Begin typing your search above and press return to search.

ఎమ్మెల్యే ఎదుటే పురుగుల మందు తాగిన జనసైనికుడు

ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ సమక్షంలోనే సంతోష్ పురుగుల మందు సేవించడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.

By:  Tupaki Desk   |   20 Jan 2025 12:28 PM GMT
ఎమ్మెల్యే ఎదుటే పురుగుల మందు తాగిన జనసైనికుడు
X

ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన తమకు కనీస గౌరవం, గుర్తింపు ఇవ్వడం లేదని ఆరోపిస్తూ కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గానికి చెందిన జనసే కార్యకర్త శీరం సంతోష్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ సమక్షంలోనే సంతోష్ పురుగుల మందు సేవించడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలోని గూడురు మండల టీడీపీ అధ్యక్షుడు తమను దూరం పెడుతున్నారని, ఏ విషయంలోనూ కలుపుకుని వెళ్లడం లేదని, అడిగితే దుర్భాషలాడారని సంతోష్ ఆరోపించాడు.

ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ సమక్షంలోనే జనసేన కార్యకర్త పురుగుల మందు తాగడంతో అక్కడ ఉన్నవారంతా కంగుతిన్నారు. వెంటనే తేరుకుని సంతోషును మచిలీపట్నం ఆస్పత్రికి తరలించారు. సోమవారం గూడురు మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే కాగిత కాన్వాయ్ ను తొలుత సంతోష్ అడ్డుకున్నాడు. తన బాధ వినాలంటూ ఎమ్మెల్యే కారును అడ్డగించాడు. అయితే ఎమ్మెల్యే పెద్దగా పట్టించుకోకపోవడంతో వెంటనే తన వద్ద ఉన్న పురుగుల మందు బయటకు తీసి తాగేశాడు. ఈ హఠాత్ పరిణామానికి షాకైన ఎమ్మెల్యే వెంటనే కారు దిగి జనసేన కార్యకర్తకు నచ్చజెప్పారు.

గుడూరు మండల జనసేన ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న సంతోష్ పట్ల గూడూరు టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు పోతన స్వామి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని జనసేన నేతలు ఆరోపించారు. ఎమ్మెల్యే సూచనలతో సంతోషును మచిలీపట్నం ఆస్ప్రతికి తరలించగా, జనసేన నేతలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. టీడీపీ నేత స్వామి తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం అధికారంలోకి రాడానికి తాము కూడా కష్టపడి పనిచేశామని, అయితే తమ శ్రమను గుర్తించకపోగా, దుర్భాష లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

జనసేన కార్యకర్త సంతోష్ ఆత్మహత్యాయత్నం కృష్ణా జిల్లాలో కలకలం రేపింది. ఈ సంఘటనతో కూటమిలో క్షేత్రస్థాయిలో నేతల మధ్య సఖ్యత లేదన్న విషయం మరోసారి బయటపడింది. మూడు పార్టీల కార్యకర్తల మధ్య సమన్వయం కోసం ప్రత్యేకంగా కమిటీలు వేసినప్పటికీ అవేవీ పనిచేస్తున్నట్లు కనిపించడం లేదు. ముఖ్యంగా టీడీపీ నేతలు తమను నిర్లక్ష్యం చేస్తున్నారనే భావన జనసేన కార్యకర్తల్లో పెరగిపోతోందంటున్నారు. అందుకే ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయని విశ్లేషిస్తున్నారు.