Begin typing your search above and press return to search.

అమెరికా కాబోయే ప్రెసిడెంట్ ఎవరంటే..? కేటీఆర్ పక్కా అంచనా ఇది

తెలంగాణ మంత్రిగా అనేక సార్లు రోజుల తరబడి అమెరికా పర్యటన చేసిన కేటీఆర్.. పలువురు పారిశ్రామికవేత్తలను పెట్టుబడులకు మొగ్గుచూపేలా చేశారు.

By:  Tupaki Desk   |   11 Sep 2024 12:24 PM GMT
అమెరికా కాబోయే ప్రెసిడెంట్ ఎవరంటే..? కేటీఆర్ పక్కా అంచనా ఇది
X

భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కార్యనిర్వాహక అధ్యక్షుడు, తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. ఒకప్పటి తన కార్యక్షేత్రం.. ఇప్పుడు తన కుమారుడి విద్యాక్షేత్రం అయిన అమెరికాకు వెళ్లిన కేటీఆర్ అక్కడినుంచే తెలంగాణ రాజకీయాలపైన స్పందిస్తున్నారు. రాష్ట్రంలో వరదలు వచ్చిన సందర్భంలో బీఆర్ఎస్ కు ఆయన లేని లోటు కనిపించింది. మరోవైపు కేటీఆర్ అమెరికా నుంచి వచ్చేందుకు మరికొన్ని రోజులు పట్టొచ్చు. తెలంగాణ మంత్రిగా అనేక సార్లు రోజుల తరబడి అమెరికా పర్యటన చేసిన కేటీఆర్.. పలువురు పారిశ్రామికవేత్తలను పెట్టుబడులకు మొగ్గుచూపేలా చేశారు.

ఏపీ, మహారాష్ట్రలో చదివి.. అమెరికాలో ఉద్యోగం

కేటీఆర్ పక్కా తెలంగాణ వాది అయినా.. ఆయన చదువు మూడు రాష్ట్రాల్లో సాగింది. తెలంగాణలో టెన్త్ తర్వాత ఏపీలోని గుంటూరులో ఇంటర్, మహారాష్ట్రలో ఎంబీఏ చదివారు. అనంతరం అమెరికాకు ఉద్యోగం కోసం వెళ్లారు. అప్పట్లోనే తాను నెలకు లక్షల జీతం తీసుకునేవాడినని చెప్పారు. కేటీఆర్ చెల్లెలు, ఎమ్మెల్సీ కవిత కూడా అమెరికాలో ఉద్యోగం చేసినవారే కావడం విశేషం. ఇప్పుడు కేటీఆర్ కుమారుడు హిమాన్షు అమెరికాలో విద్యాభ్యాసం చేస్తున్నారు. పది రోజుల కిందట అతడి వద్దకు వెళ్లారు. కాగా, 2001లో తెలంగాణ రాష్ట్ర సమితిని ప్రారంభించినా కేటీఆర్, కవిత 2006 తర్వాతనే పార్టీలో ప్రధాన పాత్ర పోషించారు. అప్పటివరకు వారు అమెరికాలో ఉండి వచ్చారు.

ఆమెనా? ఆయనా? గెలిచేదేవరు?

కేటీఆర్ కు కొన్నేళ్లు అమెరికాలో ఉన్నందున అక్కడి రాజకీయాలు బాగా తెలిసే ఉంటాయి అని భావించవచ్చు. అందులోనూ రాజకీయ కుటుంబానికి చెందిన వ్యక్తి కాబట్టి కేటీఆర్ అంచనాలను కూడా కొంత నమ్మవచ్చు. తాజాగా ఆయన అమెరికాలో నవంబరు 5న జరగనున్న ఎన్నికల్లో గెలిచేది ఎవరో జోస్యం చెప్పారు. అమెరికా ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థిగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ అభ్యర్థిగా ఉపాధ్యక్షురాలు భారతీయ మూలాలున్న కమలా హారిస్ తలపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేటీఆర్ ఎవరికి ఓటు (గెలుపు అంచనా) వేశారన్నది ఆసక్తికరం.

ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అమెరికాకు మొదటి మహిళా అధ్యక్షురాలా? లేక ట్రంప్ మళ్లీ గెలుస్తారా? అనే ఉత్కంఠ పెరిగిపోతోంది. దీంతో కేటీఆర్ ఏం చెప్పి ఉంటారా? అన్న ఆసక్తి కూడా కలిగింది. అయితే, ఆయన ఆశ్చర్యకరంగానే ఓటు వేశారు. వచ్చే అమెరికా ఎన్నికలు చరిత్రలో నిలిచిపోతాయనేలా జోస్యం చెప్పారు. ప్రవాస భారతీయురాలు కమలా హారిస్ అధ్యక్షురాలు కాబోతున్నట్లు ప్రకటించారు. “ఆమె నిజంగా “ప్రెసిడెన్షియల్” @KamalaHarris అని పోస్ట్ చేశారు.

కొసమెరుపు: ఇటీవలి ఏపీ ఎన్నికల్లో వైఎస్ జగన్ గెలవనున్నట్లు కేటీఆర్ చెప్పారు. కానీ, జగన్ పార్టీ అత్యంత ఘోరంగా 11 సీట్లకే పరిమితం అయింది. మరి ఈసారి అమెరికా ఎన్నికల్లో కేటీఆర్ అంచనాలు నిజమవుతాయా లేదా అనేదానిని నవంబరు 5వ తేదీ తర్వాత చూడాలి.