ఇవేం మాటలు కొట్టు? పూజారులపై దాడి చేస్తే ఏమైంది?
తాజాగా అలాంటి వైఖరినే ప్రదర్శించారు మంత్రి కొట్టు సత్యనారాయణ. విలేకరుల సమావేశంలో మాట్లాడిన సందర్భంగా ఆయన నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలు కలకలంగా మారాయి.
By: Tupaki Desk | 4 Oct 2023 4:17 AM GMTఅప్రమత్తంగా ఉండాల్సిన పదవిలో ఉండి.. ఇష్టారాజ్యంగా మాట్లాడేసే రాజకీయ నాయకుల తీరు ఆయా ప్రభుత్వాలకు పెద్ద తలనొప్పిగా మారుతుంటాయి. తాజాగా అలాంటి తీరునే ప్రదర్శిస్తున్నారు ఏపీ అధికార పార్టీకి చెందిన ముఖ్యులు.
తాజాగా అలాంటి వైఖరినే ప్రదర్శించారు మంత్రి కొట్టు సత్యనారాయణ. విలేకరుల సమావేశంలో మాట్లాడిన సందర్భంగా ఆయన నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలు కలకలంగా మారాయి. దేవాలయాల్లో పూజారులపై తమ పార్టీ నేతలు దాడి చేస్తే ఏమైందంటూ? ఆయన ప్రశ్నించిన వైనం షాకిచ్చేలా మారింది.
తమ వాళ్లు ఏం చేసినా సమర్థించుకోవటం బాగానే ఉన్నా.. దాడులపైనా ఇలాంటి వ్యాఖ్యలు చేయటమా? అని విస్మయానికి గురి అవుతున్నారు. అయితే.. మాట జారినట్లుగా నష్ట నివారణ చర్యలు చేపట్టినా.. ఇలాంటి వ్యాఖ్యలు తర్వాతి రోజుల్లోనూ వెంటాడుతాయన్న విషయాన్ని కొట్టు గుర్తు పెట్టుకోవాల్సి ఉంది.
దేవాలయాల్లో పూజారులపై దాడులు జరుగుతున్న విషయాన్ని మీడియా ప్రతినిధులు మంత్రిని ప్రశ్నించగా.. ఆయన స్పందిస్తూ.. 'దాడి చేస్తే ఏమైంది?' అన్న వ్యాఖ్యలతో కంగుతిన్న విలేకరులు.. 'దాడులను సమర్థిస్తున్నారా?దాడులు చేస్తే ఏమైందని అంటున్నారా?' అని ప్రశ్నించినంతనే ఆయన సర్దుకున్నారు.
చేస్తే ఏమైందని తాను అనలేదని.. ఎలా సమర్థిస్తాం? వెంటనే చర్యలు తీసుకున్నాం. ట్రస్టుబోర్డు ఛైర్మన్ తో రాజీనామా చేయించాం. కేసు నమోదు చేశాం. ఏ రకంగా తప్పు పట్టుకోవాలని చూసినా మేం సిద్ధంగా లేం' అంటూ తన మాటల్ని ఆయన సమర్థించుకున్నారు.
ఆలయ టెండర్లు దక్కాలంటే ప్రభుత్వ సలహాదారులు.. మంత్రుల్ని కలవాల్సిన అవసరం లేదని ఒక ప్రశ్నగా సమాధానంగా చెప్పిన ఆయన.. శ్రీశైలం దేవస్థానం క్యూ కాంప్లెక్స్ నిర్మాణ పనులకు సంబంధించిన టెండర్ ప్రక్రియ నిబంధనలకు అనుగుణంగా లేకపోవటంతో మళ్లీ పిలవాలని తాము ఆదేశించినట్లుగా పేర్కొనటం గమనార్హం.