నేడు పోలీసుల ఎదుట డైరెక్టర్ క్రిష్.. ఇప్పుడేం జరగనుంది?
సంచలనంగా మారిన గచ్చిబౌలి రాడిసన్ హోటల్ లో జరిగిన హైప్రొఫైల్ డ్రగ్ పార్టీకి సంబంధించి ప్రముఖ దర్శకుడు జాగర్లమూడి క్రిష్ హాజరైనట్లుగా వార్తలు రావటం తెలిసిందే.
By: Tupaki Desk | 28 Feb 2024 4:40 AM GMTసంచలనంగా మారిన గచ్చిబౌలి రాడిసన్ హోటల్ లో జరిగిన హైప్రొఫైల్ డ్రగ్ పార్టీకి సంబంధించి ప్రముఖ దర్శకుడు జాగర్లమూడి క్రిష్ హాజరైనట్లుగా వార్తలు రావటం తెలిసిందే. ఇదే విషయాన్ని ఈ పార్టీని అరేంజ్ చేసిన వివేకానంద సైతం ఒప్పుకోవటంతో ఆయన పేరు ఎఫ్ఐఆర్ లో నమోదైంది. అయితే.. డ్రగ్ పార్టీకి హాజరైన క్రిష్.. మిగిలిన వారితో పాటు కొకైన్ సేవించారా? లేదా? అన్నదిప్పుడు ప్రశ్న.
దీనికి సంబంధించి అంశంపై క్లారిటీ కానుంది. ఎఫ్ఐఆర్ లో పేరు నమోదైన నేపథ్యంలో క్రిష్ ను పోలీసులుసంప్రదించే ప్రయత్నం చేశారు. ఆయన ఇంటికి వెళ్లినట్లుగా తెలుస్తోంది. అయితే.. క్రిష్ అందుబాటులోకి రాలేదు. ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలోనూ.. టీవీ చానళ్లలోనూ దర్శకుడు క్రిష్ పేరు ప్రముఖంగా టెలికాస్ట్ అయ్యింది. అతడి మీద నేరారోపణ మాత్రమే ఉన్నప్పటికీ.. కొందరు అత్యుత్సాహంతో కొన్ని కామెంట్లు చేసిన పరిస్థితి.
ఇదిలా ఉండగా.. గచ్చిబౌలి పోలీసులకు క్రిష్ అందుబాటులోకి రావటమే కాదు.. ఫోన్ లో మాట్లాడినట్లుగా చెబుతున్నారు. తాను అవుటాప్ స్టేషన్ లో ఉన్నట్లుగా పేర్కొన్న క్రిష్.. మంగళవారం తాను పోలీసుల ఎదుట హాజరవుతానని చెప్పినట్లుగా తెలుస్తోంది. పోలీసు వర్గాలు సైతం ఇదే అంశాన్ని ధ్రువీకరిస్తున్నాయి. అయితే.. ఇప్పటివరకు క్రిష్ కు ఎలాంటి అధికారికంగా ఎలాంటి నోటీసులు జారీ చేయలేదని చెబుతున్నారు.
ఇదిలా ఉంటే రాడిసన్ హోటల్ లో తరచూ డ్రగ్ పార్టీలు జరుగుతుంటాయని.. ఇప్పటివరకు 10 సార్లు తాను డ్రగ్స్ సప్లై చేసినట్లుగా డ్రగ్స్ సరఫరా చేసిన సయ్యద్ అబ్బాస్ అలీ జెఫ్రీ పోలీసుల విచారణలో వెల్లడించారు. ఇప్పటికే అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటికే పలుమార్లు రాడిసన్ లో పార్టీలు జరిగినట్లుగా గుర్తించిన నేపథ్యంలో.. ఆ పార్టీలకు హాజరయ్యే వారిని గుర్తించే కార్యక్రమాన్ని పోలీసులు మొదలు పెట్టారు.
ఇక.. దర్శకుడు క్రిష్ విషయానికి వస్తే.. ఆయన్ను పోలీసులు ప్రాథమికంగా విచారిస్తారని తెలుస్తోంది. అయితే.. ఆయన నుంచి వచ్చే సమాధానాల్లో తేడా ఉంటే మాత్రం డ్రగ్స్ వినియోగించారా? లేదా? అన్న విషయాన్ని తేల్చే పరీక్షను చేపడతారని చెబుతున్నారు. కేదార్.. నిర్భయ్ అనే కామన్ ఫ్రెండ్స్ ద్వారా సినీ రంగానికి చెందిన వారు వివేకానంద్ కు పరిచయం అయి ఉంటారని చెబుతున్నారు. డ్రగ్స్ కేసులో అనుమానితులుగా ఉన్న శ్వేత.. సందీప్ లు పరారీలో ఉండగా.. బెంగళూరులో ఉన్న చరణ్ ను అక్కడే విచారణ చేయనున్నారు. హోటల్ లో కొన్ని సీసీ కెమేరాలు పని చేయటం లేదని.. శనివారం రాత్రి తాము హోటల్ కు వెళ్లే సమయానికే పార్టీ నుంచి అందరూ వెళ్లిపోయినట్లుగా పోలీసులు చెబుతున్నారు. ఇప్పటికే పార్టీలో పాల్గొన్న పది మందిలో ముగ్గురికి డ్రగ్ పరీక్షలు నిర్వహించగా.. వారందరికి పాజిటివ్ వచ్చిందని పోలీసులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో దర్శకుడు క్రిష్ కు సైతం డ్రగ్ తీసుకున్నారా? లేదా? అన్న పరీక్షలు జరిపే అవకాశం ఉందంటున్నారు.