Begin typing your search above and press return to search.

ఉక్రెయిన్ కు రూ.4200 విరాళం.. ఆమెకు 12 ఏళ్లు జైలు

చేసే పని విషయంలో క్లారిటీ ఏ మాత్రం మిస్ అయినా.. జీవితం మొత్తం తలకిందులు అవుతుంది.

By:  Tupaki Desk   |   16 Aug 2024 10:30 AM
ఉక్రెయిన్ కు రూ.4200 విరాళం.. ఆమెకు 12 ఏళ్లు జైలు
X

చేసే పని విషయంలో క్లారిటీ ఏ మాత్రం మిస్ అయినా.. జీవితం మొత్తం తలకిందులు అవుతుంది. అందుకే.. కొన్ని విషయాల్లో ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అందుకు భిన్నంగా వ్యవహరిస్తే జీవితం ఎంత దుర్భరంగా మారుతుందన్న దానికి నిదర్శనంగా ఈ ఉదంతాన్ని చెప్పొచ్చు. రష్యా అమెరికన్ అయిన ఒక మహిళ.. ఉక్రెయిన్ కు విరాళంగా చిరు మొత్తాన్ని ఆన్ లైన్ లో పంపింది. ఇదే ఆమె చేసిన అత్యంత దారుణమైన తప్పు. దీనికి ఫలితంగా దేశ ద్రోహం ఆరోపణను ఎదుర్కోవటమే కాదు.. తాజాగా ఆమెకు పన్నెండేళ్ల జైలుశిక్షను విధిస్తూ రష్యా కోర్టు విధించిన శిక్ష సంచలనంగా మారింది.

రష్యాకు చెందిన 33 ఏళ్ల సేనియా ఖవానా అనే డ్యాన్సర్ అమెరికాకు చెందిన వ్యక్తిని పెళ్లాడి లాస్ ఏంజెల్స్ లో స్థిరపడ్డారు. హాయిగా సాగిపోతున్న ఆమె జీవితంలో ఉక్రెయిన్ యుద్ధం వేళ.. ఉక్రెయిన్ కు ఆమె 51 డాలర్ల విరాళాన్ని అందించారు. మన రూపాయిల్లో చెప్పాలంటే సుమారు రూ.4100. ఈ చిరు మొత్తాన్ని విరాళంగా ఆ దేశానికి ఇచ్చిన ఆమె.. రష్యాలో ఉన్న తన కుటుంబ సభ్యుల్నికలిసేందుకు రష్యాకు వచ్చారు.

ఆమె పర్యటనను గుర్తించిన రష్యా అధికారులు.. ఆమె తమ శత్రు దేశమైన ఉక్రెయిన్ కు ఆర్థిక సాయం చేయటాన్ని దేశ ద్రోహం చర్యగా పేర్కొన్నారు. ఉక్రెయిన్ సంస్థలకు ప్రయోజనం కలిగించేలా అమెరికాకు చెందిన ఒక ఎన్జీవోకు ఆమె విరాళాలు అందించిన విషయాన్ని గుర్తించింది. విచారణలో తాను విరాళం ఇచ్చిన మాట వాస్తవమే అన్న ఆమె.. రష్యా వ్యతిరేక కార్యకలాపాలకు వినియోగిస్తారన్న విషయం తనకు తెలీదని పేర్కొంది.

అయినప్పటికీ ఆమె వాదనను రష్యా కోర్టు ఏకీభవించలేదు. ఆమెను అరెస్టు చేసిన అధికారులు విచారణలో భాగంగా ఆమెపై దేశ ద్రోహ కేసును కూడా నమోదు చేశారు. తాజాగా ఆమెపై తీర్పును వెల్లడించింది రష్యా కోర్టు. సదరు మహిళకు పన్నెండేళ్ల జైలుశిక్ష విధిస్తూ షాకింగ్ నిర్ణయాన్ని వెల్లడించారు. తాను ఎన్జీవోకు ఇచ్చిన చిరు మొత్తంతో రష్యా వ్యతిరేక కార్యకలాపాలకు వినియోగిస్తారన్న అంశంపై తనకు ఐడియాలో లేదన్న విషయాన్ని ఎంత చెప్పినా రష్యా కోర్టు ఒప్పుకోకపోవటమే కాదు.. ఆమెకు విధించిన కఠిన కారాగార శిక్ష ఇప్పుడు షాకింగ్ గా మారింది.