విజయ్ పాల్ అరెస్ట్ పై ట్రిపుల్ ఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వ్యవహారంపై కేసులు, విచారణలు జరుగుతున్నాయని అంటున్నారు.
By: Tupaki Desk | 27 Nov 2024 7:19 AM GMTఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు గతంలో వైసీపీ ఎంపీగా ఉండగా ఆయన్ను చిత్రహింసలకు గురిచేశారనే వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వ్యవహారంపై కేసులు, విచారణలు జరుగుతున్నాయని అంటున్నారు. ఈ సమయంలో రిటైర్డ్ ఏఎస్పీ విజయ్ పాల్ ను అరెస్ట్ చేశారు.
రఘురామను చిత్రహింసలకు గురిచేసిన కేసులో సీఐడీ రిటైర్డ్ ఏఎస్పీ విజయ్ పాల్ ను పోలీసులు మంగళవారం రాత్రి అరెస్ట్ చేశారు. మంగళవారం ఉదయం విజయ్ పాల్.. ఒంగోలు లోని జిల్లా పోలీసు కార్యాలయానికి వివరణ ఇచ్చారు. మరోపక్క ఆయన బెయిల్ పిటిషన్ ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టేసింది.
దీంతో... విచారణకు హాజరుకావాలని దర్యాప్తు అధికారి, ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్.. విజయ్ పాల్ కు నోటీసులు జారీ చేశారు. దీంతో విజయ్ పాల్ విచారణకు హాజరయ్యారు. అయితే... ఆయన నుంచి సరైన సమాధానాలు రాలేదని భావించిన దర్యాప్తు అధికారి ఆయన్ను అరెస్టు చేస్తున్నట్లు రాత్రి 9 గంటలకు ప్రకటించారు. దీనిపై ట్రిపుల్ ఆర్ స్పందించారు.
అవును... సీఐడీ మాజీ అడిషనల్ ఎస్పీ విజయ్ పాల్ అరెస్ట్ పై ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు స్పందించారు. ఇందులో భాగంగా ఈ అరెస్టును ఆయన స్వాగతించారు. తనను కస్టడీలో హింసించిన వారంతా జైలుకు వెళ్లడం ఖాయమని అన్నారు. ఇదే సమయంలో సునీల్ కుమార్ విదేశాలకు పారిపోకుండా లుకౌట్ నోటీసులు ఇవ్వాలని అన్నారు.
మరోపక్క... కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో రఘురామ కృష్ణంరాజు మంగళవారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా కుమార్తె వివాహ రిసెప్షన్ లో పాల్గొనడానికి ఢిల్లీకి వచ్చిన రఘురామ.. ఇక్కడి పార్లమెంట్ భవనంలో అమిత్ షాను కలిశారు. ఈ సందర్భంగా ఏపీలోని రాజకీయ పరిస్థితులపై అమిత్ షా కు వివరించారని అంటున్నారు.