చిట్టినాయుడు సుభాషితాలు.. కేటీఆర్ ఎటకారం పీక్స్
దీనికి కౌంటర్ గా సీఎం రేవంత్ ను ఉద్దేశిస్తూ ఘాటైన వ్యాఖ్యలు చేస్తున్నారు.
By: Tupaki Desk | 17 Sep 2024 5:54 AM GMTనోట్లో నుంచి వచ్చే ప్రతి మాటను పట్టుకొని లాగి.. పీకి.. క్లాస్ ఇస్తున్నారు మాజీ మంత్రి కేటీఆర్. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోటి నుంచి వచ్చే ప్రతి మాటకు కౌంటర్ ఇవ్వటమే ధ్యేయమన్నట్లుగా ఆయన తీరు మారింది. కొంతకాలం మౌనంగా ఉంటే బాగుంటుందన్న భావన సొంత పార్టీ నేతల్లో వస్తున్నా.. దాన్ని పట్టించుకోకుండా రేవంత్ మీద ప్రకటించిన ట్వీట్ల యుద్ధం అంతకంతకూ ముదురుతోంది. ఈ విషయాన్ని ముందే గుర్తించిన సీఎం రేవంత్.. ‘ట్విటర్ టిల్లు’ అంటూ వ్యంగ్యస్త్రాన్ని సంధిస్తూ.. కేటీఆర్ కు కొత్త పేరు పెట్టేశారు.
దీనికి కౌంటర్ గా సీఎం రేవంత్ ను ఉద్దేశిస్తూ ఘాటైన వ్యాఖ్యలు చేస్తున్నారు. సెక్రటేరియట్ వద్ద తాజాగా ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి.. ప్రారంభించిన సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ అండ్ కోపై ఘాటుగా రియాక్టు అయ్యారు. సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చేలా తాజాగా ట్వీట్ చేసిన కేటీఆర్.. సీఎం రేవంత్ ను.. ‘చిట్టినాయుడు’గా పేర్కొన్న వైనం సంచలనంగా మారింది.
చిట్టినాయుడు సుభాషితాలు అంటూ కేటీఆర్ చేసిన ట్వీట్ లో పేర్కొన్న అంశాల్ని చూస్తే.. రాజీవ్ గాంధీ కంప్యూటరర్ కినిపెట్టిండు అంటూ రేవంత్ వ్యాఖ్య చేశారంటూ.. ‘కంప్యూటర్ ను కనిపెట్టింది రాజీవ్ గాంధీ కాదు చార్లెస్ బాబేజీ’ అంటూ పేర్కొన్నారు. అదే విధంగా రాజీవ్ గాంధీ కంప్యూటర్ దేశానికి పరిచయం చేసిండు అన్న రేవంత్ వ్యాఖ్యకు కౌంటర్ గా.. ‘టాటా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ అటోమాటిక్ క్యాలిక్యులేటర్ వారు 1956లో ఇండియాలో తొలిసారి కంప్యూటర్ సేవలు ప్రారంభించారని.. అప్పటికి రాజీవ్ గాంధీకి పన్నెండేళ్లుగా పేర్కొన్నారు.
చివర్లో.. ‘ఎదో నోటికొచ్చింది వాగడం.. ఆ తర్వాత దొరికిపోవటం ఎందుకు? నీకు బాగా తెలిసిన రియల్ ఎస్టేట్ దందాలు.. బ్లాక్ మొయిల్ వీటికి పరిమితం అయితే మంచిదమ్మా చిట్టి’’ అంటూ దట్టించిన ఎటకారపు ట్వీట్ ను వదిలారు కేటీఆర్. ట్వీట్ పరంగా చూస్తే.. సీఎం రేవంత్ కు గట్టిగా తగులుకునేదే అయినప్పటికీ.. ఇక్కడో విషయాన్ని మాజీ మంత్రి కేటీఆర్ మిస్ అయ్యారన్న భావన కలుగుతోంది.
వేలెత్తి చూపటం పెద్ద విషయం కాదు. ఒక ప్రముఖుడి గంట ప్రసంగం.. అందునా రాజకీయ రంగానికి చెందిన వారుజ. అందులోనూ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న ప్రముఖుడు మాట్లాడిన మాటను కండకు కండ కోసి.. ముక్కలుగా మార్చి.. ఫలానా ముక్కకు ఫలానా పంచ్ అన్నట్లుగా స్పందించటంతో సమస్యేనన్నది మర్చిపోతున్నారు. కేటీఆర్ కానీ ఆయన తండ్రి కేసీఆర్ కానీ మాట్లాడిన మాటల్ని ఇదే లెక్కన కోసినా... ఇలానే ఎటకారం చేసుకోవచ్చు. అక్కడ మాట్లాడిన మాటల నేపథ్యంలో.. భావం ముఖ్యమే తప్పించి.. మాటల చుట్టుకొలతల లోతుల్లోకి వెళ్లటం ద్వారా సాధించేది ఏమీ ఉండదు. మహా అయితే.. రేవంత్ మాటల్లో తప్పుల్ని భలేగా పట్టుకున్నాడన్న భావన కొందరికి కలిగితే.. ఎక్కువ మందికి మరీ ఇంత రంధ్రాన్వేషణ అన్న విసుగు కలగటం ఖాయం. అదే జరిగితే.. కేటీఆర్ ఎట‘కారం’లోని కోరు ఆయన్నే ఉక్కిరిబిక్కిరి చేస్తుందన్న విషయాన్ని గుర్తించాలి.