Begin typing your search above and press return to search.

వీడియో: మోడీ @ టీంఇండియా డ్రెస్సింగ్ రూం... ఆజాద్ కామెంట్స్ వైరల్!

ఈ సందర్భంగా మాజీ క్రికెటర్, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేత కీర్తి ఆజాద్ కీలక వ్యాఖ్యలు చేశారు.

By:  Tupaki Desk   |   21 Nov 2023 1:18 PM GMT
వీడియో: మోడీ @ టీంఇండియా డ్రెస్సింగ్ రూం... ఆజాద్ కామెంట్స్ వైరల్!
X

ఆస్ట్రేలియాతో జరిగిన వన్ డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ లో రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత క్రికెట్ జట్టు 6 వికెట్ల తేడాతో ఓటమి ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో టీం ఇండియా ఆటగాళ్లతోపాటు కోట్ల మంది క్రికెట్ అభిమానుల కళ్లు చెమర్చాయి. ఆ సమయంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇండియన్ డ్రెస్సింగ్ రూంను సందర్శించారు. తాజాగా దీనికి సంబంధించిన వీడియోతోపాటు... అనుకూల, వ్యతిరేక కామెంట్లు వైరల్ అవుతున్నాయి!

అవును... ఆస్ట్రేలియాతో జరిగిన వన్ డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ ఓటమి అనంతరం టీం ఇండియా ఆటగాళ్లను వారి డ్రెస్సింగ్ రూంలో కలుసుకున్నారు భారత ప్రధాని మోడీ. ఈ సందర్భంగా ప్రతీ ఒక్కరినీ అభినందిస్తూ, ఓదారుస్తూ ముందుకు కదిలారు. ఇందులో భాగంగా... మీరు 10 మ్యాచ్‌ లు గెలిచిన తర్వాత ఇక్కడకు చేరుకున్నారని.. ఇవి జరుగుతుంటాయని.. రోహిత్ - కోహ్లీలతో చెప్పారు మోడీ!

అనంతరం భారత కోచ్ రాహుల్ ద్రవిడ్ పడిన కష్టాన్ని ప్రధాని కొనియాడారు. ఇదే సమయంలో టోర్నమెంట్‌ లో 24 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌ గా నిలిచిన భారత పేసర్ మహ్మద్ షమీని మోడీ హృదయపూర్వకంగా కౌగిలించుకున్నారు. ఇలా ప్రతీ ఒక్క ఆటగాడిని పలకరిస్తూ, ఓదారుస్తూ, ప్రోత్సహిస్తూ మోడీ టీం ఇండియా డ్రెస్సింగ్ రూం లో కాసేపు ఉన్నారు.

ఈ సందర్భంగా ఈ వీడియోని షేర్ చేసిన పలువురు బీజేపీ నేతలు మోడీని కొనియాడారు. ఇందులో భాగంగా... "అత్యుత్తమ సమయంలో కాదు, అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో మీకు అండగా నిలిచేవాడే నిజమైన నాయకుడు" అంటూ వీడియోను షేర్ చేస్తూ, బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా ఆన్ లైన్ వేదికగా స్పందించారు.

ఇదే సమయంలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడుతూ... ప్రధాని మోడీ జట్టును ప్రోత్సహించారని, ప్రపంచకప్‌ లో ఆటగాళ్లు ప్రదర్శనను ప్రశంసించారు. మరో కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ కూడా ఈ వీడియోను షేర్ చేస్తూ "దేశం మొత్తం మీకు అండగా నిలుస్తుంది" అని పేర్కొన్నారు.

డ్రెస్సింగ్ రూం లో వీడియోపై విమర్శలు!:

డ్రెస్సింగ్ రూంలో భారత ఆటగాళ్లతో మోడీ సంభాషించిన వీడియో బయటకు రావడంతో పలువురు విపక్ష నేతలు సెటైర్లు పేలుస్తున్నారు. విచారంగా ఉన్నవారి వద్దకు కెమెరాలు తీసుకెళ్లడం ఏమిటని ప్రశ్నించారు. ఈ సందర్భంగా మాజీ క్రికెటర్, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేత కీర్తి ఆజాద్ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇందులో భాగంగా... డ్రెస్సింగ్ రూం అనేది ఏ జట్టుకైనా పవిత్ర స్థలమని, ఈ గదుల్లోకి ఆటగాళ్లు, సహాయక సిబ్బంది మినహా ఎవరినీ ప్రవేశించడానికి ఐసీసీ అనుమతించదని వెల్లడించారు. ప్రైవేట్ విజిటర్స్ ఏరియాలో, డ్రెస్సింగ్ రూం వెలుపల ప్రధాన మంత్రి టీంను కలుసుకుని ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు.

అయితే ఈ విషయాన్ని తాను ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా క్రీడాకారుడిగా చెబుతున్నట్లు తెలిపిన ఆజాద్... నరేంద్ర మోడీ తన మద్దతుదారులను తన బెడ్‌ రూం, డ్రెస్సింగ్ రూం లేదా టాయిలెట్‌ లోకి వచ్చి ఓదార్చడానికి లేదా అభినందించడానికి అనుమతిస్తారా అను కాస్త ఘాటుగానే ప్రశ్నించారు. కాగా... 1983 ప్రపంచకప్‌ లో భారత జట్టు ఆజాద్ ఒకరు! దీంతో ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి!