ఎంపీ దాడిపై నోటికి వచ్చినట్లుగా మాట్లాడినోళ్ల సంగతేంది?
సిద్దిపేట జిల్లా మిరుదొడ్డికి మండలానికి చెందిన రాజు.. ఒక యూట్యూబ్ చానల్ లోపని చేస్తున్నట్లుగా గుర్తింపు కార్డులు చూపిస్తారని పేర్కొన్నారు
By: Tupaki Desk | 2 Nov 2023 4:29 AM GMTబీఆర్ఎస్ ఎంపీ.. దుబ్బాక గులాబీ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్న కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తిపోట్లకు పాల్పడిన ఉదంతంపై సిద్దిపేట సీపీ శ్వేత వెల్లడించిన వివరాలు అధికార పార్టీకి ఇబ్బందికరంగా మారాయి. తొలుత రాజకీయ కుట్రగా భావించి ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన గులాబీ నేతలు.. అసలు నిజాలు బయటకు వచ్చిన వేళ.. నాలుక్కర్చుకుంటున్నారు. ఘటన జరిగిన వెంటనే.. వివరాల్ని పూర్తిగా తెలుసుకోకుండా తక్షణ స్పందన వ్యక్తం చేసే క్రమంలో సీఎం కేసీఆర్ అగ్రహాన్నిపలువురు ప్రశ్నిస్తున్నారు.
తమ పార్టీ అభ్యర్థిపై కత్తిపోట్లు చోటు చేసుకున్నంతనే.. అసలు వివరాల్ని తెలుసుకోకుండా.. రాజకీయకుట్రగా అభివర్ణిస్తూ.. ప్రత్యర్థిపార్టీలపై విరుచుకుపడటం.. కాంగ్రెస్ పార్టీనే ఇలాంటి పనులు చేసిందన్న ఆగ్రహాం ఇప్పుడు బ్యాక్ ఫైర్ అయినట్లుగా అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందరిలో ఫోకస్ కావటం.. సంచలనంగా మారాలనుకోవటమే తప్పించి మరెలాంటి కుట్ర కోణం లేదంటూ ఎంపీ కొత్త ప్రభాకర్ పై దాడి ఉదంతాన్ని సిద్దిపేట సీపీ తేల్చేయటం బాగానే ఉన్నా.. ఆ సందర్భంగా అధికార పార్టీ అధినేత కేసీఆర్ తో సహా.. కొందరు నేతలు ప్రదర్శించిన దూకుడు ప్రశ్నగా మారింది.
సిద్దిపేట జిల్లా మిరుదొడ్డికి మండలానికి చెందిన రాజు.. ఒక యూట్యూబ్ చానల్ లోపని చేస్తున్నట్లుగా గుర్తింపు కార్డులు చూపిస్తారని పేర్కొన్నారు. బెదిరింపులకు పాల్పడుతూ.. జనాల నుంచి డబ్బులు తీసుకోవటం అతడికి అలవాటని.. అయితే.. అతడిపై ఎవరూ కంప్లైంట్ చేయని నేపథ్యంలో ఎలాంటి కేసులు నమోదు కాలేదని సీపీ పేర్కొన్నారు. తాను చేసే పని సంచలనంగా మారాలన్నదే రాజు ఉద్దేశమని.. ఇందులో ఎలాంటి కుట్రలు లేవని స్పష్టం చేశారు.
కీలకమైన ఎన్నికల వేళ చోటు చేసుకునే ఈ తరహా ఘటనలపై స్పందించే విషయంలో సంయమనం ప్రదర్శించాల్సి ఉన్నప్పటికీ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రదర్శించిన ఆగ్రహాం ఇప్పుడు బ్యాక్ ఫైర్ అయినట్లుగా చెబుతున్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న కేసీఆర్.. కత్తిపోట్ల ఉదంతంపై అవసరానికి మించిన స్పందించారన్న వ్యాఖ్య వినిపిస్తోంది. తొందరపాటుకు గురి కాకుండా.. వివరాల్ని తెలుసుకున్న తర్వాత మాట్లాడితే బాగుండేందంటున్నారు. తమ తప్పు లేకున్నా.. తమపై నిరాధార ఆరోపణలు చేసిన అధికార పార్టీపై కాంగ్రెస్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తే.. కొత్త తలనొప్పి ఖాయమన్న మాట వినిపిస్తోంది. ఏమైనా.. ఈ ఉదంతం నేర్పిన గుణపాఠం.. విషయం జరిగిన వెంటనే ఎక్స్ ప్రెస్ వేగంతో రియాక్టు అయ్యే కన్నా.. కాస్తంత వివరాలు సేకరించి మాట్లాడి ఉంటే బాగుండేదన్నఅభిప్రాయం వ్యక్తమవుతోంది.