కృష్ణతేజం.. ఆ తెలుగు ఐఏఎస్ కు జాతీయ స్థాయి కీర్తి..
అఖిల భారత సర్వీసు అధికారులు.. ముఖ్యంగా కలెక్టర్లు సమాజంలో అద్భుతమైన మార్పు తీసుకురాగలరు.
By: Tupaki Desk | 15 Jun 2024 7:47 AM GMTఅఖిల భారత సర్వీసు అధికారులు.. ముఖ్యంగా కలెక్టర్లు సమాజంలో అద్భుతమైన మార్పు తీసుకురాగలరు. మనసు పెట్టి పనిచేయాలే కానీ.. వారి పనితీరుతో పేదరికాన్ని జయించవచ్చు.. విపత్తులను అడ్డుకోవచ్చు.. వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావొచ్చు. ఇలాంటి అధికారులు ఎందరి గురించో గతంలో మీడియాలో తరచూ కథనాలు వచ్చేవి. ఇప్పుడైతే అరుదుగానే అని చెప్పాలి. అలాంటి అరుదైన సేవతో ప్రశంసలు పొందుతూ జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నారు ఏపీకి చెందిన ఐఏఎస్ అధికారి.
ఆ ఊహించని విపత్తుతో
2018లో కేరళలో సంభవించిన వరదలు గుర్తున్నాయా..? దీనిపై సినిమా కూడా వచ్చి సూపర్ హిట్ అయింది. కేరళ ఎన్నడూ చూడని విపత్తు అది. అలాంటి సమయంలో అలెప్పీ జిల్లా సబ్ కలెక్టర్ గా ఉన్నారు తెలుగు ఐఏఎస్ అధికారి మైలవరపు కృష్ణతేజ. అప్పట్లో ప్రమాద తీవ్రతను తగ్గించడానికి ఆయన చూపిన చొరవ జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చింది. పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన కృష్ణతేజ.. 2015 బ్యాచ్ ఐఏఎస్. కేరళ కేడర్ పొందారు. నిరుడు మార్చిలో త్రిసూర్ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు. కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన 609 మంది విద్యార్థులను గుర్తించి దాతల చేయూతతో వారు ఉన్నత చదువులు చదివేలా చూశారు. కరోనా కారణంగా భర్తలను పోగొట్టుకున్న 35 మంది వితంతువులకు ఇళ్లు కట్టించారు. మరో 150 మంది మహిళలకు ఉపాధి అవకాశాలు చూపించారు.
డ్రగ్స్ ను నిరోధించి.. పర్యటకానికి పెద్దపీట
యువతను ప్రస్తుతం పట్టిపీడిస్తున్న వ్యసనం డ్రగ్స్. త్రిసూర్ కలెక్టర్ గా కృష్ణతేజ ఈ అంశంపై గట్టి ఫోకస్ పెట్టారు. జిల్లాలో విద్యార్థులు మాదకద్రవ్యాల జోలికి వెళ్లకుండా పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఇది అక్కడ చాలా పెద్ద మార్పే వచ్చేలా చేసింది. మరోవైపు కేరళ అంటేనే పర్యాటకం. గాడ్స్ ఓన్ కంట్రీ అయిన ఈ రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి కృషి చేశారు. బాలల హక్కుల రక్షణలో దేశంలోనే త్రిసూర్ జిల్లాను అగ్రగామిగా నిలిపారు. దీంతో కృష్ణతేజను జాతీయ బాలల రక్షణ కమిషన్ పురస్కారం వరించింది. ఈ నెల 27న ఢిల్లీలో ఆయన అవార్డు అందుకోనున్నారు.
శభాష్ అంటూ పవన్ ప్రశంసలు..
బాలల సంరక్షణ మిషన్ పురస్కారానికి ఎంపికైన కృష్ణతేజను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అభినందించారు. మరిన్ని సేవలు అందించాలని అభిలషించారు. ఉద్యోగులు, యువతకు స్ఫూర్తిగా నిలవాలని కోరారు. కలెక్టర్ గా పేదల అభ్యున్నతిలో ఆయన పాత్రను కొనియాడారు.