Begin typing your search above and press return to search.

కేసీఆర్ కోరుకున్నదే రేవంత్ చేస్తున్నారా ?

మరి కేటీఆర్ ని అరెస్ట్ చేసి కేసీఆర్ కోరికను రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీరుస్తుందా అంటే వెయిట్ అండ్ సీ.

By:  Tupaki Desk   |   19 Dec 2024 5:00 PM GMT
కేసీఆర్ కోరుకున్నదే రేవంత్ చేస్తున్నారా ?
X

రాజకీయాల్లో చాలా ఈక్వేషన్స్ ఉంటాయి. అవి ఒకలా అనుకుంటే వేరేలా చిత్రీకరించబడుతూంటాయి. వాటికి మించి జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారు అన్నది కూడా ముఖ్యం. రాజకీయ నేతలు ఎన్ని తప్పులు చేసినా వారిని అరెస్ట్ చేస్తే మాత్రం జనాలలో ఎక్కడ లేని సానుభూతి వస్తుంది అన్నది వాస్తవం. అది తెలుగు నాట మాత్రమే కాదు దేశమంతా రుజువు అవుతూ వస్తున్న సత్యం.

జైలుకు వెళ్ళిన వారి బాధ ఎపుడూ వృధా పోలేదని వారు ఏకంగా తాము గురిపెట్టిన సింహాసనానికి చేరుకుంటారు అన్నది కూడా తలపండిన రాజకీయ పండితులు చెప్పేమాట. కళ్ల ముందు ఎన్నో ఉదాహరణలు ఇలా ఉండగానే పాలకులు మాత్రం ప్రత్యర్థుల మీద ఎపుడూ సంధించే అస్త్రం అరెస్టు. విపక్షంలో ఉన్న వారిని అరెస్ట్ చేస్తే వారికి సానుభూతి వస్తుందని తెలిసి కూడా చేస్తూ ఉంటారు

అది కాకుండా వేరే మార్గాలు ఉంటాయో లేదో తెలియదు కానీ కోరి మరీ ఆ చాన్స్ ఇస్తున్నారా అన్న చర్చ కూడా సాగుతోంది. ఏపీలో చంద్రబాబుని 2023 సెప్టెంబర్ లో అప్పటి సీఎం జగన్ అరెస్ట్ చేయడమే ఆయన రాజకీయ జాతకం తిరగబడడానికి ప్రధాన కారణం అని ఇప్పటికీ విశ్లేషించేవారు ఉన్నారు. అదే నిజమని కూడా చెబుతూంటారు.

వెనక్కి వెళ్తే జగన్ పదహారు నెలల జైలు జీవితం కూడా ఆయనను సీఎం గా చేసేందుకు ఎంతో దోహదపడింది అని అంటారు. ఇవన్నీ పక్కన పెడితే రీసెంట్ గా జార్ఖండ్ సీఎం గా మరోమారు బాధ్యతలు స్వీకరించిన హేమంత్ సోరెన్ ని కూడా అరెస్ట్ చేసి జైలులో పెట్టారు అన్నది మరవరాదు అంటున్నారు.

ఇపుడు కేటీఆర్ వంతు అని అంటున్నారు. ఆయనను అరెస్ట్ చేయడానికి రంగం అయితే సిద్ధం అయిపోయింది. ఎందుకంటే కేటీఆర్ మీద పెట్టిన సెక్షన్లు చూస్తే అలాగే ఉన్నాయి. ఈ కార్ రేసు వ్యవహారంలో కేటీఆర్ మీద కేసుని ఏసీబీ నమోదు చేసింది. ఆయనను ఏ వన్ గా ఇందులో చూపించారు.

ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారు అన్న ఆరోపణలతో ఏసీబీ కేటీఆర్ మీద ఈ కేసు నమోదు చేసింది. అంతే కాదు కేటీఆర్ మీద నాలుగు సెక్షన్లతో కేసు పెట్టింది. అందులో చూస్తే కనుక ఏ 13 (2) పీసీ యాక్ట్, 409, 120బీ కింద కేసు పెట్టారు.

కేటీఆర్ మంత్రిగా ఉండగా ఆర్బీఐ గైడ్ లైన్స్ కి వ్యతిరేకంగా ఎఫ్ఈవో కంపెనీకి 45 కోట్ల రూపాయలు హెచ్ఎండీఏ చెల్లించింది అని అభియోగం మోపారు. ఇదంతా కేబినెట్ అనుమతి, ఫైనాన్స్ క్లియరెన్స్ లేకుండా చేశారు అని కేటీఆర్ మీద పెట్టిన ప్రధాన అభియోగంగా ఉంది.

ఇదిలా ఉంటే కేటీఆర్ ని రేపో మాపో ఈ కేసు విషయంలో అరెస్ట్ చేస్తారు అని అంటున్నారు. దాంతో ఇపుడు బీఆర్ ఎస్ శిబిరంలో వేడి గా చర్చ సాగుతోంది. నిజానికి ఎమోషన్స్ నుండి రాజకీయాలు పండించే పార్టీగా బీఆర్ఎస్ ఎన్నో వ్యూహాలను అమలు చేస్తుంది. అయితే గత ఏడాది కాలంగా బీఆర్ఎస్ రాజకీయ చప్పగా సాగుతోంది.

అదే టైంలో కేటీఆర్ ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం టార్గెట్ చేస్తుందని అంతా అనుకుంటూ వచ్చారు. అలా చేయాలన్నది కూడా కేసీఆర్ కోరుకున్నారు అని అంటున్నారు. ఎందుకంటే రాజకీయాల్లో ఈ అరెస్టులు ఎపుడూ బాధితులకే కలసి వస్తాయి. కేటీఆర్ అరెస్ట్ అయి కొన్నాళ్ళు జైలులో ఉన్నా మొత్తం గులాబీ తోట నిండుగా విరబూస్తుందని మొత్తానికి మొత్తం తెలంగాణా రాజకీయంలో బీఆర్ఎస్ ఒక్కసారిగా జోరందుకుంటుందని కూడా అంచనా వేస్తున్నారు.

మరి కేసీఆర్ కోరుకుంటున్నది అలాగే నన్ను అరెస్ట్ చేసుకోండి అంటూ కేటీఆర్ పదే పదే సవాల్ చేసిన దానిని ఇపుడు రేవంత్ రెడ్డి సర్కార్ నెరవేరుస్తోందా అన్న చర్చ అయితే సాగుతోంది. తెలంగాణా రాజకీయాలలో ఈ అరెస్ట్ మాత్రం రాజకీయంగా ప్రకంపనలు రేపడం ఖాయమని అంటున్నారు.

అయితే ఈ కేసుల వల్ల ఎలాంటి సానుభూతి బీఆర్ఎస్ కి రాదు అని కాంగ్రెస్ ధీమాగా ఉంది. ఎందుకంటే కవితను అరెస్ట్ చేసినా ఏమీ కాలేదని పార్లమెంట్ ఎన్నికల్లో కలిసిరాలేదని గుర్తు చేస్తున్నారు. అయితే కవిత అరెస్ట్ వేరు కేటీఆర్ అరెస్ట్ వేరు అని అంటున్నారు. కేటీఆర్ అరెస్ట్ అయితే తెలంగాణా అగ్ని గుండం అవుతుందని ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు హేచ్చిరిస్తూ వస్తున్నారు.

దాంతో ఈ అరెస్ట్ వ్యవహారం మాత్రం రాజకీయ మంట పెట్టడం ఖాయమని అంటున్నారు. మరో వైపు చూస్తే కేటీఆర్ అరెస్ట్ వెనక పక్కా ఆధారాలు ఉన్నాయని కాంగ్రెస్ పెద్దలు అంటున్నారు. ఒక విదేశీ కంపెనీకి ఇండియన్ కరెన్సీని ఆర్బీఐ రూల్స్ కి విరుద్ధంగా ఎలాంటి అనుమతులు లేకుండా చెల్లించడం మీద అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎనిమిది కోట్ల రూపాయలు ఫైన్ వేసింది ఆర్బీఐ.

అయితే ఆ ఫైన్ ని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆర్బీఐకి చెల్లించారు. దీంతో బలమైన ఆధారాలు ఉన్నాయని కేటీఆర్ మీద కుట్ర చీటింగ్ సెక్షన్ల కింద ఏసీబీ కేసు నమోదు చేసింది. దీంతో ఈ విషయం మీద ఎలాంటి సానుభూతి రాదని కాంగ్రెస్ పెద్దలు అంటున్నారు. ఎనిమిది కోట్ల రూపాయలు ప్రజా ధనం ఆర్బీఐకి ఫైన్ గా చెల్లించడానికి కారణం అయిన వారిని అరెస్ట్ చేస్తే తప్పేంటి అన్నది కూడా కాంగ్రెస్ వాదంగా ఉంది.

కానీ రాజకీయాల్లో అయితే సానుభూతి ఎపుడూ వర్కౌట్ అవుతుంది. ఎవరెన్ని తప్పులు చేసినా అవి కౌంట్ కావని అంటున్నారు. అరెస్ట్ చేస్తే మాత్రం సానుభూతి వెల్లువలా వస్తుందని ఉదహరిస్తున్నారు. అందుకే కేటీఆర్ అరెస్ట్ అయితే మాత్రం కచ్చితంగా దానిని సొమ్ము చేసుకునేందుకు బీఆర్ఎస్ రెడీగా ఉంది అని అంటున్నారు. మరి కేటీఆర్ ని అరెస్ట్ చేసి కేసీఆర్ కోరికను రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీరుస్తుందా అంటే వెయిట్ అండ్ సీ.