Begin typing your search above and press return to search.

అదే టోన్ తో కేటీఆర్ !

హైకోర్టులో కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్ ని కొట్టివేసిన నేపథ్యంలో ఆయన మీడియా ముందుకు వచ్చి తన మనసులో అభిప్రాయాలను పంచుకున్నారు.

By:  Tupaki Desk   |   8 Jan 2025 4:15 AM GMT
అదే టోన్ తో కేటీఆర్ !
X

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ స్వరంలో ఎలాంటి మార్పూ లేదు. ఆయన చాల నిబ్బరంగా బిగ్గరగానే మాట్లాడుతున్నారు. తాను ఏ రకమైన అవినీతికి పాల్పడలేదని ఆయన అంటున్నారు. హైకోర్టులో కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్ ని కొట్టివేసిన నేపథ్యంలో ఆయన మీడియా ముందుకు వచ్చి తన మనసులో అభిప్రాయాలను పంచుకున్నారు.

తన మీద పెట్టిన కేసు లొట్టి పిట్ట కేసు అని ఆయన సెటైర్లు వేశారు. అసలు తాను పైసా కూడా అవినీతి చేయని ఈ కేసు విషయంలో ఏదో జరిగిపోతున్నట్లు కాంగ్రెస్ నేతలు ఊహించేసుకుని స్వీయ ఆనందం పొందుతున్నారు అని కేటీఆర్ ఫైర్ అయ్యారు.

పచ్చ కామెర్ల రోగికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందని అలాగే కాంగ్రెస్ నేతలకు తాను అవినీతి చేసినట్లుగా కనిపిస్తున్నాను అని ఆయన అంటున్నారు. ఈ కేసు విషయంలో తాను రాజ్యాంగబద్ధంగా తనకు ఉన్న అన్ని హక్కులను ఉపయోగించుకుని పోరాటం చేస్తాను అని ఆయన స్పష్టం చేశారు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ ఫార్ములా కేసు మీదనే అసక్తి ఉందని తనకు మాత్రం ఫార్మర్ల సమస్యల మీద ఆసక్తి ఉందని కేటీఆర్ అంటున్నారు. కాంగ్రెస్ విధానం అంతా డిస్త్రక్షన్, డిస్త్రాక్షన్, డిసెప్షన్ అని ఆయన విమర్సించారు. రేవంత్ రెడ్డి కక్ష సాధింపు రాజకీయాలు ఎన్ని చేసినా తనను ఏమీ చేయలేరని ఆయన అన్నారు.

ఇదిలా ఉండగా లాయర్ల సమక్షంలోనే ఈ కేసులో విచారణ జరగాలని తాను హైకోర్టులో పిటిషన్ వేయబోతున్నట్లుగా కేటీఆర్ చెప్పారు. తనకు చట్టపరంగా రక్షణ కల్పించాలని కోరుతానని ఆయన అన్నారు. లాయర్లతో విచారణకు హాజరు కావొద్దని అటున్నారని ఇలాగే తన పార్టీకి చెందిన నాయకుడు పట్నం నరేంద్రరెడ్డి ఇవ్వని స్టేట్మెంట్ ఇచ్చినట్లుగా చూపించారని ఆయన అన్నారు.

అధికారాన్ని అడ్డం పెట్టుకుని తమ మీద కేసులు బనాయిస్తున్నారని అందుకే తాను సుప్రీం కోర్టుని ఈ కేసు విషయంలో ఆశ్రయిస్తానని ఆయన చెప్పారు. తాను చట్టాలను గౌరవిస్తానని అందుకే ఏసీబీ విచారణకు హాజరయ్యానని కేటీఆర్ చెప్పారు. తనకు ఉరి శిక్ష పడినంత హడావుడిని కాంగ్రెస్ నేతలు చేస్తున్నారు అని ఆయన మండిపడ్డారు. తన క్వాష్ పిటిషన్ ని హైకోర్టు కొట్టేయడంతో కాంగ్రెస్ నాయకులే న్యాయమూర్తులు మాదిరిగా ఏదేదో జరిగిపోతుందని ఎవరికి తోచిన తీరున తీర్పులు ఇస్తున్నారు అని ఆయన అన్నారు.

కాంగ్రెస్ నేతలు అవినీతి కళ్ళతో చూస్తున్నారని కానీ తాను ఏ తప్పూ చేయలేదని కేటీఆర్ గట్టిగా సమర్ధించుకున్నారు. తాను ఈ కేసు విషయంలో న్యాయపరంగా తనకు ఉన్న అన్ని అవకాశాలు వాడుకుంటానని ఆయన అన్నారు. మొత్తానికి కేటీఆర్ తాను అన్నింటికీ రెడీ అని అంటున్నారు. తాను ఏ తప్పూ చేయలేదని కూడా చెబుతున్నారు. కాంగ్రెస్ నాయకుల ఆనందం అంతా తాత్కాలికమే అని తాను సచ్చీలుడిగా ఈ కేసు నుంచి బయటపడతాను అని ఆయన అంటున్నారు. మరి చూడాలి ఈ కేసులో రానున్న రోజులలో ఏ రకమైన పరిణామాలు జరుగుతాయో. ఏ రకమైన సంచలనాలు నమోదు అవుతాయో.