ఎమ్మెల్యేల డిష్యుం.. డిష్యుం.. మంత్రుల ముంగిటే..
Koushik Reddy Blasts Congress Mla Sanjay Kumar
By: Tupaki Desk | 12 Jan 2025 12:49 PM GMTఇద్దరూ ఒక పార్టీ తరఫున గెలిచినవారే.. ఒకరు చాన్నాళ్లు ఒక పార్టీలో ఉండి, ఎన్నికల అనంతరం అధికార పార్టీలోకి మారినవారు. మరొకరు రెండేళ్ల కిందట ప్రతిపక్ష పార్టీ నుంచి అప్పటి అధికార పార్టీలోకి మారి.. ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచినవారు. రాజకీయాలు అంతా సవ్యంగా సాగితే మజా ఏముంటుంది..? ఇప్పుడు ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు వేర్వేరు పార్టీల వారయ్యారు.
హుజూరాబాద్ లో ఆదివారం నిర్వహించిన కరీంనగర్ జిల్లా సమీక్ష సమావేశం రసాభాసగా మారింది. హుజూర్ నగర్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఓ దశలో ఇది అదుపు తప్పింది. వాగ్వాదం కాస్త తోపులాటకు దారితీసింది. ఇద్దరు ఎమ్మెల్యేలూ పరస్పరం చేయి చేసుకున్నారు.
కాగా, ఈ సమీక్ష సమావేశంలో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఐటీ మంత్రి శ్రీధర్ బాబుతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఇక సమీక్ష సమావేశం సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ మైక్ తీసుకుని మాట్లాడే ప్రయత్నం చేశారు. ఇదే సమయంలో ఆగ్రహానికి గురైన కౌశిక్ రెడ్డి నువ్వు ఏ పార్టీ అంటూ సంజయ్ ను ప్రశ్నించారు. దమ్ముంటే కాంగ్రెస్ టికెట్‌పై గెలవాలని సవాల్ చేశారు. దీంతో మాటల యుద్ధం జరిగింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి కౌశిక్ ను కలెక్టరేట్ నుంచి బయటకు తీసుకొచ్చారు. ఈ వివాదం నేపథ్యంలో సమావేశంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
2023 చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సంజయ్ కుమార్ బీఆర్ఎస్ తరఫున జగిత్యాల నుంచి గెలిచారు. గతంలోనూ ఆయన ఆ పార్టీ తరఫునే ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే, ఎన్నికల తర్వాత అనూహ్యంగా కాంగ్రెస్ లో చేరారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ టికెట్‌పై గెలిచిన సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా మాట్లాడడం ఏమిటని కౌశిక్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు.
వాస్తవానికి కౌశిక్ రెడ్డి 2022 వరకు కాంగ్రెస్ లోనే ఉన్నారు. తర్వాత అప్పటి అధికార పార్టీ బీఆర్ఎస్ లో చేరి ఎమ్మెల్సీ అయ్యారు. 2023 లో జరిగిన ఎన్నికల్లో హుజూరాబాద్ లో మాజీ మంత్రి ఈటలను ఓడించి ఎమ్మెల్యేగా గెలిచారు. పార్టీ అధికారం కోల్పోవడంతో ప్రతిపక్ష ఎమ్మెల్యేగా మిగిలిపోయారు. అయితే, అసెంబ్లీలోనూ, బయట వివిధ కారణాలతో ఆయన తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. కాగా, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తరఫున తాను రైతుల పక్షాన నిలుస్తానని, దళితులు అందరికీ దళిత బంధు అందించాలని తాను కోరుతున్నట్లు కౌశిక్ తెలిపారు. తాను సంజయ్ ను ఏ పార్టీ తరఫున గెలిచారని, ఏ పార్టీ వారని ప్రశ్నించానని చెప్పారు.
కాగా, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తీరుపై మంత్రులు ఉత్తమ్, పొన్నం, శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌశిక్ వ్యవహారాన్ని ఆయనకు సమీప బంధువు అయిన మంత్రి ఉత్తమ్ తీవ్రంగా ఖండించడం గమనార్హం.