Begin typing your search above and press return to search.

బీఆర్ఎస్-కాంగ్రెస్ నడుమ మురారి.. చౌరస్తాలో గద్వాల ఎమ్మెల్యే

గురువారం వీరిద్దరూ చర్చించాక.. శుక్రవారం కృష్ణమోహన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.

By:  Tupaki Desk   |   2 Aug 2024 10:06 AM GMT
బీఆర్ఎస్-కాంగ్రెస్ నడుమ మురారి.. చౌరస్తాలో గద్వాల ఎమ్మెల్యే
X

బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరి.. మళ్లీ బీఆర్ఎస్ వైపు వెళ్తున్నట్లు కనిపించిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి చౌరస్తాలో నిలిచారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకత్వంతో పడదు.. హైదరాబాద్ స్థాయిలో చూస్తేనేమో.. పార్టీ మారాలంటూ ఒత్తిడి.. మరోవైపు పాత గూటి వైపు మళ్లీ అడుగులు.. అసలు ఆయన ఎటువైపు ఉంటారో తెలియని పరిస్థితి ఏర్పడింది.

రాయబారం ఫలించి రేవంత్‌ వద్దకు గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి 2018, 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచారు. అయితే, ఈసారి రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో పరిస్థితులు మారాయి. అందులోనూ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన రేవంత్ రెడ్డి సీఎం కావడంతో రాజకీయం మరో మలుపు తీసుకుంది. ఉమ్మడి పాలమూరులో బీఆర్ఎస్ గెలిచింది రెండే సీట్లు (గద్వాల, అలంపూర్).

వీటిలో ముందు కృష్ణమోహన్ రెడ్డిని తర్వాత అలంపూర్ ఎమ్మెల్యే విజయుడిని చేర్చుకోవడం ద్వారా మొత్తం జిల్లాను తమ ఖాతాలో వేసుకోవాలని కాంగ్రెస్ భావించింది. కానీ, చేరి నెల తిరగకముందే కృష్ణమోహన్ మనసు మారింది. ఇటీవలి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆయన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిశారు. దీంతో పాత గూటికే పయనం అవుతున్నట్లు కథనాలు వచ్చాయి.

మళ్లీ యూ టర్న్ కృష్ణమోహన్ రెడ్డి వ్యవహారంతో ప్రభుత్వ పెద్దలు అప్రమత్తం అయ్యారు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన మంత్రి జూపల్లి కృష్ణారావును గద్వాలలో ఉన్న కృష్ణమోహన్ రెడ్డి వద్దకు పంపారు. గురువారం వీరిద్దరూ చర్చించాక.. శుక్రవారం కృష్ణమోహన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. జూపల్లి కృష్ణారావుతో కలిసి జూబ్లీహిల్స్‌ లోని సీఎం ఇంటికి వెళ్లారు. దీంతో ఈ అంశం ప్రాధాన్యత సంతరించుకుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ లలో ఎటువైపు ఉండాలో తేల్చుకోలేని పరిస్థితుల్లో కృష్ణమోహన్ రెడ్డి ఉన్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అయితే, నేరుగా సీఎంనే కలిసినందున ఆయన కాంగ్రెస్ వైపే కొనసాగే చాన్సుంది.

కొసమెరుపు: గద్వాలలో గురువారం మంత్రి జూపల్లి, కృష్ణమోహన్ రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. ఆ సమయంలో కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లోనే ఉంటారని చెప్పారు. కానీ, ఎమ్మెల్యే మాత్రం మౌనంగానే ఉండిపోయారు.