనోహర్ రెడ్డి చెబుతున్నారు. ఇటీవల ఖమ్మంలో నిర్వహించిన జనగర్జన సభలో రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. మనోహర్ రెడ్డి మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన నేత.
ఉద్దేశపూర్వకంగానే పార్టీలో చేరి ఆ తర్వాత పార్టీపై, పార్టీ నేతలపై విషయం చిమ్మడమే మనోహర్ రెడ్డి లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ నేతలు అంటున్నారు. బీఆర్‌ఎస్ కోవర్టులు కొంతమంది కాంగ్రెస్ లోకి వచ్చి ఎన్నికల ముందు ఇలాంటి ఆరోపణలు చేసి ప్రజల్లో పార్టీకి ఉన్న క్రెడిబిలిటీని దెబ్బతీయడమే వారి అసలు లక్ష్యమంటున్నారు.
ఈ నేపథ్యంలో మనోహర్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు రంగారెడ్డి డీసీసీ ప్రెసిడెంట్ చల్లా నర్సింహా రెడ్డి ప్రకటించారు. రాష్ట్రస్థాయి నాయకులపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మనోహర్ రెడ్డి వ్యాఖ్యలు పార్టీకి నష్టం చేసేలా ఉన్నాయన్నారు. ఏవైనా ఇబ్బందులతో ఉంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జి మాణిక్ థాక్రేతో మాట్లాడాలన్నారు. పార్టీకి నష్టం జరిగేలా ఎవరు వ్యవహరించకూడదని సూచించారు.