అచ్చెన్న కుమారుడి పొలిటికల్ ఎంట్రీ ?
ఇదిలా ఉంటే అచ్చెన్నాయుడు వచ్చే ఎన్నికల కోసం తన వారసుడిని ఇప్పటి నుంచే రెడీ చేస్తున్నారు అని ప్రచారంలో ఉన్న మాట.
By: Tupaki Desk | 30 Oct 2024 5:30 AM GMTశ్రీకాకుళం జిల్లాలో కింజరాపు కుటుంబానికి తిరుగులేని రాజకీయ ఆధిపత్యం. 1983లో ఎర్రన్నాయుడు ఎమ్మెల్యే అయిన నాటి నుంచి ఆ కుటుంబం రాజకీయంగా ఎక్కడా వెనుతిరిగి చూసుకోలేదు. ఎర్రన్నాయుడు చీఫ్ విప్ గా అసెంబ్లీలో పనిచేశారు. కేంద్రంలో మంత్రిగా కీలక శాఖలు చూశారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా మరో నాలుగు సార్లు ఎంపీగా పనిచేసి దిగ్గజ నేతగా రాణించారు.
ఇక అచ్చెన్నాయుడు తన అన్న ఎంపీగా పోటీ చేసిన క్రమంలో ఆయన వదిలేసిన అసెంబ్లీ సీటు నుంచి పోటీ చేయడం ద్వారా 1996లో పొలిటికల్ గా ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటికి మూడు దశాబ్దాలుగా ఆయన తనదైన శైలిలో రాణిస్తున్నారు. ఆయన జిల్లా రాజకీయాలను ఒడిసిపట్టారు.
అన్న బాటలో నడుస్తూ టీడీపీలో అతి ముఖ్య నేతగా మారారు. మరో వైపు చూస్తే ఎర్రన్నాయుడు 2012లో మరణించడంతో ఆయన వారసుడిగా కుమారుడు రామ్మోహన్ నాయుడు వచ్చారు. ఆయన శ్రీకాకుళం ఎంపీగా మూడు సార్లు గెలిచారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వంలో కీలకమైన పౌర విమానయాన మంత్రిగా బాధ్యతలు చూస్తున్నారు.
నిజంగా రామ్మోహన్ నాయుడు అదృష్టంగా దీనిని చెబుతున్నారు. ఆయన చిన్న వయసులోనే పెద్ద పదవిని అందుకున్నారు. బోలెడంతా భవిష్యత్తు ఆయనకు ఉంది. ఇదిలా ఉంటే అచ్చెన్నాయుడు వచ్చే ఎన్నికల కోసం తన వారసుడిని ఇప్పటి నుంచే రెడీ చేస్తున్నారు అని ప్రచారంలో ఉన్న మాట.
ఆయన కుమారుడు క్రిష్ణ మోహన్ నాయుడు ని 2029 ఎన్నికల్లో పోటీ చేయించాలని చూస్తున్నారు అని అంటున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోమన్నారు. అలాగే అధికారం హవా ఉన్నపుడే వారసుడిని రంగంలోకి తెస్తే ఆ మీదట మంచి భవిష్యత్తు ఉంటుందని అచ్చెన్నా ఆలోచన చేస్తున్నారు అని అంటున్నారు.
వచ్చే ఎన్నికల్లో రామ్మోహన్ నాయుడు నరసన్నపెట నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తారు అని అంటున్నారు. దాంతో శ్రీకాకుళం ఎంపీ సీటు నుంచి అచ్చెన్న కుమారుడు రాజకీయ అరంగేట్రం చేస్తారు అని అంటున్నారు. అంటే అన్న రామ్మోహన్ మాదిరిగా పార్లమెంట్ లో మొదట అడుగు పెట్టి ఆ మీదట తండ్రి సీటు అయిన టెక్కలి నుంచి ఎమ్మెల్యేగా ఫ్యూచర్ లో వస్తారు అని అంటున్నారు
ఈ రోజుకు చూస్తే శ్రీకాకుళం జిల్లాలో రాజకీయంగా బలమైన కుటుంబంగా కింజరాపు ఫ్యామిలీ ఉంది. దాంతో పాటు టీడీపీ అధినాయకత్వం వారిని పూర్తిగా విశ్వసిస్తోంది. ఎంతలా విశ్వసించక పోతే ఒకే కుటుంబంలో బాబాయ్ అబ్బాయ్ లకు మంత్రి పదవులు కట్టబెడుతుందన్న చర్చ ఉంది.
అటు ప్రజలలో ఆదరణ ఉంది. దాంతో ఈ అవకాశాన్ని వాడుకుంటూ తమ వారసులకు వెలుగు ఇవ్వాలని ఎవరైనా చూస్తారు అందుకే అచ్చెన్నాయుడు కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నారు అని అంటున్నారు. మరి ఇది ప్రచారంగా మిగిలిపోతుందా నిజంగా జూనియర్ అచ్చెన్న శ్రీకాకుళం నవతరం రాజకీయ నేతగా ఆవిర్భవిస్తారా అంటే వేచి చూడాల్సిందే.