Begin typing your search above and press return to search.

చిర్ల వర్సెస్ బండారు... కొత్తపేటలో పరిస్థితి ఏమిటి?

ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని పార్టీలూ ఇప్పటికే అభ్యర్థులను దాదాపుగా ప్రకటించేశాయి.

By:  Tupaki Desk   |   15 April 2024 2:30 AM GMT
చిర్ల వర్సెస్  బండారు... కొత్తపేటలో పరిస్థితి ఏమిటి?
X

ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని పార్టీలూ ఇప్పటికే అభ్యర్థులను దాదాపుగా ప్రకటించేశాయి. దీంతో.. ప్రచార కార్యక్రమాల్లో బిజీ అయిపోయారు నేతలు. పైగా ఈసారి కూడా అన్ని ప్రధాన పార్టీల దృష్టి ప్రధానంగా ఉమ్మడి గోదావరి జిల్లాలపై ఉందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని కొతపేట నియోజకవర్గంలో పరిస్థితి ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం!

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని కొత్తపేట నియోజకవర్గంలో వైసీపీ తరుపున చిర్ల జగ్గిరెడ్డి, కూటమి తరుపున టీడీపీ అభ్యర్థిగా బండారు సత్యానంద రావు బరిలోకి దిగుతున్నారు. వాస్తవానికి ఈ నియోజకవర్గంలో ఇప్పటివరకూ 7 సార్లు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించగా.. 4 సార్లు టీడీపీ, 2 సార్లు వైసీపీ, ఒకసారి జనతాపార్టీ, ఒకసారి ప్రజారాజ్యం విజయం దక్కించుకున్నాయి.

అయితే... 1999 తర్వాత ఇక్కడ టీడీపీ గెలిచింది లేదు! 1999లో గెలిచిన బండారు సత్యానంద రావు 2009లో పీఆర్పీ నుంచి గెలిచారు. ఇక 2004లో కాంగ్రెస్ పార్టీ నుంచి 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి చిర్ల జగ్గిరెడ్డి గెలుపొందారు. 2014 ఎన్నికల్లో బండారు సత్యానందరావు పైనే 713 ఓట్ల మెజారిటీతో మాత్రమే గెలిచిన జగ్గిరెడ్డి.. 2019 ఎన్నికల్లో మాత్రం ఆ మెజారిటీని 4వేల పైచిలుకుకు పెంచుకున్నారు.

ఈ క్రమంలో... ఇప్పటికే నాలుగు సార్లు తలబడిన జగ్గిరెడ్డి - సత్యానందరావులు రానున్న ఎన్నికల్లో ఐదోసారి తలపడనున్నారు. అమలాపురం లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 2,45,355 మంది ఓటర్లు ఉండగా.. వారిలో పురుషులు 1,22,008 మంది కాగా.. మహిళా ఓటర్ల సంఖ్య 1,23,342 గా ఉంది.

ఇక సామాజికవర్గాల పరంగా ఓటర్ల సంఖ్యను పరిశీలిస్తే... ఈ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో అత్యధికంగా కాపు సామాజికవర్గ ఓటర్లు 68 వేల వరకూ ఉండగ... ఎస్సీలు 45వేలు, బీసీల్లో శెట్టిబలిజలు 39 వేలు, రెడ్డి సామాజిక వర్గ ఓటర్లు 16వేలు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈసారి ఇద్దరి మధ్యా హోరా హోరీ పోరు సాగనుందని చెబుతున్నారు. మరి ఈసారి కొత్త పేటలో జగ్గిరెడ్డి & వైసీపీ హ్యాట్రిక్ కొడుతుందా.. లేక, బండారు విజయం సాధిస్తారా అనేది వేచి చూడాలి!