Begin typing your search above and press return to search.

ఇదే ప్రశ్నను కేసీఆర్ ను అడిగితే పరిస్థితేంటి కేటీఆర్?

ఈ సందర్భంగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. 'పేపర్ చూడకుండా రిజునువేషన్ స్పెల్లింగ్ చెబితే రేవంత్ రెడ్డికి రూ.50 లక్షల బ్యాగ్ గిఫ్టుగా ఇస్తా.

By:  Tupaki Desk   |   19 Oct 2024 5:30 AM GMT
ఇదే ప్రశ్నను కేసీఆర్ ను అడిగితే పరిస్థితేంటి కేటీఆర్?
X

ఆగ్రహం ఉండాలే కానీ ధర్మాగ్రహంగా ఉండాలి. ఆత్మవిశ్వాసం ఉండటం తప్పు కాదు.. కానీ ఆ పేరుతో అహంకారాన్ని ప్రదర్శించటం కచ్ఛితంగా తప్పే అవుతుంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని ఇష్టం వచ్చినట్లు మాట్లాడటంలో అర్థం లేదు. మాట్లాడే మాటల్లో సంస్కారం మిస్ అయితే మొదటికే మోసం వస్తుందన్న విషయాన్ని మాజీ మంత్రి కేటీఆర్ ఎంత త్వరగా అర్థం చేసుకుంటే అంత మంచిది. రాజకీయంగా సవాలచ్చ ప్రశ్నలు సంధించొచ్చు. కానీ.. ఆ మాటల్లో సంస్కారం ఉండాలి. లాజిక్ మిస్ కాకూడదు. అప్పుడు ప్రజల మనసుల్ని దోచుకునే వీలు ఉంటుంది. అందుకు భిన్నంగా మనసుకు అనిపించింది.. అనిపించినట్లుగా అనేస్తే ఆ మాటల్లో ఫైర్ మిస్ అయి.. మిస్ ఫైర్ మొదటికే మోసంగా మారుతుంది.

మూసీ ప్రక్షాళన కార్యక్రమాన్ని తమ ప్రభుత్వం ఎందుకు టేకప్ చేసిందన్న విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పటం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ఘాటు విమర్శలు చేశారు. దీనికి ప్రతిగా సీఎంకు కౌంటర్ ఇచ్చే బాధ్యతను మాజీ మంత్రులు కేటీఆర్.. హరీశ్ రావులు తీసుకున్నారు. ఈ క్రమంలో కేటీఆర్ నోటి నుంచి వచ్చిన ఒక మాట హాట్ టాపిక్ గా మారింది. మూసీ ప్రక్షాళన ప్రాజెక్టుకు సంబంధించి మాట్లాడిన సందర్భంలో ముఖ్యమంత్రి అదే పనిగా రిజువనేషన్ పదాన్ని పదే పదే ప్రస్తావించారని.. ఆ పదానికి పేపర్ చూడకుండా సరైన స్పెల్లింగ్ చెబితే రూ.50 లక్షలు ఇస్తానని సవాలు విసిరారు.

ఈ సందర్భంగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. 'పేపర్ చూడకుండా రిజునువేషన్ స్పెల్లింగ్ చెబితే రేవంత్ రెడ్డికి రూ.50 లక్షల బ్యాగ్ గిఫ్టుగా ఇస్తా. ఆయనకు ఇప్పుడు బ్యాగులు చాలా అవసరం. ఎందుకంటే ఢిల్లీకి డబ్బులు మోయాలి కదా. తళతళలాడే బ్యాగును పంపుతా' అని వ్యాఖ్యానించారు. మూసీ శుద్ది చేయటానికి వ్యతిరేకం కాదని.. దోచుకోవటాన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నామన్నారు.

''కోకాపేట.. ఓఆర్ఆర్ కుంభకోణాలు ఉంటే విచారణ చేసుకో రేవంత్. మూసీ ప్రాజెక్టుతో ఎంత భూమి సాగులోకి వస్తుంది? రేవంత్ రూ.50 లక్షలతో దొరికి తొమ్మిదేళ్లు అయినా శిక్షపడలేదు. రెడ్ కార్నర్ నోటీసులు ఉన్న పాకిస్థాన్ సంస్థకు మూసీ ప్రాజెక్టు ఎలా ఇస్తారు?'' అని ప్రశ్నించారు. మిగిలిన ప్రశ్నల్ని.. విమర్శల్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ.. ఒక ఇంగ్లిషు పదానికి స్పెల్లింగ్ చెప్పాలని అడగటం.. ఆ పేరుతో చులకన చేయటం ఎంతవరకు సబబు? అన్నది ప్రశ్న. ఒక ముఖ్యమంత్రిని ఉద్దేశించి అలా మాట్లాడేయటం.. నోరు పారేసుకోవటం సరైన పద్దతేనా? అన్నది చర్చగా మారింది.