Begin typing your search above and press return to search.

జనసేనలోకి కొత్తపల్లి... నరసాపురంలో నాయకర్ పరిస్థితి?

దీంతో ఆయన నరసాపురం నుంచి అసెంబ్లీ టిక్కెట్ ఆశిస్తున్నారనే మాట అనుచరుల నుంచి వినిపిస్తుంది

By:  Tupaki Desk   |   21 Feb 2024 4:30 PM GMT
జనసేనలోకి కొత్తపల్లి... నరసాపురంలో నాయకర్ పరిస్థితి?
X

నరసాపురం నియోజకవర్గంలో ఒక వెలుగు వెలిగిన కీలక నేత, కాపు సామాజికవర్గానికి చెందిన కొత్తపల్లి సుబ్బారాయుడు జనసేనలో చేరేందుకు సిద్ధమవుతున్నారని అంటున్నారు. అనుచరుల కోరికతో పాటు తాజా స్థానిక పరిస్థితుల నేపథ్యంలో జనసేన అయితేనే ఇప్పుడు సేఫ్ అనే ఆలోచనలో ఆయన ఉన్నారని అంటున్నారు. దీంతో ఆయన నరసాపురం నుంచి అసెంబ్లీ టిక్కెట్ ఆశిస్తున్నారనే మాట అనుచరుల నుంచి వినిపిస్తుంది.

అవును... ఎన్నికలు సమీపిస్తున్న వేళ గోదావరి జిల్లాల రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. వెస్ట్ లో ప్రధానంగా ఇటు నరసాపురం, అటు భీమవరం స్థానాల్లో జనసేన అభ్యర్థులు పోటీ చేస్తారని.. మధ్యలో పాలకొల్లులో టీడీపీ నుంచి నిమ్మల రామానాయుడు పోటీ చేస్తారని పొత్తులో భాగంగా చర్చ జరుగుతుందంటూ కథనాలొస్తున్న సంగతి తెలిసిందే! ఈ నేపథ్యంలో భీమవారం నుంచి పవన్ పోటీ కన్ ఫాం అని అంటున్నారు.

మరోపక్క నరసాపురం టిక్కెట్ కూడా జనసేనకే కేటాయించే అవకాశం ఉందని చెబుతున్నారు. దీంతో నరసాపురం జనసేన అభ్యర్థిగా బొమ్మిడి నాయకర్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది! ఈసారి కూడా ఈయనకు జనసేన టిక్కెట్ కన్ ఫాం అని బలంగా చెబుతున్నారు జనసైనికులు! ఈ క్రమంలో కొత్తపల్లి సుబ్బారాయుడు జనసేనలో జాయిన్ అవుతారనే కథనాలొస్తున్న వేళ ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.

వాస్తవానికి నరసాపురం నియోజకవర్గంలో కొత్తపల్లి సుబ్బారాయుడు ఓ వెలుగు వెలిగారు. 1989, 94, 99, 2004లో టీడీపీ నుంచి, 2012లో కాంగ్రెస్ నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ క్రమంలో టీడీపీ నుంచి మంత్రిగానూ పనిచేశారు. అయితే 2009లో పీఆర్పీ నుంచి పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి ముదునూరి ప్రసాద రాజు చేతిలో ఓడిపోవడంతో అక్కడ నుంచి కొత్తపల్లి పొలిటికల్ గ్రాఫ్ తిరోగమనం పట్టిందని అంటారు.

ఈ క్రమంలో రాష్ట్ర విభజన సమయంలో 2014లో తిరిగి టీడీపీలో చేరిన కొత్తపల్లి సుబ్బారాయుడు... కాపు కార్పొరేష‌న్ చైర్మన్‌ గా బాధ్యత‌లు నిర్వర్తించారు. అనంత‌రం 2019లో వైసీపీలో చేరారు. అయితే న‌ర్సాపురం ఎమ్మెల్యే ప్రసాద రాజుతో ఉన్న విభేదాల కార‌ణంగా వైసీపీని వీడారని చెబుతుంటారు. ఈ సమయంలో ఆయన జనసేనలో చేరబోతున్నారని అంటున్నారు.

ఎన్నికలు సమీపిస్తున్న వేళ, పొత్తులో భాగంగా నరసాపురం నియోజకవర్గం జనసేనకే కేటాయిస్తారనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో... ఆయన జనసేనలో చేరి మరోసారి ఎమ్మెల్యేగా పోటీచేయాలని భావిస్తున్నారని తెలుస్తుంది. ఈ మేరకు ప‌వ‌న్‌ తో చ‌ర్చించిన‌ట్టు స‌మాచారం. మరి ఈయన చేరికకు పవన్ అంగీకరిస్తారు కానీ... బొమ్మిడి నాయకర్ ని కాదని ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తారా అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.