కేటీఆర్ లో భయం మొదలైందా ఈ-రేస్ కేసులో..?
ఫార్ములా ఈ-రేసు వ్యవహారంలో నమోదైన ఈ కేసులో అరవింద్ కుమార్ (ఏ2), చీఫ్ ఇంజినీర్ బీ.ఎల్.ఎన్. రెడ్డి (ఏ3) లనూ ఎఫ్.ఐ.ఆర్. లో చేర్చింది ఏసీబీ.
By: Tupaki Desk | 20 Dec 2024 10:04 AM GMTఅప్పటి మున్సిపల్ శాఖ మంత్రిగా వ్యవహరించిన కేటీఆర్ ను ప్రధాన నిందితుడి (ఏ1) గా పేర్కొంటూ తెలంగాణ ఏసీబీ నమోదు చేసిన కేసు తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఫార్ములా ఈ-రేసు వ్యవహారంలో నమోదైన ఈ కేసులో అరవింద్ కుమార్ (ఏ2), చీఫ్ ఇంజినీర్ బీ.ఎల్.ఎన్. రెడ్డి (ఏ3) లనూ ఎఫ్.ఐ.ఆర్. లో చేర్చింది ఏసీబీ.
అవును... ఫార్ములా ఈ-రేస్ వ్యవహారంలో బీఆరెస్స్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తో మున్సిపల్ శాఖ అప్పటి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ (ఏ2), హెచ్.ఎం.డీ.ఏ. అప్పటి చీఫ్ ఇంజినీర్ బీ.ఎల్.ఎన్. రెడ్డి (ఏ3) తెలంగాణ ఏసీబీ కేసు నమోదు చేయడం ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది.
ఈ సమయంలో ఎఫ్.ఐ.అర్. కు ముందు.. ఎఫ్.ఐ.ఆర్. తర్వాత కేసుల విషయంలో కేటీఆర్ వాయిస్ లో మార్పు వచ్చిందని.. ఆయనకు భయం పట్టుకున్నట్లు ఉందని.. పైగా తనపై పెట్టిన నాలుగు సెక్షన్లూ నాన్ బెయిలబుల్ కావడంతో ఒకసారి లోనికి వెళ్తే కనీసం 14 రోజులు తప్పదనే ఆందోళన మొదలైనట్లుందనే చర్చ బలంగా మొదలైందని అంటున్నారు.
ఈ సమయంలో ఈ తరహా వాదన తెరపైకి రావడానికి గల కారణాలు ఏమిటి..? అందులో సహేతుకత ఎంత..? అనేది ఇప్పుడు చుద్దామ్..!
కేటీఆర్ ఫస్ట్ రియాక్షన్!:
తనపై తెలంగాణ ఏసీబీ కేసు నమోదు చేయడంపై కేటీఆర్ ఘాటుగా స్పందించారు. ఇందులో భాగంగా... ఫార్ములా - ఈ రేసు వ్యవహారంలో తాను ఎలాంటి తప్పు చేయలేదని.. అసలు ఆ వ్యవహారంలో అవినీతే జరగలేదని.. అవినీతే లేనప్పుడు ఏసీబీ కేసు ఎక్కడుందని అన్నారు. ఇవి రేవంత్ మార్కు రాజకీయ వేధింపులని అన్నారు!
ఇందులో భాగంగా... ముఖ్యమంత్రి, ఆయన కుటుంబం చేస్తున్న అవినీతి, కుంభకోణాలను ఒక్కొక్కటిగా బయట పెడుతున్నందుకే ఇదంతా చేస్తున్నారని.. అయితే... తాము ఉద్యమకారులమని, ఎన్ని కేసులు పెట్టుకున్నా భయపడేది లేదని.. ‘మా వెంట్రుక కూడా పీకలేవ్’ అని స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు.
అసెంబ్లీలో చర్చకు బీఆరెస్స్ పట్టు!:
మరోపక్క ఈ వ్యవహారం శాసన సభలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. ఫార్ములా ఈ-రేసుపై ఏసీబీ కేసు నమోదు చేయడం.. దీనిలో ఏ-1 గా కేటీఆర్ పేరును చేర్చడంపై ఆ పార్టీ ఎమ్మెల్యేలు శాసనసభలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సమయంలో ఫార్ములా ఈ-రేసు అంశంపై చర్చకు పట్టుబట్టారు. అయితే స్పీకర్ అందుకు అంగీకరించలేదు.
భూ భారతి బిల్లుపై ప్రభుత్వం చర్చకు సిద్ధమైన నేపథ్యంలో ఫార్ములా-ఈ రేస్ పై తర్వాత చర్చిద్దామని స్పీకర్ ప్రసాద్ కుమార్ అన్నారు. ఇదే సమయంలో... ఫార్ములా ఈ-రేస్ అంశం ఒక వ్యక్తికి సంబంధించినదని.. భూ భారతి బిల్లు రాష్ట్ర ప్రజలకు చెందినదని వ్యాఖ్యానించారు. దీంతో... బీఆరెస్స్ నేతలు సభలో తీవ్ర గందరగోళం సృష్టించారని అంటున్నారు.
ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఎంట్రీ:!
ఈ క్రమంలో.. ఫార్ములా ఈ-రేసు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా... ఈ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎంట్రీ ఇచ్చింది. ఈ సందర్భంగా ఈ కేసులో ఏసీబీ నమోదు చేసిన ఎఫ్.ఐ.ఆర్. తో పాటు పలు డాక్యుమెంట్లు ఇవ్వాలని ఈడీ అధికారులు కోరారు. ఈమేరకు ఏసీబీకి లేఖ రాశారు. దీంతో... ఈడీ ఎంట్రీపై ఆసక్తికర చర్చ మొదలైంది.
జైలు కెళ్లి యోగా చేస్తానన్నారుగా..?:
ఇటీవల కేటీఆర్ ను అరెస్ట్ చేసే అవకాశం ఉందనే చర్చ తీవ్రంగా నడిచిన సమయంలో స్పందించిన కేటీఆర్... తనను అరెస్ట్ చేస్తే జైలు కెళ్లి కాస్త యోగా చేసుకుంటాను అంటూ చాలా రిలాక్స్ గా స్పందించారని అంటారు. ఈ నేపథ్యంలో ఆ విషయాన్ని గుర్తుచేస్తూ మంత్రి సీతక్క ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇందులో భాగంగా... గవర్నర్ క్లియరెన్స్ ఇచ్చిన కేసుకు సభలో చర్చ అవసరం లేదని చెప్పిన సీతక్క... బీఏసీలో ఫార్ములా ఈ-రేసు మీద చర్చ కోసం బీఆరెస్స్ ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. ఈ సందర్భంగా... జైలుకు వెళ్లి యోగా చేస్తానన్న కేటీఆర్ ఇప్పుడు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు.
కేటీఆర్ ఏ తప్పూ చేయకపోతే విచారణ ఎదుర్కొని నిర్దోషిగా బయటకు రావొచ్చు కదా అని అడిగారు. ఇదే సమయంలో... తన సమస్యను రాష్ట్ర ప్రజల సమస్యగా చిత్రీకరించే ప్రయత్నం కేటీఆర్ చేస్తున్నారని.. చట్టం ముందు అంతా సమానమే అని.. ఫార్ములా ఈ-రేస్ కేసులో విచారణ ఎదుర్కోవాల్సిందే అని సీతక్క స్పష్టం చేశారు.
హైకోర్టును ఆశ్రయించిన కేటీఆర్:
ఓ పక్క పరిణామాలు తీవ్రరూపం దాల్చుతున్నట్లు కనిపిస్తున్న నేపథ్యంలో కేటీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా... ఫార్ములా ఈ-రేస్ వ్యవహారంలో ఏసీబీ తనపై కేసు నమోదు చేయడంతో.. హైకోర్టును ఆశ్రయించారు. ఉన్నత న్యాయస్థానంలో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.
కేటీఆర్ లో భయం మొదలైందా..?:
తనను అరెస్ట్ చేస్తే జైలుకు వెళ్లి యోగా చేసుకుంటాను... అనేది కేటీఆర్ ఫస్ట్ రియాక్షన్! కాగా... తాను ఉద్యమకారుడిని, కక్ష సాధింపులో భాగంగానే కేసులు పెడుతున్నారు.. నా వెంట్రుక కూడా పీకలేరు అంటూ చేసిన వ్యాఖ్యలు రెండో రియాక్షన్! అయితే... తాజాగా మీడియాతో చిట్ చాట్ సందర్భంగా కేటీఆర్ వాయిస్ లో మార్పు స్పష్టంగా కనిపించిందనే చర్చ మొదలైంది.
తనపై నమోదైన ఫార్ములా-ఈ రేస్ కేసు వ్యవహారంలో తొలుత కాస్త స్ట్రాంగ్ గా, ధైర్యంగా మాట్లాడుతున్నట్లు కనిపించిన కేటీఆర్... అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో చిట్ చాట్ సందర్భంగా మాట్లాడుతూ.. మంత్రి పొన్నం ప్రభాకర్ మాటలతో తనపై నమోదైన కేసులో అవినీతి లేదని తేలిందని చెప్పుకొచ్చారు.
ఇదే సమయంలో... హెచ్.ఎం.డీ.ఏ.లో చేసే ప్రతీ పనికి ప్రభుత్వం అనుమతి అవసరం లేదని.. దానికి ఆ మేరకు స్వతంత్రత ఉందని.. ఫార్ములా ఈ-రేసులో కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారని.. ముఖ్యమంత్రా, మంత్రులా.. ఎవరు తప్పుదోవ పట్టిస్తున్నారో తెలియాలని అన్నారు.
ఈ నేపథ్యంలోనే... కేసుల విషయంలో, ఆరోపణల విషయంలో నిన్నమొన్నటివరకూ కేటీఆర్ రియాక్షన్ ఒకలా ఉంటే, ఒకసారి ఎఫ్.ఐ.ఆర్. న మోదైన తర్వాత మాటలో కాస్త మార్పు వచ్చిందని అంటున్నారు పరిశీలకులు! క్వాష్ పిటిషన్ వేయడం, పొన్నం ప్రభాకర్ చెప్పారు కాబట్టి అందులో అవినీతి లేదని తేలిందని అనడం ఇందుకు ఉదాహరణలని అంటున్నారు!
మంత్రి చెప్పారు అని అంటూ లీగల్ ఇష్యూని పొలిటీషియన్ స్టేట్ మెంట్ తో క్లారిటీ వచ్చినట్లు మాట్లాడే ప్రయత్నం చేయడం చూస్తుంటే.. తనకు తాను ధైర్యం చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నట్లుగా ఉందని అంటున్నారని తెలుస్తోంది.
కాగా... హెచ్.ఎం.డీ.ఏ నిబంధనల ప్రకారం రూ.10 కోట్ల కంటే ఎక్కువ ఎవరికైనా చెల్లించాల్సి వస్తే తప్పనిసరిగా ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాలి.. అలాంటి అనుమతులు ఏమీ లేకుండానే సాధారణ నిధుల నుంచి మొత్తం రూ.54.88 కోట్లు చెల్లించారని.. ఏసీబీ ఎఫ్.ఐ.ఆర్. లో పేర్కొందని అంటున్న సంగతి తెలిసిందే.
దీంతో.. కేటీఆర్ చెబుతున్నట్లు హెచ్.ఎం.డీ.ఏ.కు అంత స్వతంత్రతే ఉంటే ధైర్యంగా ఉండొచ్చని.. పొన్నం ప్రభాకర్ మాటలో, మరొకటో ప్రస్థావించాల్సిన అవసరం లేదని.. ధైర్యంగా కేసులు ఎదుర్కోవచ్చని అంటున్నారని తెలుస్తోంది.