మహారాష్ట్రకు తెలంగాణ డబ్బు.. ఈసీకి కేటీఆర్ కీలక విజ్ఞప్తి
మొత్తం జరిగి 8,888 కోట్ల రూపాయల పనులపై విచారణ జరిపించాలని కోరినట్లు తెలిపారు. ఢిల్లీకి వెళ్లిన కేటీఆర్.. కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ను కలిసి టెండర్లు రద్దు చేయాలని కోరారు.
By: Tupaki Desk | 12 Nov 2024 1:30 PM GMTతెలంగాణ కాంగ్రెస్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో మహారాష్ట్రలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారా లేదా అనేది చూడాలి.
మహారాష్ట్రలో ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు అక్కడ ప్రచారంలో పాల్గొంటున్నారు. అందులోనూ ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పలు ప్రాంతాల్లో పాల్గొని ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే పలు పర్యాయాలు వెళ్లిరాగా.. రేపు మరోసారి రేవంత్ ప్రచారం కోసం వెళ్తున్నారు. అయితే.. ఈ క్రమంలో కేటీఆర్ పలు ఆరోపణలు చేశారు. తెలంగాణ నుంచి మహారాష్ట్రకు పెద్ద ఎత్తున నగదు తరలుతోందని ఆరోపించారు. మహారాష్ట్రతోపాటు ఇతర రాష్ట్రాలకూ ఇక్కడి డబ్బు చేరుతోందని పేర్కొన్నారు. తెలంగాణ, మహారాష్ట్రల మధ్య ఈసీ సెక్యూరిటీ పెంచాలని కోరారు. ఎన్నికల ముంగిట కేటీఆర్ ఆరోపణలతో ఈసీ ఏమేరకు స్పందిస్తుందో చూడాలి.
అలాగే.. తెలంగాణ ప్రభుత్వం కాంట్రాక్టుల కేటాయింపుల్లోనూ అవినీతికి పాల్పడుతోందని కేటీఆర్ ఆరోపించారు. అమృత్ 2.0లో భాగంగా తెలంగాణకు కేటాయించిన నిధుల్లో నుంచి రూ.1,137 కోట్ల పనులను ముఖ్యమంత్రి రేవంత్ తన బావ మరిదికి చెందిన కంపెనీకి అప్పగించారని ఆరోపించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తమ వద్ద ఉన్నాయన్నారు. ఆ పూర్తి వివరాలను కేంద్రం వద్ద బయటపెట్టేందుకే తాను ఢిల్లీ వచ్చినట్లు వెల్లడించారు. మొత్తం జరిగి 8,888 కోట్ల రూపాయల పనులపై విచారణ జరిపించాలని కోరినట్లు తెలిపారు. ఢిల్లీకి వెళ్లిన కేటీఆర్.. కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ను కలిసి టెండర్లు రద్దు చేయాలని కోరారు.
ఆఫీస్ ఆఫ్ ది ప్రాఫిట్ నిబంధనను ముఖ్యమంత్రి రేవంత్ ఉల్లంఘించారని కేటీఆర్ ఆరోపించారు. సీఎం అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు. కేంద్ర ప్రభుత్వం కేటాయించిన ఇంత పెద్ద ప్రాజెక్టులో మోడీ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం అవినీతిని ఢిల్లీలో ఎండగడతామని ఆయన స్పష్టం చేశారు. అంతకాకుండా రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ అమలు చేస్తున్నారని ఆరోపించారు. ఆర్ఆర్ ట్యాక్స్ అంటే రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ట్యాక్స్ అని అన్నారు. తాము ఇంతగా చెబుతున్నా కేంద్రం ఎందుకు ఎంక్వయిరీ చేయించడం లేదని ప్రశ్నించారు.