గెలిచేది ప్రసన్నా, ప్రశాంతా?
ఈ నేపథ్యంలో కోవూరు అసెంబ్లీ నియోజకవర్గం పోరు రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది.
By: Tupaki Desk | 8 April 2024 4:24 AM GMTఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు మే 13న జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని నియోజకవర్గాలపై రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టి నెలకొని ఉంది. అలాంటి వాటిలో ఒకటి నెల్లూరు జిల్లాలోని కోవూరు అసెంబ్లీ నియోజకవర్గం. ఇక్కడి నుంచి టీడీపీ తరఫున వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి సతీమణి వేమిరెడ్డి ప్రశాంతి బరిలో ఉన్నారు. మరోవైపు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి టీడీపీ తరఫున నెల్లూరు నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక వైసీపీ తరఫున కోవూరులో సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పోటీ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో కోవూరు అసెంబ్లీ నియోజకవర్గం పోరు రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది. ప్రముఖ కాంట్రాక్టరుగా, ఆర్థికంగా బాగా స్థితిమంతుడైన వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి వైసీపీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనను వైసీపీ అధినేత జగన్ నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. ఈ క్రమంలో నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో కొందరు అసెంబ్లీ అభ్యర్థులను మార్చాలని వేమిరెడ్డి కోరారు. అయితే జగన్ ఇందుకు తిరస్కరించారు. దీంతో వేమిరెడ్డి టీడీపీలోకి వెళ్లిపోయారు. నెల్లూరు నుంచి టీడీపీ ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఆయన సతీమణి ప్రశాంతి ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సభ్యురాలిగా ఉన్నారు. అంతేకాకుండా ఢిల్లీలో టీటీడీ తరఫున దేవస్థానాల పర్యవేక్షణ బాధ్యతలు చూస్తున్నారు.
మారిన పరిస్థితుల్లో టీడీపీలోకి వెళ్లిన ప్రభాకరరెడ్డి నెల్లూరు ఎంపీగా పోటీ చేస్తుండగా ఆయన సతీమణి ప్రశాంతి కోవూరు నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. కాగా కోవూరులో ప్రస్తుతం వైసీపీ తరఫున పోటీ చేస్తున్న నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గతంలో 1994, 1999లో టీడీపీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందడం విశేషం. 2004లో కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ప్రసన్నకుమార్ రెడ్డి ఓడిపోయారు. 2009లో మళ్లీ టీడీపీ తరఫున ప్రసన్నకుమార్ రెడ్డి మూడోసారి గెలుపొందారు.
2011లో వైఎస్ జగన్ వైసీపీని ఏర్పాటు చేయడంతో ప్రసన్న ఆ పార్టీలో చేరారు. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి 2012 ఉప ఎన్నికలో వైసీపీ తరఫున పోటీ చేసి మరోసారి విజయం సాధించారు. 2014లోనూ వైసీపీ తరఫున పోటీ చేసిన ప్రసన్న ఓటమి పాలయ్యారు. మళ్లీ తిరిగి 2019లో వైసీపీ తరఫున బరిలోకి దిగి విజయం సాధించారు. మొత్తం మీద ప్రసన్నకుమార్ రెడ్డి వివిధ పార్టీల తరఫున ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.
ఇప్పటివరకు ప్రసన్నకుమార్ రెడ్డి టీడీపీలో ఉండే కాంగ్రెస్ అభ్యర్థిగా, వైసీపీలో ఉంటే టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డిని ఈసారి టీడీపీ పక్కనపెట్టింది. పోలంరెడ్డి స్థానంలో వేమిరెడ్డి ప్రశాంతికి సీటు ఇచ్చింది. పోలంరెడ్డి 2004లో కాంగ్రెస్ తరఫున, 2014లో టీడీపీ తరఫున కోవూరు ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
ఐదుసార్లు గెలిచిన అనుభవంతో, నల్లపరెడ్డి కుటుంబానికి ఉన్న బ్రాండ్ తో ప్రసన్నకుమార్ రెడ్డి, ఆర్థిక, అంగ బలాలు, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి బలంతో ప్రశాంతి పోటీ పడుతున్నారు. మరి కోవూరు కిరీటం ఎవరితో తేలాలంటే జూన్ 4 వరకు ఆగాల్సిందే.