వచ్చే ఎన్నికల్లో పోటీపై వైసీపీ ఎంపీ లావు సంచలన వ్యాఖ్యలు!
ఈ నేపథ్యంలో తాజాగా లావు శ్రీకృష్ణదేవరాయలు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను మళ్లీ పల్నాడు నుంచే పోటీ చేస్తానని వెల్లడించారు.
By: Tupaki Desk | 24 Jan 2024 12:30 PM GMTపల్నాడులో అధికార వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలిన సంగతి తెలిసిందే. పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేట వైసీపీ ఎంపీగా ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయలు వైసీపీకి రాజీనామా ప్రకటించిన సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల్లో నరసరావుపేట నుంచి గెలిచిన లావు శ్రీకృష్ణదేవరాయలను ఈసారి గుంటూరు నుంచి ఎంపీగా పోటీ చేయాలని వైసీపీ అధినేత జగన్ కోరారని.. అయితే ఆయన అందుకు నిరాకరించారని పల్నాడు జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలు వెల్లడించారు.
ఈ నేపథ్యంలో తాజాగా లావు శ్రీకృష్ణదేవరాయలు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను మళ్లీ పల్నాడు నుంచే పోటీ చేస్తానని వెల్లడించారు. ఏ పార్టీలోకి వెళ్లాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. కార్యకర్తలు, ప్రజలతో మాట్లాడాక తన భవిష్యత్తుపై కార్యాచరణను వెల్లడిస్తానని చెప్పారు. ఏ పార్టీలోకి వెళ్లినా పల్నాడు నుంచే ఖచ్చితంగా పోటీ చేస్తానని తేల్చిచెప్పారు. తన భవిష్యత్ కార్యాచరణకు ఇంకా సమయం ఉందన్నారు. అన్ని విషయాలు మున్ముందు వెల్లడిస్తానని తెలిపారు.
కాగా లావు శ్రీకృష్ణదేవరాయలు పార్టీ మారడం కూడా ఖాయమేనని వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన టీడీపీలోకి వెళ్తారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తో లావు శ్రీకృష్ణదేవరాయలు భేటీ అయ్యారని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన టీడీపీ తరఫున చిలకలూరిపేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని అంటున్నారు. ప్రస్తుతం చిలకలూరిపేట టీడీపీ అభ్యర్థిగా ఉన్న మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును నరసరావుపేట పార్లమెంటు స్థానం నుంచి బరిలో దించుతారని చెబుతున్నారు.
అసెంబ్లీకి పోటీ చేయడం లావు శ్రీకృష్ణదేవరాయలకు ఇష్టం లేకుంటే నరసరావుపేట నుంచి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతారని టాక్ నడుస్తోంది. వాస్తవానికి లావును వైఎస్ జగన్ గుంటూరుకు మార్చాలని తీసుకున్న నిర్ణయాన్ని పల్నాడు వైసీపీ ఎమ్మెల్యేలంతా వ్యతిరేకించారు. స్వయంగా సీఎంను కలిసి శ్రీకృష్ణదేవరాయలనే ఎంపీ అభ్యర్థిగా కొనసాగించాలని కోరారు. అయితే జగన్ ఎమ్మెల్యేల ప్రతిపాదనకు ఒప్పుకోలేదని అంటున్నారు. దీంతో లావు పార్టీకి రాజీనామా చేశారని చెబుతున్నారు.
నరసరావుపేట పార్లమెంటు స్థానంలో లావు శ్రీకృష్ణదేవరాయలకు ఎంపీగా మంచి పేరుందని టాక్ నడుస్తోంది. ఎంపీగా ఆయన చాలా నిధులను తీసుకొచ్చి అభివృద్ధి చేశారని చెబుతున్నారు. పల్నాడులో కీలకమైన వరికపూడిశెల ప్రాజెక్టుకు పర్యావరణ, అటవీ అనుమతులు తీసుకురావడంలో లావుదే కీలకపాత్ర. ఈ విషయమై పార్లమెంటులోనూ ఆయన పలుమార్లు మాట్లాడారు. ఎంపీ నిధులతోపాటు కార్పొరేటు సంస్థల నుంచి కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) విభాగం కింద నిధులు తీసుకొచ్చి 88 గ్రామాల్లో నీటి శుద్ధి కేంద్రాలు ఏర్పాటుచేశారు.
అంతేకాకుండా చిలకలూరిపేటలో కేంద్రీయ విద్యాలయం నిర్మాణం పనులు పూర్తి చేశారు. అదేవిధంగా రొంపిచర్ల, తాళ్ళపల్లిలోనూ రెండు కొత్త కేంద్రీయ విద్యాలయాలను తీసుకొచ్చారు. అలాగే కేంద్రం.. రాష్ట్రానికి మంజూరు చేసిన వైద్య కళాశాలల్లో ఒకదాన్ని పిడుగురాళ్లలో ఏర్పాటయ్యేలా చేశారు. కార్మికులు ఎక్కువగా ఉండే పల్నాడులో 100 పడకలతో ఈఎస్‌ఐ ఆసుపత్రిని తీసుకొచ్చారు. తక్కువ నీరు, రసాయనాలతో అధిక దిగుబడులు పొందే ఇజ్రాయిల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు అందించే ప్రాజెక్టును నకరికల్లు మండలంలో చేపట్టారు.
అలాగే నాలుగు జాతీయ రహదారుల అభివృద్ధికి కూడా తన ఎంపీ నిధులు మంజూరు చేశారు. దీంతో పల్నాడు జిల్లాలో జిల్లా రహదారులతోపాటు చాలా ప్రాంతాలు జాతీయ రహదారులతో అనుసంధానించబడ్డాయి. ఈ నేపథ్యంలో నరసరావుపేట ఎంపీ బరిలో లావు శ్రీకృష్ణదేవరాయలకు అన్నీ సానుకూల అంశాలే ఉన్నాయని టాక్ నడుస్తోంది.