ఈడీ ఎందుకీ మౌనం.. దర్యాప్తు సంస్థపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఎంతో నమకస్తుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి.
By: Tupaki Desk | 2 Oct 2024 7:30 AM GMTతెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఎంతో నమకస్తుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఒకవిధంగా ఇప్పుడు ఆయననే ప్రభుత్వంలో నంబర్ 2 పొజిషన్‌లో ఉన్నారని సచివాలయ వర్గాల టాక్. రేవంత్ తర్వాత ఎక్కువ పనులు ఆయనే చక్కబెడుతున్నారని టాక్. కీలక పొజిషన్లో కొనసాగుతున్న పొంగులేటి ఇంటిపై ఈ మధ్య ఈడీ దాడులు నిర్వహించింది. పెద్ద ఎత్తున ఈ సోదాలు జరిగాయి.
రాష్ట్ర పోలీసులకు సైతం ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఢిల్లీ నుంచి 15 ఈడీ బృందాలు వచ్చాయి. ముందుగా జూబ్లీహిల్స్‌లోని పొంగులేటి నివాసంలో సోదాలు నిర్వహించాయి. అలాగే ఆయన కుటుంబసభ్యులు, బంధువుల ఇళ్లలోనూ సోదాలు చేశారు. సీఆర్పీఎఫ్ బలగాలకు భద్రతగా ఏర్పాటు చేసుకొని మరీ సోదాలు చేశారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు హర్షరెడ్డికి సంబంధించిన రాఘవ గ్రూప్ కంపెనీస్ కార్యాలయాల్లోనూ ఈ తనిఖీలు జరిగాయి. రాఘవ గ్రూపాఫ్ కంపెనీస్‌తోపాటు శ్రీనివాసరెడ్డి కుటుంబసభ్యుల ఆర్థిక లావేదేవీలపై ఆరా తీశారు. అటు పొంగులేటి ఫాంహౌస్ వద్ద కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏ అంశం కూడా బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
గత ఫిబ్రవరి 5న హాంకాంగ్‌లో నివాసం ఉండే మహ్మద్ ఫహెర్దీన్ ముబీన్ సింగపూర్ నుంచి చెన్నై వచ్చాడు. అతని నుంచి కస్టమ్స్ అధికారులు విదేశాలకు చెందిన ఖరీదైన వాచీలను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.1.73 కోట్లుగా నిర్ధారించారు. ముబీన్‌ను పోలీసులు విచారించగా.. మధ్యవర్తి నవీన్ పేరు చెప్పాడు. నవీన్‌ను ద్వారా పొంగులేటి కొడుకు హర్షరెడ్డికి సుమారు రూ.7కోట్ల విలువ చేసే ఏడు లగ్జరీ వాచీలను చేర్చినట్లు వెల్లడైంది. వాటికి క్రిప్టో కరెన్సీ, హవాలా రూపంలో మనీ ల్యాండరింగ్ జరిగినట్లుగా గుర్తించారు. చెన్నై కస్టమ్స్ అధికారులు నోటీసులు జారీ చేయగా.. మనీ ల్యాండరింగ్ అంశం కావడంతో వారు ఈడీకి కూడా ఫిర్యాదు చేశారు. ఇక అప్పటి నుంచి ఈ వ్యవహారం రాజకీయంగా పెను దుమారం రేపింది.
ఇవి ఈడీ దాడులు కావని.. బీజేపీ దాడులని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. బీఆర్ఎస్ నేతలు మాత్రం తనిఖీల్లో వెలుగులోకి వచ్చిన అంశాలను బహిర్గతమహా పరచాలని డిమాండ్ చేస్తూ వచ్చారు. తాజాగా ఇదే అంశంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. పొంగులేటి ఇంట్లో సోదాలు చేసి ఇన్ని రోజులు అవుతున్నా ఈడీ ఇంతవరకు ప్రకటించకపోవడాన్ని తప్పుపట్టారు. మహాసంపన్న తెలంగాణ మంత్రిపై దాడుల తర్వాత ఏంటి ఈ ఈడీ మౌనం?’ అని ప్రశ్నించారు. 5 రోజుల తర్వాత కూడా ఎలాంటి చేయకపోవడం ఏంటని నిలదీశారు. ఈ డ్రామా కాస్త బీజేపీ, కాంగ్రెస్ ‘అజబ్ ప్రేమ్‌కి గజబ్ కహానీ’లో భాగమేనా అని ప్రశ్నించారు.