సినిమాలకు ముహుర్తాలు పెట్టే ఆయన ఇక లేరు
తెలుగు సినిమాలకు ముహుర్తాలు పెట్టే విషయంలో చిత్ర పరిశ్రమలోని వారి తలలో నాలుకగా వినిపించే పేరు కొఠారు సత్యనారాయణ చౌదరి.
By: Tupaki Desk | 2 Jan 2025 5:09 AM GMTతెలుగు సినిమాలకు ముహుర్తాలు పెట్టే విషయంలో చిత్ర పరిశ్రమలోని వారి తలలో నాలుకగా వినిపించే పేరు కొఠారు సత్యనారాయణ చౌదరి. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం సింగరాజుపాలెంకు చెందిన ఆయన జ్యోతిష్య.. వాస్తు పండితుడిగా మంచి పేరుంది. సినిమాలకు ముహుర్త సిద్ధాంతిగా ఆయన ఫేమస్. ఆయన చేత తమ సినిమా ప్రారంభ ముహుర్తం పెట్టించుకుంటే సినిమా విజయవంతం కావటం ఖాయమన్న అభిప్రాయం చాలామందిలో ఉంది.
అందుకే.. ఆయన చెప్పిన ముహుర్తాన్ని తూచా తప్పకుండా పాటిస్తుంటారు. అలా ఎన్నో సినిమాలకు ముహుర్తాల్ని పెట్టిన ఆయన కొత్త సంవత్సరం రోజున కన్నుమూశారు. గడిచిన నాలుగు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధ పడుతున్న ఆయన.. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందారు. 75 ఏళ్ల వయసులో అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఆయన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో కోలుకోలేకపోయినట్లుగా వైద్యులు చెప్పినట్లు ఆయన కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
ముహుర్తాల సిద్దాంతిగా అందరూ పిలుచుకునే కొఠారు సత్యనారాయణ చౌదరి అంత్యక్రియలు ఆయన స్వగ్రామమైన తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం సింగరాజు పాలెంలో ఈ రోజు (గురువారం) జరగనున్నాయి. ఆయనకు భార్య అనసూయ.. కొడుకు శ్రీనివాసరావు.. కుమార్తె నాగమణి ఉన్నారు. సినిమాలకే కాకుండా.. రాజకీయ.. ఆర్థిక.. పారిశ్రామిక.. క్రీడలకు సంబంధించిన అంశాలపై జ్యోతిష్యం చెప్పేవారిగా ఆయనకు పేరుంది.