Begin typing your search above and press return to search.

కడుపు చించుకుంటున్న కృష్ణప్రసాద్... వాట్ నెక్స్ట్?

ఇందులో భాగంగా... మైలవరంలో ఒక నాయకుడు రూ.కోట్ల విలువైన పనులు చేసి బిల్లులు రాకపోవడంతో మామిడితోటను కూడా అమ్మేసుకున్నారని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు.

By:  Tupaki Desk   |   24 Jan 2024 5:11 AM GMT
కడుపు చించుకుంటున్న కృష్ణప్రసాద్... వాట్  నెక్స్ట్?
X

గతకొంతకాలంగా నిధుల విషయంలోనూ, కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులు ఇచ్చే విషయంలోనూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వైసీపీ ఎమ్మెల్యేలు ఆన్ రికార్డ్ కొందరు.. ఆఫ్ ది రికార్డ్ మరికొందరు వ్యాఖ్యానిస్తున్న సంగతి తెలిసిందే. సంక్షేమంతో పోల్చుకుంటే అభివృద్ధిలో పోటీ పడలేకపోతున్నామంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అవును... ఏపీలో సంక్షేమం అద్భుతంగా ఉందని చెబుతూనే.. అభివృద్ధి విషయంలో ఇబ్బందులు ఉన్నాయని.. నియోజకవర్గాల అభివృద్ధికి విడుదల కావాల్సిన నిధులు రావడం లేదని.. ఫలితంగా పనులు చేసిన కాంట్రాక్టర్లకు సమాధానాలు చెప్పలేకపోతున్నామని ఇటీవల మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వాపోయిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో తాజాగా ఎన్టీఆర్‌ జిల్లా మైలవరం వైకాపా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇందులో భాగంగా... తన భవిష్యత్తు ఎప్పుడు చీకటి పడుతుందా? ఎప్పుడు తెల్లారుతుందా? అనేది కాలమే నిర్ణయిస్తుందని వ్యాఖ్యానించారు! ఎదురు చూడటమే ఎమ్మెల్యేల పనిగా మారిందని.. సంక్షేమంతో పోల్చుకుంటే అభివృద్ధిలో పోటీ పడలేకపోతున్నామని తెలిపారు. ఇదే క్రమంలో... ప్రభుత్వం నుంచి సకాలంలో బిల్లులు రాక వైసీపీ నేతలు తమ ఆస్తులు అమ్ముకున్నారని అన్నారు.

ఇందులో భాగంగా... మైలవరంలో ఒక నాయకుడు రూ.కోట్ల విలువైన పనులు చేసి బిల్లులు రాకపోవడంతో మామిడితోటను కూడా అమ్మేసుకున్నారని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లుల బకాయిల కోసం కాంట్రాక్టర్లు ఎమ్మెల్యేల ఆఫీసుల చుట్టూ తిరుగుతుంటే చాలా ఇబ్బందిగా ఉంటుందని.. కాళ్లు పట్టుకోవడం మినహా అన్నిరకాలుగానూ బ్రతిమాలి పనులు చేయించుకున్నా బిల్లులు రావడం లేదని తెలిపారు.

అందువల్ల... నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలంటే భయపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని తెలిపిన వసంత కృష్ణప్రసాద్... ఇలా చెప్పుకుంటూ పోతే వంద సమస్యలు ఉన్నాయని అన్నారు. ప్రజలు సంక్షేమ పథకాలతో పాటుగా, అభివృద్ధి కార్యక్రమాలు కోరుకుంటున్నారని.. పైన డబ్బులు లేక తాను ఏం చేయలేని పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

జి.కొండూరు మండలం వెలగలేరు ప్రాథమిక ఆరోగ్యకేంద్రం ప్రారంభం సందర్భంగా జరిగిన సభలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.