Begin typing your search above and press return to search.

ఊహాగానాలకు చెక్ చెబుతూ డీసీపీ ఎదుట డైరెక్టర్ క్రిష్

గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లోని రెండో అంతస్తులో ఉన్న మాదాపూర్ డీసీపీ కార్యాలయానికి ఆయన వచ్చారు. సాయంత్రం 4.30 గంటల వేళలో స్టేషన్ కు చేరుకున్నారు.

By:  Tupaki Desk   |   2 March 2024 4:46 AM GMT
ఊహాగానాలకు చెక్ చెబుతూ డీసీపీ ఎదుట డైరెక్టర్ క్రిష్
X

అంతకంతకూ విస్తరిస్తున్న ఊహాగానాలకు చెక్ పెట్టేలా వ్యవహరించారు ప్రముఖ దర్శకుడు క్రిష్. సంచలనంగా మారిన రాడిసన్ డ్రగ్ పార్టీకి వెళ్లినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న క్రిష్.. ఈ ఘటన వెలుగు చూసిన తర్వాత ఆయన హైదరాబాద్ లో లేకపోవటం.. తాను పోలీసుల విచారణకు హాజరవుతారని చెప్పి. ఆ తర్వాత రాకుండా ఉండటంతో పలు అంచనాలు.. ఊహాగానాలకు తెర తీసిన పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో శుక్రవారం నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.

ఓవైపు హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటీషన్ దాఖలు చేసిన క్రిష్ తరఫు న్యాయవాది.. కోర్టు నుంచి పోలీసులకు ఆదేశాలు వెళ్లాయి. అదే సమయంలో పోలీసుల విచారణను ఆపేందుకు వీలుగా కోర్టును ఆశ్రయించినట్లుగా ప్రచారం జరుగుతున్న వేళ.. ఆయన అనూహ్యంగా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. కుటుంబ సభ్యులు.. స్నేహితులతో కలిపి మొత్తం ఐదుగురుగా గచ్చిబౌలి స్టేషన్ కు వెళ్లిన ఆయన.. తాను పోలీసు విచారణకు సిద్ధమని స్పష్టం చేశారు.

తన రాక ముందు గచ్చిబౌలి పోలీసులకు ముందస్తు సమాచారం అందించినట్లుగా చెబుతున్నారు. ఫలానా టైంలో వస్తానని చెప్పనప్పటికీ.. సాయంత్ర వేళలో స్టేషన్ కు వస్తానని చెప్పినట్లుగా చెబుతున్నారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లోని రెండో అంతస్తులో ఉన్న మాదాపూర్ డీసీపీ కార్యాలయానికి ఆయన వచ్చారు. సాయంత్రం 4.30 గంటల వేళలో స్టేషన్ కు చేరుకున్నారు. ఆ సమయానికి డీసీపీ వినీత్ అందుబాటులో లేకపోవటంతో క్రిష్ దాదాపు 30-40 నిమిషాల పాటు నిరీక్షించారు. అనంతరం డీసీపీ రావటంతో ఇన్ స్పెక్టర్ జేమ్స్ ఆయన్ను తీసుకెళ్లారు.

ఈ సందర్భంగా డీసీపీతో దాదాపు గంట పాటు దర్శకుడు క్రిష్ మాట్లడారు. ఈ సందర్భంగా వారి మధ్య రాడిసన్ పార్టీ గురించి మాట్లాడుకున్నట్లుగా తెలిసింది. తాను వేరే చోటుకు వెళ్లాల్సి ఉందని.. అయితే తన ఫ్రెండ్ రఘుచరణ్ ఫోన్ చేస్తే రాడిసన్ కు వెళ్లానని.. అక్కడ తాను అరగంట మాత్రమే ఉన్నట్లుగా చెప్పినట్లు తెలిసింది.

తాను డ్రగ్స్ తీసుకోలేదని.. పార్టీలో డ్రగ్స్ వాడినట్లుగా తనకు తెలీదని సమాధానం ఇచ్చినట్లుగా సమాచారం. సమయానికి అందుబాటులో లేకపోవటం.. సినిమా చర్చలకు తాను ముంబయి వెళ్లానని.. అందుకే పోలీసులు పిలిచినప్పుడు తాను రాలేకపోయినట్లుగా చెప్పినట్లు తెలిసింది.తాను ఎలాంటి తప్పు చేయలేదని.. ఆ విషయాన్ని వివరించాలన్న ఉద్దేశంతోనే తాను పోలీస్ స్టేషన్ కు వచ్చినట్లుగా చెప్పినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో డీసీపీ వినీత్.. ఆయన్ను డ్రగ్స్ పరీక్షలకు హాజరు కావాలని కోరగా.. అందుకు సిద్ధమని క్రిష్ వెల్లడించారు. దీంతో.. ఒక కార్పొరేట్ ఆసుపత్రిలో మూత్ర పరీక్ష.. ఒక ప్రముఖ ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త పరీక్షలు నిర్వహించేందుకు వీలుగా క్రిష్ అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ పరీక్షల్ని అధికారుల సమక్షంలో జరగాలని డీసీపీ ఆదేశించారు. ఈ పరీక్షల రిపోర్టుల ఆధారంగా తదుపరి కార్యాచరణ ఉంటుందని పేర్కొన్నట్లు తెలిసింది. పోలీసులకు సమాచారం ఇవ్వకుండా ఎక్కడకు వెళ్లొద్దని.. ఎప్పుడు పిలిచినా రావాలని క్రిష్ కు సూచన చేయగా.. అందుకు ఆయన అంగీకరించినట్లుగా సమాచారం. దీంతో.. గంటన్నర అనంతరం ఆయన తన స్నేహితులతో కలిసి వెళ్లిపోయారు. ఇదిలా ఉండగా.. హైకోర్టును ఆశ్రయించిన క్రిష్.. తనను డ్రగ్ కేసులో ఇరికించారంటూ పిటిషన్ దాఖలు చేయటం తెలిసిందే.