కాంగ్రెస్ కు థ్యాంక్స్: పెద్ద మేకల వ్యాపారిని ఇచ్చింది.. కేటీఆర్ సటైర్లు
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఓసారి తెలంగాణకు వచ్చి... ఇక్కడ మేకల వ్యాపారం ఎంత బాగా జరుగుతోందో చూడాలని వ్యాఖ్యానించారు.
By: Tupaki Desk | 12 Nov 2024 3:03 PM GMTతెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ ఎస్ నాయకుడు కేటీఆర్.. అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీపై సటైర్లు వేశారు. తెలంగాణకు ఆ పార్టీ అతి పెద్ద మేకల వ్యాపారిని అందించిందన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఓసారి తెలంగాణకు వచ్చి... ఇక్కడ మేకల వ్యాపారం ఎంత బాగా జరుగుతోందో చూడాలని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఎమ్మెల్యేలను మేకలు, గొర్రెల మాదిరిగా సీఎం రేవంత్ రెడ్డి కొనుగోలు చేస్తున్నారని.. ఇంత పెద్ద మేకల వ్యాపారిని అందించినందుకు కాంగ్రెస్‌కు థ్యాక్స్ చెబుతున్నామన్నారు.
తాజాగా ఢిల్లీ పర్యటనలో ఉన్న కేటీఆర్.. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ``మహారాష్ట్రలో తమ పార్టీ ఎమ్మెల్యేలను మోడీ మేకలు, గొర్రెల లెక్క కొంటున్నడని ఖర్గే సర్ వాపోతున్నరు. మరి తెలంగాణకు మీరు చేసిందేంటి? అంతకన్నా పెద్ద మేకల వ్యాపారిని అందించలేదా? ఇక్కడ ఎమ్మెల్యేలను, ఎంపీలను కొనడం లేదా? `` అని కేటీఆర్ ప్రశ్నించారు. మహారాష్ట్రలో చిన్న కొట్టు తెరిస్తే.. ఇక్కడ ఏకంగా అతి పెద్ద మేకల మార్కెట్టే ఏర్పాటు చేశారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
సీఎం రేవంత్‌రెడ్డి ప్రజల పనులు మానేసి.. మా నాయకుల ఇళ్లకు వెళ్లి మరీ బేరాలు కుదుర్చుకుని కండువాలు కప్పుతున్నాడని కేటీఆర్ అన్నారు. ``తెలంగాణ మేకల మార్కెట్‌కు ఖర్గే సార్ రావాలి. నేనే ఘన స్వాగతం పలుకుతా`` అని చెప్పారు. బీఆర్ ఎస్ కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలను ఏ విధంగా కాంగ్రెస్‌లో చేర్చుకున్నారో చెప్పాలని కేటీఆర్ ప్రశ్నించారు. నీతులు చెప్పేందుకు కాదు.. చేసేందుకు కూడా జ్ఞానం ఉండాలని విమర్శించారు. తాము అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఒక విధంగా అధికారంలో లేకపోతే మరో విధంగా వ్యవహరిస్తారా? అని నిలదీశారు.