Begin typing your search above and press return to search.

మళ్లీ ఇరుక్కున్న కేటీఆర్.. సోషల్ మీడియాలో ఏపీ వాసుల ఫైర్

లూజ్ లిప్స్ తో షిప్స్ మునిగిపోతాయంటూ ఓ నెటిజన్ హెచ్చరించడం చూస్తే ఆయన వ్యాఖ్యలు ఏపీ వాసులను ఎంతలా బాధపెట్టాయో అర్థమవుతోందని అంటున్నారు.

By:  Tupaki Desk   |   10 March 2025 5:03 PM IST
మళ్లీ ఇరుక్కున్న కేటీఆర్.. సోషల్ మీడియాలో ఏపీ వాసుల ఫైర్
X

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పై ఏపీ సోషల్ మీడియా యుద్ధం ప్రకటించింది. తెలంగాణ నుంచి కంపెనీలు, పెట్టుబడులు వెళ్లిపోతున్నాయంటూ ‘ఎక్స్’లో విమర్శలు చేసిన కేటీఆర్.. ‘చివరికి ఆంధ్రప్రదేశ్’ అంటూ ప్రస్తావించడంతో నిరసనలు ఎదుర్కొంటున్నారు. తెలంగాణ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయినా కేటీఆర్ తీరులోనూ అహంకారంలోనూ మార్పు రాలేదంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. లూజ్ లిప్స్ తో షిప్స్ మునిగిపోతాయంటూ ఓ నెటిజన్ హెచ్చరించడం చూస్తే ఆయన వ్యాఖ్యలు ఏపీ వాసులను ఎంతలా బాధపెట్టాయో అర్థమవుతోందని అంటున్నారు.

రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణను ధనిక రాష్ట్రంగా చెప్పుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వం తమ పదేళ్ల పాలనలో అప్పుల రాష్ట్రంగా మార్చేసిందని మరికొందరు విమర్శిస్తున్నారు. ఇక నెటిజన్ల నుంచి ప్రతిఘటన ఎక్కువగా ఉండటంతో అధికార కూటమి కూడా రంగంలోకి దిగింది. టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఇప్పటికైనా మాట తీరు మార్చుకోవాలని సూచించారు. లేదంటే ఆ పార్టీ వచ్చే ఎన్నికల్లోనూ ఓడిపోతుందని, కేటీఆర్ సిరిసిల్లలోనూ గెలవలేడని హెచ్చరించారు.

తెలంగాణ కోసం పార్టీ ప్రారంభించిన కేటీఆర్ తండ్రి కేసీఆర్ పదేళ్ల అధికారంలో ఉండగా, తన పార్టీని జాతీయ స్థాయికి విస్తరించి టీఆర్ఎస్ ను బీఆర్ఎస్గా మార్చిన విషయాన్ని అంతా గుర్తు చేస్తున్నారు. తమది జాతీయ పార్టీ అంటూ ఏపీతోపాటు కర్ణాటక, చత్తీస్ ఘఢ్, రాజస్థాన్, గుజరాత్, ఒడిశా రాష్ట్రాల నుంచి నాయకులను హైదరాబాద్ పిలిపించుకున్న గులాబీ నేతలు.. ఇప్పుడు మళ్లీ తెలంగాణ వాదం వినిపించడాన్ని నెటిజన్లు తప్పుబడుతున్నారు. గతంలో కూడా ఏపీపై ఇలాంటి వ్యాఖ్యలు చేసే సెటిలర్ల ఆగ్రహాన్ని చవిచూసిన బీఆర్ఎస్ నేత ఇప్పటికైనా మారాలని అంటున్నారు.

పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ ఇతర రాష్ట్రాలతో పోటీ పడుతుండగా, తమ రాష్ట్రాన్ని చిన్నబుచ్చేలా పక్కరాష్ట్రానికి చెందిన మాజీ మంత్రి విమర్శలు చేయడాన్ని నెటిజన్లు తప్పుపడుతున్నారు. తమ రాష్ట్రం 2018లోనే తెలంగాణ కన్నా మెరుగైన స్థానంలో ఉన్న విషయాన్ని కొందరు గుర్తు చేస్తున్నారు. అదేవిధంగా రాజధాని లేని రాష్ట్రం కియా మోటార్ కార్స్, అశోక్ లేలాండ్, హీరో మోటార్ కార్స్ వంటి పరిశ్రమలు సాధించిన విషయాన్ని కేటీఆర్ గుర్తించుకోవాలని కూడా చెబుతున్నారు. కేటీఆర్ ఏపీపై వ్యంగ్యాస్త్రాలు సంధించేముందు ప్రస్తుతం జగన్ ప్రభుత్వం ఉందని మీరు అనుకుంటున్నారా? అవును అయితే మీ కలలు నుంచి బయటకి రండి అంటూ మరో యూజర్ సెటైర్ వేశాడు. ఇలా కేటీఆర్ చేసిన ఒకే ఒక్క ట్వీట్ తీవ్ర నిరసనలు ఎదుర్కొంటుండటంతో బీఆర్ఎస్ ఎలా స్పందిస్తుందనేది చూడాల్సవుంది.