రేవంత్ కు నిద్రలోనూ కేసీఆర్ గుర్తుకొస్తున్నారట!
అందుకు భిన్నంగా కేటీఆర్ వైఖరి ఉండటమే విచిత్రంగా చెప్పాలి. రోటీన్ కు ఏ మాత్రం తగ్గకుండా మరోసారి ముఖ్యమంత్రి రేవంత్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
By: Tupaki Desk | 26 Feb 2025 10:31 AM GMTకొందరు కొన్ని మాటలు మాట్లాడకుంటేనే బాగుంటుంది. ఈ విషయాన్ని బీఆర్ఎస్ కీలక నేత కేటీఆర్ ఎప్పటికి గుర్తిస్తారో? నిత్యం ఏదో ఒకటి మాట్లాడితే తప్పించి తన ఉనికి ఉండదని ఆయన భావిస్తున్నారా? ఒకవేళ అలాంటిదే ఉంటే.. తన తండ్రి కేసీఆర్ ను కేటీఆర్ గుర్తుకు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తన తండ్రి సుదీర్ఘ రాజకీయ జీవితాన్ని చూస్తే.. తన అవసరం వచ్చే వరకు ఓపిగ్గా వెయిట్ చేస్తారు. జనం తన కోసం తపించేలా చేస్తారే తప్పించి.. తన మనసులోని తపనను ప్రజలకు తెలియజేసే సిద్ధాంతానికి కేసీఆర్ దూరంగా ఉంటారు.
అందుకు భిన్నంగా కేటీఆర్ వైఖరి ఉండటమే విచిత్రంగా చెప్పాలి. రోటీన్ కు ఏ మాత్రం తగ్గకుండా మరోసారి ముఖ్యమంత్రి రేవంత్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే.. ఆయన సీఎం రేవంత్ ను ఉద్దేశించి మాట్లాడిన ప్రతిసారీ.. పదేళ్ల తమ పదవీ కాలంలో చేసిన తప్పులే గుర్తుకు వచ్చేలా ఆయన మాటలు ఉండటం గమనార్హం. ఉదాహరణకు రైతుల ఆత్మహత్యల గురించి ప్రస్తావిస్తూ.. ‘గడిచిన 48 గంటల్లో ఏడుగురు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. రేవంత్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. ఎస్ఎల్ బీసీ ప్రమాదంలో 8 మంది కార్మికులు చిక్కుకున్నా.. ఢిల్లీ పర్యటనకు వెళ్లారు’ అని మండిపడ్డారు.
రైతుల ఆత్మహత్యల అంశాన్నే తీసుకుంటే.. పదేళ్లలో ఎన్ని వేల మంది ఆత్మహత్యలు చేసుకున్నారు? చివరకు జాతీయ నివేదికల్లోనూ తెలంగాణలోరైతుల ఆత్మహత్యలు ఎక్కువగా ఉన్నాయన్న రోజున కూడా రివ్యూ చేశారా? కీలక ప్రకటన చేశారా? అవన్నీ పక్కన పెట్టేసి.. మొత్తం తొమ్మిదిన్నరేళ్లలో ఆత్మహత్యలు చేసుకున్న రైతుల ఇళ్లకు కేసీఆర్ వెళ్లారా? వారిని పరామర్శించారా? అన్న ప్రశ్న గుర్తుకు తెచ్చేలా కేటీఆర్ వ్యాఖ్యలు ఉంటున్నాయి.
ఎస్ఎల్ బీసీ ప్రమాదం జరిగి.. రెస్క్యూ ఆపరేషన్ జరుగుతున్న వేళలో ముఖ్యమంత్రి వెళ్లటానికి మించిన తప్పు మరొకటి ఉండదు. ఎందుకంటే.. సహాయకచర్యలకు ఆటంకం కలిగే అవకాశం ఉంది. దానికి బదులుగా ఇప్పటికే రాష్ట్ర మంత్రులు ముగ్గురు.. నలుగురు అక్కడే ఉండటాన్ని మర్చిపోలేం. కేటీఆర్ మాటల్ని విన్నంతనే..కొండగట్టులో చోటు చేసుకున్న మహా విషాద ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 57 మంది మరణించారు. 32 మంది గాయపడ్డారు. కొండగట్టు దేవాలయం నుంచి తిరిగి వస్తున్న వేళలో చోటు చేసుకున్న ఈ ప్రమాదం వేళలో.. అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ బాధితుల ఇళ్లకు వెళ్లి పరామర్శించారా? లేదంటే.. అందరిని ఒకచోటుకు చేర్చి.. వారిని ఓదార్చారా? ఒక ఘటనలో అంత మంది ఒక్కసారి స్పందిస్తేనే.. ఫామ్ హౌస్ కే పరిమితమైన ఉదంతాన్ని గుర్తుకు తెచ్చేలా కేటీఆర్ మాటలు ఉన్నాయంటున్నారు.
అందుకే.. తొందరపాటుతో సీఎం రేవంత్ ను టార్గెట్ చేయాలన్న తహతహ తమకే నష్టం వాటిల్లేలా చేస్తుందన్న విషయాన్ని కేటీఆర్ ఎప్పటికి గుర్తిస్తారో? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నిద్రలో కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గుర్తుకు వస్తున్నారని.. ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అవుతానని ఆయన కలలో కూడా ఊహించుకోలేదన్న ఎద్దేవా.. ఇప్పుడున్న పరిస్థితుల్లో అస్సలు సూట్ కాదన్న విషయాన్ని కేటీఆర్ ఎందుకు మిస్ అవుతున్నట్లు? చూస్తుంటే.. తనకు రేవంత్ రోజూ నిద్రలో వస్తున్న విషయాన్ని.. ముఖ్యమంత్రికి ఆపాదిస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారా? అంటూ కేటీఆర్ ను ఎటకారం ఆడేస్తున్నారు.