విచారణ కోసం వస్తానన్న దర్శకుడు క్రిష్ ఎందుకు రాలేదు?
అయితే.. పార్టీకి క్రిష్ హాజరయ్యారన్న విషయాన్ని పార్టీని నిర్వహించిన వివేకానంద స్పష్టం చేయటంతో ఆయన పేరు ఎఫ్ఐఆర్ లో నమోదు కావటం తెలిసిందే.
By: Tupaki Desk | 29 Feb 2024 4:44 AM GMTరాడిసన్ డ్రగ్స్ పార్టీ కేసులో సినిమా రంగానికి చెందిన కొందరు.. వ్యాపార వర్గాలకు చెందిన వారితో పాటు సంపన్న వర్గాలకు చెందిన కొందరు ఉండటం తెలిసిందే. ఇందులో అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది మాత్రం టాలీవుడ్ దర్శకుడు జాగర్లమూడి క్రిష్. సందేశాత్మక చిత్రాలు తీసే క్రిష్ డ్రగ్స్ పార్టీకి అటెండ్ కావటం ఏమిటన్నది ప్రశ్నగా మారింది. అయితే.. పార్టీకి వెళ్లినంత మాత్రాన డ్రగ్స్ తీసుకున్నట్లుగా ముద్ర వేయటం.. మరక వేయటం సరికాదన్న వాదన ఉంది. అయితే.. పార్టీకి క్రిష్ హాజరయ్యారన్న విషయాన్ని పార్టీని నిర్వహించిన వివేకానంద స్పష్టం చేయటంతో ఆయన పేరు ఎఫ్ఐఆర్ లో నమోదు కావటం తెలిసిందే.
మొత్తం పది మందితో కలిసి పార్టీ ఇచ్చిన వివేకానందను.. ఆ పార్టీలో వాడిన డ్రగ్స్ ను సప్లై చేసిన అబ్బాస్ తో పాటు మరికొందరిని అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన వారు మాత్రం పరారీలో ఉన్నారు. అయితే.. క్రిష్ మాత్రం పోలీసులకు అందుబాటులోనే ఉన్నప్పటికీ.. ఆయన పోలీసుల ఎదుట మాత్రం హాజరు కాలేదు. తాను హైదరాబాద్ లో లేనని.. బయట ఉన్నానని.. బుధవారం పోలీసుల వద్దకు వస్తానన్న సమాచారం ఇచ్చినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే.. క్రిష్ చెప్పినట్లుగా బుధవారం విచారణకు హాజరు కాలేదు.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రాడిసన్ డ్రగ్ పార్టీ జరుగుతున్న సమయంలో క్రిష్ అక్కడకు వచ్చారని.. ఆ పార్టీలో దాదాపు 30 నిమిషాల పాటు అక్కడ ఉన్నట్లుగా గుర్తించినట్లు తెలుస్తోంది. హోటల్ కు వచ్చిన క్రిష్.. నేరుగా వివేకానంద పార్టీ ఇస్తున్న రూంలోకి వెళ్లారని.. అక్కడే ముప్ఫై నిమిషాలు ఉన్న ఆయన.. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారని చెబుతున్నారు. గతంలో వివేకానంద ఇచ్చిన పార్టీలకు క్రిష్ హాజరయ్యారా? ఒకవేళ అయి ఉంటే.. ఎంత టైం ఉన్నారు? అన్న విషయాల్ని ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం తాను ముంబయిలో ఉన్నట్లుగా పోలీసులకు క్రిష్ సమాచారం ఇచ్చారని చెబుతున్నారు. ఈ ఎపిసోడ్ లో ఆయన పేరు వచ్చినప్పటి నుంచి పోలీసులకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తున్నారని.. ఖాకీల రాడార్ లోనే ఆయన ఉన్నట్లుగా సమాచారం. ఈ కారణంగానే.. వెంటనే రావాలన్న ఒత్తిడిని చేయట్లేదంటున్నారు.
విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. పక్కాగా బుధవారం పోలీసుల వద్దకు వస్తానని క్రిష్ చెప్పలేదని.. తాను ఊళ్లో లేనని.. రాబోయే రెండు.. మూడు రోజుల్లో తాను హైదరాబాద్ కు తిరిగి వస్తున్నట్లుగా సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో బుధవారం విచారణకు వచ్చే అవకాశం ఉందన్న వార్తలు మొదలైనట్లుగా చెబుతున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం శుక్రవారం పోలీసుల ముందుకు దర్శకుడు క్రిష్ వస్తారని చెబుతున్నారు. విచారణలో భాగంగా తొలుత ప్రశ్నలు వేసి.. ఆ తర్వాత బ్లడ్ శాంపిల్స్ తీసుకోవాలా? లేదా? అన్న అంశాన్ని తేలుస్తారని చెబుతున్నారు.