Begin typing your search above and press return to search.

వైఎస్సార్ ను గుర్తుచేసిన కేటీఆర్... కేసీఆర్ తో కలిపి కామెంట్స్!

ఈ నేపథ్యంలో తాజాగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ని తాజాగా తాను గుర్తు చేసుకుంటూ, ప్రజలకు గుర్తు చేశారు బీఆరెస్స్ వర్కింగ్ ప్రెసిండెంట్, మాజీ మంత్రి కేటీఆర్!

By:  Tupaki Desk   |   28 Jan 2025 11:26 AM GMT
వైఎస్సార్  ను గుర్తుచేసిన కేటీఆర్...  కేసీఆర్  తో కలిపి కామెంట్స్!
X

రాష్ట్రాన్ని ఎంతమంది ముఖ్యమంత్రులు పాలించినా.. అందులో కొంతమంది పేరు చెబితే కొన్ని ప్రత్యేకతలు గుర్తుకు వస్తుంటాయి. ఎన్ని ప్రభుత్వాలు మారినా ఆ పథకాలు మారవు.. మహా అయితే ఆయా ప్రభుత్వాల ఆత్మసంతృప్తి మేరకు పథకం ముందు పేరు మారుతుంది. మరికొంత మంది పేరు చెబితే.. అనావృష్టికి సంబంధించిన ఆనవాళ్లు, అవి మిగిల్చిన చేదు జ్ఞాపకాలు ఉంటాయి.

ఉదాహరణకు ఎన్టీఆర్ పేరు చేబితే ముందుగా ‘కిలో రెండు రూపాయల బియ్యం’ పథకం గుర్తొస్తుందనే చెప్పాలి. ఎన్ని ప్రభుత్వాలు మారినా ఈ తరహా పథకం కంటీన్యూ అవ్వాల్సిందే. ఇదే సమయంలో చంద్రబాబు పేరు చెబితే ‘ఐటీ రంగం’ గుర్తుకువస్తుంది. ఇదే సమయంలో వైఎస్సార్ పేరు చెబితే గుర్తుకొచ్చే పథకాల్లో ‘ఆరోగ్య శ్రీ’ ది మొదటిస్థానం అని చెబుతుంటారు.

ఈ నేపథ్యంలో తాజాగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ని తాజాగా తాను గుర్తు చేసుకుంటూ, ప్రజలకు గుర్తు చేశారు బీఆరెస్స్ వర్కింగ్ ప్రెసిండెంట్, మాజీ మంత్రి కేటీఆర్! ఈ సందర్భంగా వైఎస్సార్ తో కలిపి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆరెస్స్ అధినేత కేసీఆర్ ప్రస్థావన తీసుకురావడం గమనార్హం. ఈ వ్యాఖ్యలు హల్ చల్ చేస్తున్నాయి.

అవును... తాజాగా నల్గొండ జిల్లాలో పర్యటించిన కేటీఆర్.. రైతు బంధు పథకంపై స్పందించారు. రైతు భరోసా డబ్బులు టకీ టకీమని పడతాయని రేవంత్ రెడ్డి అన్నారని.. మరి పడ్డాయా అని జనాన్ని ప్రశ్నించిన కేటీఆర్... బీఆరెస్స్ అధికారంలో ఉండగా కేసీఆర్ 12 సార్లు రైతు బంధు ఇచ్చారు కానీ.. ఏనాడూ ఇలా ప్రచారం చేసుకోలేదని అన్నారు.

ఈ సందర్భంగా... తాజా పరిస్థితులను చూసిన రైతులు.. పాలిచ్చే ఆవును కాదని దున్నపోతును తెచ్చుకున్నామని అంటున్నారని కామెంట్ చేశారు. ఈ ప్రభుత్వం తొలుత పార్లమెంట్ ఎన్నికల ముందు ఒకసారి రైతుబంధు ఇచ్చిందని.. మళ్లీ స్థానిక సంస్థల ఎన్నికల కోసం డ్రామాలు ఆడుతున్నారని.. ఆ ఎన్నికలు పూర్తవ్వగానే అటకెక్కడం ఖాయమని అన్నారు.

ఈ నేపథ్యంలోనే... ‘ఆరోగ్య శ్రీ’ అంటే వైఎస్సార్ గుర్తుకు వస్తారని.. అలాగే ‘రైతు బంధు’ అంటే కేసీఆర్ గుర్తుకు వస్తారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. అయితే.. కేసీఆర్ ప్రజలకు గుర్తుకు రాకుండా చేసేందుకు రైతుబంధును ఆపేశారని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోగానే రైతు భరోసా బంధ్ అవుతుందని ఈ సందర్భంగా రేవంత్ జోస్యం చెప్పారు.

ఏది ఏమైనా... కాంగ్రెస్ పార్టీకి చెందిన దివంగత ముఖ్యమంత్రిని గుర్తు చేస్తూ, ఈ సందర్భంగా తమ అధినేతను ప్రస్థావిస్తూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తిగా మారాయి.