Begin typing your search above and press return to search.

కేటీఆర్ కామెంట్స్... "సీఎం పేరు మరిచిపోతేనే హీరోని అరెస్ట్ చేస్తారా?"

'పుష్ప-2' బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య 70 ఎంఎం థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అయ్యిందనేది తెలిసిన విషయమే.

By:  Tupaki Desk   |   17 Dec 2024 5:32 PM GMT
కేటీఆర్  కామెంట్స్... సీఎం పేరు మరిచిపోతేనే హీరోని  అరెస్ట్  చేస్తారా?
X

‘పుష్ప-2’ బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య 70 ఎంఎం థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అయ్యిందనేది తెలిసిన విషయమే. ఈ ఘటనలో ఒక మహిళ మృతి చెందగా.. బ్రెయిన్ డ్యామేజ్ అయిన ఆమె కుమారుడు సుమారు రెండు వారాలుగా ఆస్పత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న పరిస్థితి.

మరోపక్క ఈ ఘటనపై నమోదైన కేసులో ఇప్పటికే థియేటర్ యాజమాన్యం, అల్లు అర్జున్ వ్యక్తిగత భద్రతా సిబ్బంది అరెస్ట్ కాగా.. ఇటీవల అరెస్టైన అల్లు అర్జున్ కు హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో చంచల్ గూడ జైల్లో ఒక్కరోజు ఉండి విడుదలయ్యారు! ఇక... ఈ వ్యవహారంపై రాజకీయ దుమారం తీవ్రంగా లేచిందనే చర్చ వినిపిస్తుంది.

ప్రధానంగా ఈ వ్యవహారంపై ఘాటుగా స్పందిస్తున్న బీఆరెస్స్ శ్రేణులు.. అల్లు అర్జున్ అరెస్ట్ ను కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రగా అభివర్ణించడం మొదలుపెట్టారు. ఇది పూర్తిగా రేవంత్ రెడ్డి కనుసన్నల్లో జరిగిన ఓ వ్యూహాత్మక ప్రక్రియ అనే స్థాయిలో విమర్శిస్తున్నారు. అయితే... రేవంత్ రెడ్డి మాత్రం అల్లు అర్జున్ అరెస్టు పై తనదైన స్పష్టత ఇచ్చారు.

ఇందులో భాగంగా... తమ ప్రభుత్వానికి సినిమా స్టార్, పొలిటికల్ స్టార్ అనే తారతమ్యాలు ఏవీ ఉండవు.. తప్పు చేసింది ఎవరు అనేది మాత్రమే తమ ప్రభుత్వం చూస్తుందని చెప్పుకొచ్చారు. అయితే... అల్లు అర్జున్ అరెస్టుకు అసలు కారణం ఇదే అన్నట్లుగా ఓ ఆసక్తికర విషయాన్ని ప్రస్థావించారు బీఆరెస్స్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.

అవును... సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనకు సంబంధించిన కేసులో అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పటి నుంచీ రేవంత్ రెడ్డి లక్ష్యంగా బీఆరెస్స్ తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి స్పందించిన కేటీఆర్... 'పుష్ప-2' సక్సెస్ మీట్ లో సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవడమే అల్లు అర్జున్ చేసిన తప్పా? అని ప్రశ్నించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ... సీఎం పేరు మరిచిపోయినంత మాత్రాన్న అరెస్ట్ చేస్తారా? అని నిలదీశారు. అల్లు అర్జున్ సీఎం పేరు మరిచిపోయారని.. దీంతో రేవంత్ కు మండినట్లుందని.. దీంతో అరెస్ట్ చేశారని.. పేరు మరిచిపోతేనే అరెస్ట్ చేస్తారా.. ఇంత అన్యాయమా అన్నట్లుగా కేటీఆర్ స్పందించారు.

కొడంగల్ నియోజకవర్గానికి చెందిన బీఅరెస్స్ ముఖ్యనేతలతో తెలంగాణ భవన్ లో సమావేశమైన సందర్భంగా స్పందించిన కేటీఆర్.. ఈ మేరకు ఈ వ్యాఖ్యలు చేశారు.