రాహుల్‌ను తెలంగాణ రమ్మంటున్న కేటీఆర్.. కారణం ఏంటంటే..?
‘హలో రాహుల్ గాంధీ జీ.. మీరు చెప్పిన ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాల హామీని నమ్మి తెలంగాణ యువత నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారు.
By: Tupaki Desk | 9 Oct 2024 7:30 AM GMTరాష్ట్రంలో అధికారం కోల్పోయినప్పటి నుంచి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిత్యం కాంగ్రెస్ పార్టీపై సెటైర్లు వేస్తూనే ఉన్నారు. నిత్యం రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఎండగడుతూనే ఉన్నారు. సందర్భం చిక్కినప్పుడల్లా ఆ పార్టీ అగ్రనేతలను కూడా టార్గెట్ చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే కేటీఆర్ మరోసారి రాహుల్ గాంధీని ట్విట్టర్ వేదికగా టార్గెట్ చేశారు.
గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్ర పర్యటనకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌లో నిరుద్యోగ యువతను కలిశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అశోక్ నగర్‌లో అప్పుడు మాట్లాడిన వ్యాఖ్యలను రీ ట్వీట్ చేశారు. కాంగ్రెస్‌పై మరోసారి విరుచుకుపడ్డారు. ‘హలో రాహుల్ గాంధీ జీ.. మీరు చెప్పిన ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాల హామీని నమ్మి తెలంగాణ యువత నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 10 నెలలు అవుతోంది. 8 నెలల తర్వాత జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు. జాబ్ లెస్ క్యాలెండర్, జీరో ఉద్యోగాల కారణంగా యువత ఆందోళనబాట పట్టారు. మీరు ఎందుకు మళ్లీ హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌కు వచ్చి అదే యువతను కలిసి మీరిచ్చిన హామీలను ఎలా నెరవేరుస్తారో చెప్పొచ్చు కదా’ అని సూచించారు.
గతంలో రాహుల్ అశోక్‌నగర్‌లో పర్యటన సందర్భంగా తెలంగాణ యువత దొరల కేసీఆర్ పాలనలో తీవ్ర ఇబ్బందులు పడుతోందని చెప్పుకొచ్చారు. తన అశోక్ నగర్ పర్యటనలో ఇదే స్పష్టమైందని అన్నారు. ఇక .. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, నిరుద్యోగుల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అందులోభాగంగానే ఏడాది 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. అలాగే.. టీజీపీఎస్సీని యూపీఎస్సీని పునరుద్ధరిస్తామని భరోసా ఇచ్చారు.
వీటికితోడు యువ వికాసం పథకం కింద రూ.5 లక్షల ఆర్థిక చేయూతనిస్తామని రాహుల్ హామీ ఇచ్చారు. కాంగ్రెస్‌కు యువత మద్దతుగా నిలవాలని, ఇది నా గ్యారంటీ అని భరోసా ఇచ్చారు. దాంతో అప్పటి రాహుల్ వ్యాఖ్యలను ఇప్పుడు కేటీఆర్ రీ ట్వీట్ చేశారు. జాబ్ క్యాలెండర్‌ను జాబ్ లెస్ క్యాలెండర్‌గా అభివర్ణించారు. అయితే.. కేటీఆర్ ట్వీట్‌కు కాంగ్రెస్ నేతలు ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేశ్ లేదంటే మరే నేత అయినా స్పందిస్తారా అనేది చూడాలి.