Begin typing your search above and press return to search.

రేవంత్‌కు కేటీఆర్ సెటైరికల్ విషెస్.. ఇంతకీ ఏమన్నారంటే..!

ఒకవిధంగా చెప్పాలంటే రాష్ట్రంలో రేవంత్ వర్సెస్ కేటీఆర్ అన్నట్లుగానే పాలిటిక్స్ నడుస్తున్నాయి.

By:  Tupaki Desk   |   8 Nov 2024 7:48 AM GMT
రేవంత్‌కు కేటీఆర్ సెటైరికల్ విషెస్.. ఇంతకీ ఏమన్నారంటే..!
X

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుంచి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విరుచుకుపడుతూనే ఉన్నారు. నిత్యం రేవంత్ రెడ్డిని ప్రజాసమస్యలపై నిలదీస్తున్నారు. పది నెలలుగా ప్రభుత్వంపై ఫైర్ అవుతూనే ఉన్నారు. రేవంత్‌ను నిత్యం కార్నర్ చేస్తూ ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తన్నారు. అటు రేవంత్ రెడ్డి సైతం కేటీఆర్‌పై విరుచుకుపడుతున్నారు. కేటీఆర్ వేసిన ప్రశ్నలకు కౌంటర్ ఇస్తూ వస్తున్నారు. ఒకవిధంగా చెప్పాలంటే రాష్ట్రంలో రేవంత్ వర్సెస్ కేటీఆర్ అన్నట్లుగానే పాలిటిక్స్ నడుస్తున్నాయి.

ఈ క్రమంలో నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు కేటీఆర్ సెటైరికల్‌గా బర్త్ డే విషెస్ చెప్పారు. ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. తాను హైదరాబాద్‌లోనే ఉన్నానని.. ఏసీబీ అధికారులు ఎప్పుడైనా రావచ్చని.. వారికి తన స్వాగతం అని పేర్కొ్న్నారు. మీ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేయిస్తా.. టీ, బిస్కెట్లు కూడా ఇస్తాను అని ట్విట్టర్‌లో శుభాకాంక్షలు తెలుపుతూనే సెటైర్ వేశారు. కేటీఆర్ అరెస్ట్ భయంతో మలేషియా పారిపోయారని పలు మీడియాల్లో వార్తలు రావడంతో వాటిపై బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ స్పందించారు. ఆయన చేసిన ట్వీట్‌కు కేటీఆర్ రిప్లై ఇచ్చారు. తాను హైదరాబాద్‌లోనే ఉన్నానని, ఎప్పుడైనా రావచ్చని పేర్కొన్నారు.

తన అరెస్టు కోసం రేవంత్ రెడ్డి ఉవ్విళ్లూరుతున్నారని, మేఘా కృష్ణారెడ్డిని సుంకిసాల ఘటనలో బ్లాక్ లిస్టులో పెట్టే దమ్ముందా అని కేటీఆర్ సవాల్ చేశారు. దమ్ముంటే కృష్ణారెడ్డిని అరెస్ట్ చేయాలన్నారు. ఆంధ్రా కాంట్రాక్టర్‌ని, ఈస్ట్ ఇండియా కంపెనీని కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి తీసేయాలని డిమాండ్ చేశారు. సీఎం అయ్యండి మేఘాకు గులాంగిరీ చేయడం ఏంటని నిలదీశారు.

మరోవైపు.. మూసీ ప్రక్షాళన నేపథ్యంలో సీఎం రేవంత్ తీసుకున్న నిర్ణయంపైనా కేటీఆర్ స్పందించారు. నేడు రేవంత్ పుట్టినరోజు సందర్భంగా మూసీ పరివాహక ప్రాంతంలో పాదయాత్ర నిర్వహించేందుకు సిద్ధం అయ్యారు. దీనిపైనా కేటీఆర్ తనదైన శైలిలో కామెంట్స్ చేశారు. ‘మూసీ బాధితులు ఉన్నది ఎక్కడ..? మీరు పాదయాత్ర చేస్తున్నది ఎక్కడ..? పుండు ఒక దగ్గర అయితే.. మందు మరోచోట పెట్టినట్లు’గా ఉంది మీ వైఖరి’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో వేల ఇళ్లను కూల్చివేసే ప్లాన్ చేసి.. ఎక్కడో పాదయాత్ర చేయడం ఏంటని ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని మూసీ పరివాహన ప్రాంతంలో పాదయాత్ర చేసే ధైర్యం ఉందా అని సవాల్ చేశారు. మూసీ లూటిఫికేషన్ ప్రాజెక్టు కన్సల్టెంట్లతో మూడు రోజుల పాటు చర్చించే టైం ఉంది కానీ.. గ్యారంటీలపై సమీక్షకు గంట సమయం లేదా అని ప్రశ్నించారు. మేనిఫెస్టోలోని మోసపూరిత హామీలను పక్కనపెట్టి.. మూసీ ప్రాజెక్టును నెత్తిన ఎందుకు పెట్టుకున్నారని నిలదీశారు. కేవలం కమీషన్ల కోసమే మూసీ అంశాన్ని ఎత్తుకున్నారని మరోసారి ఆరోపించారు. పాదయాత్రలు చేసినా.. పొర్లుదండాలు పెట్టినా మూసీ శాపం మిమ్మల్ని వీడదు అని పేర్కొన్నారు.