క్రాంతి నా సోదరి.. ముద్రగడతో నాకు విభేదాలు లేవు: పవన్ సంచలన వ్యాఖ్యలు
ఈ సందర్భంగా పవన్ ఆమె గురించి మాట్లాడుతూ.. క్రాంతి భారతి.. తనకు సోదరి లాంటివారని అన్నారు.
By: Tupaki Desk | 6 May 2024 4:06 AM GMTజనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాపు ఉద్యమ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంతో తనకు విభేదాలు లేవన్నారు. అంతేకాదు.. ఆయన సీనియర్ అని.. ఆయనతో కలిసి కూర్చుని మాట్టాడేందుకు కూడా తనకు అభ్యంతరం లేదన్నారు. ఆయన సీనియర్ అని.. ఆయనకు తగిన గౌరవం ఎప్పుడూ తన గుండెల్లో ఉంటుందని తేల్చి చెప్పారు. తాజాగా నిర్వహించిన వారాహి విజయభేరి సభలో పవన్ ప్రసంగించారు. అయితే..ఈ ప్రచార సభకు ప్రత్యేకత ఉంది.
ఇటీవల రెండు రోజుల కిందట.. ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతి భారతి.. సెల్ఫీవీడియో చేసి..తన తండ్రితో తాను విభేదిస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయన పేరు మార్చుకునేందుకు సిద్ధంగా ఉండడాన్ని ఆమె తప్పుబట్టారు. సీఎం జగన్ చేతిలో పావుగా మారారని కూడా అన్నారు. అయితే.. దీనిపై దుమారం రేగింది. తర్వాత ముద్రగడ కూడా.. ఆమె తన ఆస్తి కాదన్నారు. ఇక, తాజాగా ఆమె పవన్ కల్యాణ్ పాల్గొన్న వారాహి విజయభేరి సభలో క్రాంతి భారతి దర్శన మిచ్చారు. ఆమె కూడా.. పవన్ పక్కనే నిలబడి.. యాత్రలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పవన్ ఆమె గురించి మాట్లాడుతూ.. క్రాంతి భారతి.. తనకు సోదరి లాంటివారని అన్నారు. తన తోబుట్టువని కూడా వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయని..అన్నింటినీ గౌరవించాలన్నారు. ముద్రగడ పద్మనాభం వేరే పార్టీలో ఉండొచ్చని.. అయినంత మాత్రాన తాను విభేదించనని చెప్పారు. ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని తాను గౌరవిస్తానని పవన్ చెప్పారు. పార్టీలో చేరతానంటే.. క్రాంతి భారతిని మనస్పూర్తిగా ఆహ్వానిస్తామని చెప్పారు. సరైన రీతిలో ఆమెకు సముచిత స్థానం కల్పిస్తామని పవన్ హామీ ఇచ్చారు.